టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే ఖాయంగా ఉంది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై గంభీర్ ఆసక్తిగా ఉన్నాడని.. కేకేఆర్ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్‌కి కూడా ఈ విషయం తెలుసని.. ఓ జాతీయ క్రికెట్ మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించింది. అసలు ఇంతకీ హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా.? లేదా.? అనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. ఈ విషయం మాత్రం సోషల్ మీడియా కోడై కూస్తోంది. అలాగే రీసెంట్‌గా ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా ఇదే అంశాన్ని బహిర్గతం చేయడంతో.. ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోసినట్టయింది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్ కుదిరిందని.. అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం జైషా, గంభీర్ మధ్య టీమిండియా హెడ్ కోచ్ విషయంపై చాలాసేపు చర్చ జరిగినట్టు వినికిడి. మరోవైపు టీ20 వరల్డ్‌కప్‌తో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగుస్తుంది. ద్రావిడ్ పదవి ముగియడానికి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఏ క్షణమైనా.. నెక్స్ట్ టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న దానిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చు. కాగా, గంభీర్ మెంటార్‌గా ఉన్న కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. అలాగే పదేళ్లకు ముందు అనగా 2014లో ఇదే జట్టుకు గంభీర్ కెప్టెన్‌గా ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.