టీమిండియా నయా హెడ్ కోచ్ నియామకంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ కంటే మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేయడం ఉత్తమమని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. దాంతోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే దరఖాస్తు గడవు ముగియగా.. మొత్తం 3వేల అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో చాలా వరకు ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సన్నీలియోన్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఫేక్ అప్లికేషన్స్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై గంభీర్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడరని చెప్పాడు. ప్రముఖ క్రిక్‌వెబ్ సైట్ సైతం ఈ వార్తలను ధృవీకరించింది. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక గురించి ఓ వార్తా సంస్థతో మాట్లాడిన హర్భజన్ సింగ్.. తాను రేసులో లేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన కుటుంబాన్ని వదిలి వెళ్లలేనని, భవిష్యత్తులో అవకాశం వస్తే చూస్తానని చెప్పాడు. తన అభిప్రాయం ప్రకారం టీమిండియా హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను నియమిస్తే ఉత్తమని తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్ పదివి చేపట్టే వారు జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావాలని, సమష్టి ప్రదర్శన చేసేలా కృషి చేయాలన్నాడు. ఆ పనికి ఆశిష్ నెహ్రా సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. గంభీర్ కోచ్‌గా ఎంపికైతే జట్టులో గొడవలు జరిగే అవకాశం ఉందని హర్భజన్ సింగ్ పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా హెడ్ కోచ్ గురించి ప్రస్తుతం వస్తున్న కథనాలన్నీ పుకార్లు మాత్రమే. అయితే టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరూ వచ్చిన టీమ్‌ను ఒకతాటిపైకి తీసుకురావాలి. సమష్టి ప్రదర్శన కనబర్చేలా కృషి చేయాలి. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ లేదా ఆశిష్ నెహ్రా ఎవరికి అవకాశం వచ్చినా.. గతంలో పనిచేసిన వారికంటే అద్భుతంగా పనిచేయాలి. టీమిండియా హెడ్ కోచ్ రేసులో నేను లేను. కుటుంబాన్ని విడిచి అంత సమయం కేటాయించలేను. ప్రస్తుతం నాది చిన్నపిల్లలు ఉన్న కుటుంబం. వారికి నా అవసరం ఎంతో ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపడుతాను.’అని హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు.