బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్
పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం రవిగుప్తాకు హోంశాఖ.. సీవీ ఆనంద్‌కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించడంతోపాటు ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా పనిచేస్తానని, సంచలన కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన డీజీపీ జితేందర్ తెలిపారు. డీజీపీగా జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ బ్యాటన్ అందించి సాదరంగా స్వాగతం పలికారు. డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులంతా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టీజీన్యాబ్ ఏర్పాటు చేసి డైరెక్టర్‌ను నియమించింది. ఇటీవలే వాహనాలను సమకూర్చింది. ఆ విభాగం కేసులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. సైబర్‌నేరాల నియంత్రణ మరో అంశం. చాలా మంది సీనియర్ అధికారులు ఇప్పటికే దానిపై దృష్టి సారించారు. సైబర్నేరాలను నియంత్రించేందుకు చొరవ తీసుకుంటాం.
తెలంగాణ ఎప్పటికీ శాంతియుతమైన రాష్ట్రం. ఇకపై కూడా అంతే శాంతియుతంగా ఉంటుంది. ప్రభుత్వం నాకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తా’’ అని అన్నారు. అంతకుముందు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం జితేందర్‌ను డీజీపీ(సమన్వయం)గా నియమిస్తూ డీజీపీ(హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్)గా పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు డీజీపీగా పనిచేసిన రవిగుప్తాను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. గతంలోనూ రవిగుప్తా అదనపు డీజీపీ హోదాలో ఈ బాధ్యతలను నిర్వర్తించడం విశేషం. మరోవైపు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్‌కు ప్రభుత్వం ఇంకో బాధ్యతను అప్పగించింది. జితేందర్ డీజీపీగా నియమితులు కావడంతో ఆయన ఇప్పటివరకు పర్యవేక్షించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ విభాగానికి సీవీ ఆనంద్‌ను పూర్తి అదనపు బాధ్యతల్లో నియమించింది. అలాగే పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగించింది.