సమాజంతో మమేకం కావాలి : పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గురువుల సందేశం
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డైట్ లో 32 సంవత్సరాల తర్వాత ఆనాడు చదువుకున్న ఛాత్రోపాధ్యాయులు గురువారం (ఏప్రిల్ 24) అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గురువులతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులు హాజరైనారు. డైట్ కళాశాలలో తాము చదువుకున్న మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పూర్వస్మృతులను గుర్తు చేసుకుంటూ, ఉపాధ్యాయులుగా తాము సాధించిన విజయాలను, వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకుంటూ ఉల్లాసంగా గడిపారు. సరస్వతి ప్రార్థనతో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమతోపాటు విద్యనభ్యసించి నేడు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న డాక్టర్ కే మల్లేశం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తమకు చదువు చెప్పిన గురువులు తోటి మిత్రులు కొంతమంది చనిపోగా రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి సంతాపం ప్రకటించారు. అప్పటి గురువులు ప్రిన్సిపాల్ బాలయ్య,రాంప్రసాద్, రాజేశ్వరరావు, వజ్రయ్య, సుదర్శన్ రెడ్డి, సత్యనారాయణ, బసవరాజు, విష్ణుమూర్తి ఈ కార్యక్రమంలో హాజరై తమ సందేశాలను వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1992 – 93 లో టిటిసి విద్యను అభ్యసించి నేడు ఆదర్శ ఉపాధ్యాయులుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ఉపాధ్యాయులందరూ తమ విద్యార్థులే కావడం గర్వకారణంగా ఉందన్నారు. పేద బడుగు బలహీనవర్గాల ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నందున వారిని తమ పిల్లలుగా భావించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ వారి భావి జీవితానికి చక్కని పునాదులు వేయాలని సూచించారు. అనంతరం బ్యాచ్ విద్యార్థులందరూ తమ గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కోశాధికారి ఏ. రాజేష్, శ్రీనివాసరాజు, భాస్కర్, బైరెడ్డి వెంకటరెడ్డి, హరిత, సుజాత, అంకం శ్రీనివాస్, ఆర్ లక్ష్మణరావు, రాజ నరేష్ జి వెంకటేశ్వర్లు, ఆర్ శ్రీనివాస్ బుచ్చి రామయ్య తదితరులు పాల్గొన్నారు.