- 25 ఏళ్ల తెలంగాణ సాహిత్యంపై విశేష చర్చ
- 25 కొత్త పుస్తకాలు ఆవిష్కరణ
హైదరాబాద్, ఆగస్ట్ 23 : సామాజిక న్యాయమే రచయిత బి. ఎస్. రాములు లక్ష్యం అని, తన రచనలతో ఉపన్యాసాలతో జీవన నైపుణ్య కార్యశాలలు నిర్వహించిన తాత్వికవేత్త అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ముఖ్య కార్యదర్శి, కవి డా. ఎ. విద్యాసాగర్ అభినందించారు. జన చైతన్య మార్గాన్వేషకుడు బి. ఎస్. రాములు గొప్ప సృజనశీలి అని కవితాత్మకంగా ఆయన కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో విశాల సాహిత్య అకాడమీ, సామాజిక తాత్విక విశ్వ విద్యాలయం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత, తెలంగాణ బిసి కమిషన్ తొలి చైర్మన్ బి. ఎస్. రాములు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమృతోత్సవ వేడుకల సందర్భంగా పాతికేళ్ల తెలంగాణ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ అమానవీయ అసమానతల సమాజంలో ప్రేమను జ్ఞానాన్ని పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తున్న బి. ఎస్. రాములు ధన్యజీవి అని, పాత బాటపై తనదైన కొత్త రాళ్ళు పాతిన గొప్ప తాత్వికవేత్త అని అభినందించారు. సభాధ్యక్షత వహించిన గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్, దర్శకుడు బి. నర్సింగరావు మాట్లాడుతూ బి. ఎస్. రాములు ఉద్యమ ప్రవాహం అని అభివర్ణించారు. తెలంగాణ సాహిత్య సామాజిక రాజకీయ తాత్విక రంగాల్లో అద్భుత ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తన అమృతోత్సవ వేడుకల్లో తెలంగాణ సాహిత్యం గురించి చర్చ ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకం అన్నారు. తాత్విక వాదాన్ని అట్టడుగు వర్గాల స్థాయి నుంచి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో గతి తాత్విక భౌతిక వాదం వ్యాప్తి కోసం విశేష కృషి చేశారని ప్రశంసించారు. చివరగా రచయిత బి. ఎస్. రాములు స్పందిస్తూ తెలంగాణ రచయితలు గుర్తింపు పరంగా వివక్షకు గురవుతున్నారనే ఉద్దేశ్యంతో విశాల సాహితీ పురస్కారాలు ఏర్పాటు చేసి గత పాతికేళ్లుగా ఎంతోమందిని సత్కరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తన లక్ష్యం నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆధిపత్య వర్ణ సిద్ధాంతంతో సమాజం పాడై పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాడికల్ పౌర హక్కుల కళాకారుల సంఘంలో పని చేశానని, గతి తార్కిక సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు తీసుకోకపోవడం వల్లనే దేశం నష్టపోయిందని బి. ఎస్. రాములు అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల్లో సభ్యత్వం ఆపడమే తన ముందున్న లక్ష్యం అని చెప్పారు. ప్రజా స్రవంతిలో జీవిస్తూ సమసమాజం కోసం కృషి చేయాలని, ప్రభుత్వంలో చేరి అధికారంలో వాటా తీసుకోవడంలో తప్పు లేదని, భావజాలం ఎలా ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని నక్సలైట్లకు హితవు పలికారు. సిద్ధాంతాలు ఎలా వున్నా జీవితం మానవత్వం ప్రాధమిక హక్కులు ప్రధానంగా ఇక నుంచి దక్కన్ రచయితల వేదిక గా కృషి చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా పెద్దఎత్తున కవులు, రచయితలు, అధ్యాపకులు పాల్గొని బి. ఎస్. రాములును ఘనంగా సత్కరించారు. 25 ఏళ్ల తెలంగాణ కథ, వచన కవిత, నవల, తెలంగాణ పాట, చరిత్ర, సాహిత్య విమర్శ, బహుజన సాహిత్యం, బాల సాహిత్యం, మహిళా సాహిత్యం, సంపాదకుల భూమిక, ఉద్యమ సాహిత్యం, ఆస్తిత్వ వాదం తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. బి. ఎస్. రాములు తన రచనలపై కీలకోపన్యాసం చేశారు. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, అందెశ్రీ, డా. కంచ ఐలయ్య, డా. కాలువ మల్లయ్య, పాశం యాదగిరి, డా. ప్రభంజన్ యాదవ్, డా. యాకుబ్, డా. పత్తిపాక మోహన్, అన్నవరం దేవేందర్, డా. కోయి కోటేశ్వరరావు, పసునూరి రవీందర్, జనగాం శంకర్, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, డా. ఎస్వి సత్యనారాయణ, అనిశెట్టి రజిత, జూపాక సుభద్ర, బైస దేవదాస్ తదితరులు పాల్గొని వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేశారు. నిర్వాహక కమిటీ అధ్యక్షులు బి. నర్సింగరావు, కన్వీనర్లు డా. సదాశివ్ కర్రె, జ్వలిత, జాజుల గౌరి సమన్వయం చేసి పర్యవేక్షించారు. వివిధ రచయితలకు చెందిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కవులు, రచయితలు హాజరయ్యారు. జ్ఞానాన్ని పంచడంలో భాగంగా ఒక్కొక్కరికి పది పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.