- ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది
ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రదర్శించిన ఆయా అంశాలు చూడముచ్చటగా అర్ధవంతంగా నాట్య ప్రియులను ఆకట్టుకున్నాయి. ముంబయికి చెందిన నృత్యోదయ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో అమెరికా నుంచి విచ్చేసిన హైదరాబాద్ కు చెందిన విశిష్ఠ డింగరి భరత నాట్య సోలో ప్రదర్శన జరిగింది. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామిజీ జ్యోతి ప్రజ్వలన చేసి విశిష్ఠ డింగరి నృత్య ప్రదర్శనకు శుభారంభం పలికారు. ముంబయికి చెందిన ప్రముఖ నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ శిష్యురాలు అయిన విశిష్ఠ సాంప్రదాయ నృత్యాంజలితో తన ప్రదర్శన ప్రారంభించింది. ప్రతి అంశంలోనూ తన ప్రతిభను చాటుకుంది. ప్రధాన వర్ణం అంశంలో కరహరప్రియ రాగంలో తెన్మాడ నరసింహాచారి రూపొందించిన రామాయణ ఘట్టాలను ప్రదర్శించిన తీరు నాట్యంలో తనకున్న ప్రత్యేక ఆసక్తి చూపరులను విశేషంగా ఆకర్షించింది. హేమావతి రాగంలో లీలా గోపాలన్ స్వరపరచిన జతి స్వరం, పురందరదాసు కీర్తన దేవరనామ, చివరగా అమృత వర్షిణి రాగం తిల్లానాతో ప్రదర్శనకు గొప్ప ముగింపు పలికింది. భూప్ రాగంలో చోకమేళా రూపొందించిన అభంగ్ ప్రదర్శన ఈ నృత్యార్పణలో హైలెట్ గా నిలిచింది. నట్టువాంగం నాట్య గురు జయశ్రీ రాజగోపాలన్ చేయగా, వైష్ణవి ఆనంద్, ఐశ్వర్య హరీష్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా అలరించింది. మృదంగంతో ఆదిత్య రాజగోపాలన్, వయోలిన్ తో బి. అనంతరామన్, వేణువుతో కుమార్ కృష్ణన్ వాద్య సహకారం అందించి రక్తి కట్టించారు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ సంప్రదాయాన్ని మరచిపోకుండా భారతీయ నాట్య జ్ఞాన సంపదను పరిరక్షిస్తూ ప్రత్యేక నాట్య సేవ చేయడం గొప్ప స్ఫూర్తిదాయకం అని త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామీజీ ఆశీర్వదించారు. ప్రముఖ నాట్య గురు పద్మవిభూషణ్ డా. పద్మా సుబ్రహ్మణ్యం, కళారత్న అశోక్ గుర్జాలే పాల్గొని విశిష్ఠ ను సత్కరించి అభినందించారు.