తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు. సినిమా టికెట్ల ధరలూ పెంచేది లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారో కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన.. అల్లు అర్జున్ ప్రెస్‌విూట్.. తరువాత సినీ స్టార్ల ఇళ్లపై దాడులు ఇటు ఇండస్ట్రీలో, అటు జనంలో కూడా చర్చనీయంగా మారాయి. టికెట్ రేట్లు పెంచేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ఫ2 సినిమాకు ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ సర్కారు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంతేకాదు, విడుదలకు ముందు రోజు అంటే డిసెంబరు 4న పెయిడ్ ప్రీమియర్ షోలకూ అనుమతి ఇచ్చింది. సదరు షోకు టికెట్ ధరకు అదనంగా రూ.800 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. దీంతో సాధారణ థియేటర్‌లో టికెట్ ధర రూ.1000 దాటిపోగా, మల్టీప్లెక్స్‌లలో పన్నులతో కలిపి రూ.1200లకు పైనే అయింది. అలాగే, విడుదలైన రోజు నుంచి నాలుగు రోజులు ఒక్కో టికెట్ ధర దాదాపు రూ.500 వరకూ ఉంది. దీంతో ’పుష్ప2’ భారీగా వసూళ్లు రాబట్టింది. తొలి రోజు అత్యధికంగా రూ.294 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూలు చేసిందని అంటున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. తరువాతే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు కూడా వచ్చారు. ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయటం, అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి సినీతారలు క్యూ కట్టడం వంటి ఘటనలపైనా సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సంధ్య థియేటర్ ఘటన, తదనంతర పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. థియేటర్ వద్ద జరిగిన విషాదకర ఘటన విషయంలో అల్లు అర్జున్ సహా, సినీ ప్రముఖులు కనీసం మానవీయ కోణంలోనూ స్పందించలేదని అన్నారు. సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని స్పష్టంచేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయాన్నే ధ్రువీకరించారు. దీంతో రాబోయే సంక్రాంతి సినిమాలపై ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. సంక్రాంతికి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ ముగ్గుల పండగకు మొదటగా ప్రేక్షకులను పలకరించే చిత్రం ’గేమ్ ఛేంజర్’. రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 10న విడుదల కానుంది. దాదాపు రూ.450 కోట్ల భారీ బ్జడెట్‌తో దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. ’పుష్ప2’కు ఇచ్చినట్లే స్పెషల్ ప్రీమియర్‌కు అనుమతి లభిస్తుందని, టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతి వస్తుందని చిత్ర బృందం అందుకు తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతూ వస్తోంది. ’పుష్ప2’ను దాటేలా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనాలు కూడా వేశారు. అయితే, ఇప్పుడు తెలంగాణ సర్కారు ప్రకటనతో ’గేమ్ ఛేంజర్’ వసూళ్లు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. బెనిఫిట్ షోల సంగతి పక్కన పెడితే, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పడం ఒకరకంగా షాక్ ఇచ్చినట్లే. మరోవైపు అటు సీఎం ప్రకటన, ఇటు అల్లు అర్జున్ ప్రెస్‌విూట్‌తో ఈ అంశం మరింత హీటెక్కింది. ఈ పరిస్థితుల్లో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చే అవకాశం లేనట్లే. ’గేమ్ ఛేంజర్’తో పాటు ఈ సంక్రాంతి బరిలోకి దిగనున్న మారో మూవీ ’డాకూ మహారాజ్’. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ మూవీ టికెట్ ధరల పెంపునకు కూడా అవకాశం ఉంటుందని భావించారు. తాజా నిర్ణయంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదంటున్నారు. బాలకృష్ణ గత చిత్రం ’భగవంత్ కేసరి’ ఫుల్ రన్‌లో దాదాపు రూ.130 కోట్లు వసూలు చేసింది అప్పుడు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉన్నాయి. ఇప్పుడు అవేవీ లేకుండా ఆ మార్కును అందుకోవడం కష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు వస్తున్న మరో విూడియం బ్జడెట్ మూవీ ’సంక్రాంతికి వస్తున్నాం’. ఇది మాస్ మూవీ కాదు. పక్కా కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇది రాబోతోంది. ప్రీమియర్, బెనిఫిట్ షోలు లేకపోయినా, టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. ఈ మూవీకి కూడా దిల్‌రాజు నిర్మాత కావడం విశేషం. ప్రభుత్వం నిర్ణయంతో దీనిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇండస్ట్రీ లెక్కలు తారుమారు చేయనున్న ప్రభుత్వం నిర్ణయంపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు తెలంగాణ సర్కారు బాటలోనే ఏపీ ప్రభుత్వం నడుస్తుందా? సంక్రాంతి సినిమాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిని రేపుతోంది.