వైభవంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు
పూల సింగిడి సందడి చేసింది..
సద్దుల సంబురం కనులవిందు చేసింది
ఆడిపాడిన ఆడపడచులు..యువత కేరింతలు
వచ్చే యేడాది రావాలంటూ వేడుకోలు
తొమ్మిది రోజుల పాటు సందడి చేసిన బతుకమ్మ సంబరాలు ముగిసాయి. వచ్చే యేడాది మళ్లీ రావమ్మా అంటూ ఆడపడచులు వీడ్కోలు పలికారు. సద్దుల బతుకమ్మతో ఊరూవాడ సందడిగా కొనసాగింది. ఆడపడుచుల వీడ్కోలుతో బతుకమ్మ సాగిపోయింది. తెలంగాణలో ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు పూల జాతరతో జరుపుకున్న బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగిసింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా పల్లె, పట్నం, ఊరూ, వాడా, తంగేడు, గునుగు పువ్వుల వనాలయ్యాయి. తెలంగాణ ప్రాంతమంతా విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోయింది. మొత్తంగా సద్దుల బతుకమ్మ పండుగ సంబురంగా ముగిసింది. తెలంగాణ ఇంట ఆడబిడ్డలు తొమ్మిది రోజులపాటు రకరకాలపూలతో ఆనందంగా జరుపుకొన్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా ఆడబిడ్డలు రామ రామ రామ ఉయ్యాలో.. తొమ్మిది రోజులు ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. ముప్పై మూడు జిల్లాల తెలంగాణ బిడ్డలకు దీవెనలు ఇస్తూ బతుకమ్మ.. గంగమ్మ ఒడికి చేరింది. పూల సింగిడి సందడి చేసింది.. సద్దుల సంబురం కనులవిందు చేసింది.. ఆడపడుచుల ఆనందం ఆకాశాన్నంటింది.. తొమ్మిదిరోజుల పాటు సంబురంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకలను ఆడపడుచులు సంబురంగా జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగవైభవంగా జరిగాయి. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొని చివరిరోజు ట్యాంక్‌బండ్‌తో సహా, జిల్లాల్లో భారీ బతుకమ్మతో వేడుకలు నిర్వహించుకోగా సద్దుల బతుకమ్మను మహిళా మణులు భారీ బతుకమ్మలతో ఆడిపాడారు. అన్ని గ్రామాల్లో పూలపండగతో మహిళలు సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చివరి రోజు ప్రతీ ఇంటా బతుకమ్మను పేర్చి ఇళ్లవాకిళ్ల ఎదుట బతుకమ్మ పాటలతో ఆడిపాడి చివరికి బతుకమ్మ ఘాట్‌ల వద్ద కూడా చిందేశారు. బతుకమ్మ ఉత్సవంలో చివరిరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. ఆడపడుచులతో ఆడిపాడి సంబురం లో పాల్గొన్నారు. గల్లీల నుంచి పట్నం వరకు చిన్నారుల నుంచి పెద్దల వరకు బతుకమ్మ ఉత్సవాలను కనుల పండువగా జరుపుకున్నారు. ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతో ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని కార్యాలయాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోజుకొక శాఖ ఉద్యోగులు కార్యాలయాల్లో బతుకమ్మలు పేర్చి డీజే పాటలతో సందడి చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలు ట్యాంక్‌బండ్ వద్ద సంబరంగా సాగాయి. సాంస్కృతిక కళారూపాలతో,
పెద్దఎత్తున డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో ట్యాంక్‌బండ్‌వరకు ఊరేగింపు కళాత్మకంగా సాగింది. రాత్రి పొద్దుపోయేవరకు ట్యాంక్‌బండ్‌పై ఆడబిడ్డలు బతుకమ్మ ఆడారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వేల మంది మహిళలు ఆడిపాడారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సద్దుల పండుగ ఉత్సాహంగా సాగింది. పలు ప్రాంతాల్లో ఉత్తమ పాట, ఆటలకు బహుమతులు ప్రకటించడంతో ఆడిపాడేందుకు యువతులు పోటీపడ్డారు. సిద్దిపేటలో పెద్ద ఎత్తున కోమటి చెరువు వద్ద ఆడిపాడారు.