ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఎన్నికల్లో ఫాసిస్టు, మితవాద శక్తులకు చావుదెబ్బ!-ఎం కోటేశ్వరరావు83310 13288

0
92

ఈ ఏడాది ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటివరకు 25 దేశాల్లో పాలకులు మారారు. ఆ పరంపరలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేరాయి. రెండు చోట్లా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, అనూహ్య, ఉత్తేజం కలిగించే పరిణామాలు సంభవించాయి. అధ్యక్ష తరహా పాలన ఉన్న ఫ్రాన్సులో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. నాలుగు కూటములు, అనేక స్వతంత్ర పార్టీలు పోటీపడినా ఏ కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను వామపక్షాల కూటమి 188 సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. ఫాసిస్టు శక్తుల ముప్పు తప్పింది. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది అనటం కంటే టోరీ(కన్సర్వేటివ్‌) పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో ఊచకోతకు గురైంది, అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ ఘనత భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఏలుబడిలో జరిగింది. పార్లమెంటులోని 650 సీట్లకు గాను లేబర్‌ పార్టీ 411తో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల తొలిదశలో ఫాసిస్టు శక్తులది పైచేయిగా ఉండటమే కాదు,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 289 సీట్ల కంటే ఎక్కువగా 297 స్థానాలలో ప్రథమ స్థానంలో ఉంది. పచ్చి మితవాద నేషనల్‌ రాలీ-ఆర్‌ఎన్‌ (గతంలో నేషనల్‌ ఫ్రంట్‌) ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో 31శాతం ఓట్లతో విసిరిన సవాలుతో అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. ఈ ఎన్నికల తొలిరౌండులో 33.21శాతం తెచ్చుకుంది.రెండవ రౌండ్‌లో 37.06శాతానికి పెంచుకుంది.వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌ఇ) తొలి దఫా 28.21శాతం తెచ్చుకోగా మలి దశలో 25.81శాతం పొందింది. అధికారపక్షమైన టుగెదర్‌ కూటమి 21.28 నుంచి 24.53 శాతానికి పెంచుకుంది.
పార్లమెంటులోని 577 స్థానాలకు గాను జూన్‌ 30న జరిగిన ఎన్నికల్లో 76 నియోజకవర్గాలలో ఫలితాలు తేలాయి. ఆర్‌ఎన్‌ పార్టీ 37, వామపక్ష కూటమి 32, అధికార పక్షం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. మిగిలిన స్థానాలకు ఏడవ తేదీన పోలింగ్‌ జరిగింది. త్రిముఖ పోటీ జరిగితే దేశ చరిత్రలో తొలిసారిగా పచ్చిమితవాదులు అధికారాన్ని కైవసం చేసుకుంటారని తేలింది. ఈ ముప్పును తప్పించేందుకు విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వామపక్ష కూటమి, అధికార పార్టీ ఒక అవగాహనకు వచ్చాయి. అదేమంటే ఆర్‌ఎన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న చోట రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మూడవ అభ్యర్థి ఉపసంహరించుకొని మద్దతివ్వటంతో ఫాసిస్టు పార్టీ ఓట్ల రీత్యా పెద్దదిగా ఉన్నా సీట్లలో మూడవ స్థానానానికి పడిపోయింది. రెండో దశలో సీట్ల సర్దుబాటు కారణంగా వామపక్ష కూటమి, అధికార కూటమి లబ్ది పొందాయి. వామపక్ష సంఘటనలో ఉన్న పార్టీలకు గతంలో 130 ఉండగా ఈసారి 188, అధికార ఐక్యత కూటమికిి 245 నుంచి 161కి పడిపోగా ఆర్‌ఎన్‌ పార్టీ కూటమికి 89 నుంచి 142కు పెరిగాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ముప్పు తప్పినా ఓట్లపరంగా 37శాతానికి పెంచుకోవటం ప్రమాదకర పరిణామం. వామపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అధికార ఐక్యత కూటమి మద్దతివ్వటం లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటం తప్ప మరొక మార్గం లేదు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో అనేక అంశాలపై మక్రాన్‌ వైఖరిలో మార్పులు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
ఫలితాల్లో ఫాసిస్టు పార్టీ అధికారానికి రాదనే తీరు కనిపించగానే పారిస్‌తో సహా దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చారు. సంతోషం, ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చారు.ఫలితాల మీద తొలి ప్రకటన వెలువడగానే ఎదురుగా ఉన్న వారు పరిచితులా, అపరిచితులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎవరుంటే వారిని వారిని హత్తుకున్న దృశ్యాలు కనిపించాయి. నిమిషాల తరబడి చప్పట్లు చరిచారు. ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు పరస్పర విరుద్ద వైఖరులతో పని చేస్తున్న పార్టీలు ఐక్యమైనపుడు విబేధాలను పక్కన పెట్టి అదే జనం మద్దతు ఇచ్చి గెలిపించినపుడు ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యం కలిగించవు. ఐరోపా పార్లమెంటు, తొలిదశ ఎన్నికల్లో ఫాసిస్టు పార్టీ పెద్దదిగా అవతరించటంతో ఆందోళనకు గురైన అనేకమంది బరువు దించుకున్నారు. మరోవైపు ఫాసిస్టు పార్టీ అభిమానులు చిక్కినట్లే చిక్కి అధికారం దూరమైందన్నట్లుగా తీవ్ర ఆశాభంగం చెందారు.అయినా తమ కూటమి ప్రతిసారీ బలం పెంచుకుం టున్నదని సంతృప్తిని కూడా వెల్లడిస్తున్నారు. 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఏ కూటమి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించిన విధానాల నుంచి వైదొలిగే అవకాశాలు ఉండవు. ప్రజలిచ్చిన తీర్పుతో ఫ్రెంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయా, మక్రాన్‌ సర్కార్‌కు కొత్త ప్రభుత్వం గుదిబండగా మారుతుందా ? విదేశీ, అంతర్గత విధానాలపై మక్రాన్‌తో వామపక్షాలు విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక సందేహాల మీద చర్చ ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని గాబ్రియెల్‌ అతల్‌ రాజీనామా లేఖను పంపాడు. దాన్ని తాను ఆమోదించటం లేదని మక్రాన్‌ ప్రకటించాడు. ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశాన్ని తమకే ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని వామపక్ష కూటమి నేత జీన్‌ లక్‌ మెలెన్‌చోన్‌ ప్రకటించాడు. తాము గెలిస్తే హమాస్‌ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు మద్దతిచ్చే వైఖరి ఉపసంహరించు కుంటామని, జనానికి ఉపశమనం కలిగించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ ఖర్చు పెంచుతామని వామపక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానం చేశాయి. వామపక్షాల తీరు తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఖర్చు పెంచేందుకు అవసరమైన నిధులు కొన్ని సంపద పన్ను, అధికాదాయం వచ్చేవారి మీద పన్ను పెంపుదల వంటి అంశాలను అమలు జరిపితే దేశం నాశనం అవుతుందని, ఇప్పటికే దేశం అప్పుల ఊబిలో ఉందని మక్రాన్‌ వ్యాఖ్యానించాడు.
బ్రిటన్‌ ఎన్నికలు: ‘లేబర్‌’ సునామిలో కొట్టుకుపోయిన సునాక్‌
ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌లో కూడా కొన్ని నెలల ముందే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పద్నాలుగు సంవత్స రాలుగా అధికారంలో ఉన్న టోరీ(కన్సర్వేటివ్‌ పార్టీ)ని ఓటర్లు ఊచకోత కోశారని కొందరు వ్యాఖ్యానించారు. రిషి సునాక్‌ను నేతగా ఎన్నుకొని తప్పుచేశామని అనేక మంది టోరీలు తలలు పట్టుకుంటున్నారు.గడచిన వందేండ్లలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. పొదుపు చర్యల పేరుతో అమలు జరిపిన విధానాలతో జనజీవితం అతలాకుతలమైంది. అందుకనే ఈ సారి 650 స్థానాలకు గాను ఆ పార్టీకి 53 నుంచి 131 మధ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొనగా 121 వచ్చాయి. గతంలో ఉన్నవాటిలో 251 స్థానాలను కోల్పోయారు. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌, పన్నెండు మంది మంత్రులు మట్టికరిచారు. ఆశ్చర్యం ఏమిటంటే మూడవ పక్షమైన లిబరల్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పదకొండు నుంచి 72 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. టోరీ ప్రధానులుగా పనిచేసిన డేవిడ్‌ కామెరాన్‌, థెరెసామే ప్రాతినిధ్యం వహించిన స్థానాలను ఈ పార్టీ కైవసం చేసుకుంది.ఈ ఎన్నికలు మరొక రికార్డును కూడా సృష్టించాయి. 1918 తరువాత రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు 57.4 శాతమే. లేబర్‌ పార్టీ 33.7శాతం ఓట్లతో 411 సీట్లు(63.2శాతం) తెచ్చుకోగా టోరీ 23.7శాతం ఓట్లు, 121 సీట్లు(18.6శాతం) తెచ్చుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీకి 6.7శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు స్థానాలు(0.6శాతం) మాత్రమే వచ్చాయి. రిఫామ్‌(సంస్కరణ) యుకె పార్టీకి లిబరల్స్‌ కంటే ఎక్కువగా 14.3శాతం ఓట్లు వచ్చినా కేవలం 5(0.8శాతం) సీట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ యూనియనిస్టు పార్టీకి కూడా ఐదు సీట్లు వచ్చినా దానికి వచ్చిన ఓట్లు కేవలం 0.6శాతమే ఈ తీరును చూసిన కొందరు ఎన్నికల సంస్కరణలు అవసరమని సూచించారు. బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో అధికారానికి వచ్చిన పార్టీ తక్కువ ఓట్లు తెచ్చుకోవటం ఒక రికార్డు, దాన్ని లేబర్‌ పార్టీ సొంతం చేసుకుంది. మూడు ప్రధాన పార్టీలకు 69.6 శాతం ఓట్లు 92.9 శాతం సీట్లు వచ్చాయి. చిన్న పార్టీలు ఓట్లు గణనీయంగా తెచ్చు కున్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 7.4శాతం తగ్గి 59.9శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి ఓటర్లు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదన్నది స్పష్టమైంది. లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే కేవలం 1.7శాతం, లిబరల్‌ పార్టీ 0.6శాతం మాత్రమే అదనంగా తెచ్చుకోగా టోరీలు 19.9శాతం కోల్పోయారు.అధికారంలోకి లేబర్‌ పార్టీ వస్తుందా లేదా అన్నదాని కంటే టోరీ పార్టీని వదిలించుకోవాలని ఓటర్లు భావించినట్లు ఈ అంకెలు స్పష్టం చేశాయి.
లేబర్‌ పార్టీ పెద్ద విజయాన్ని సాధించగానే సమస్యలన్నీ పరిష్కారమైనట్లు భావించనవసరం లేదు. దాని ముందు ఎన్నో సవాళ్ల్లుఉన్నాయి.ప్రతిపక్షంలో ఉండగా పౌరుల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చే లేబర్‌ పార్టీ నేతలు అధికారానికి వచ్చిన తరువాత జనాన్ని మరచిపోతారనే నానుడి ఉంది. గతంలో అది నిరూపితమైంది. దాని నేత కెయిర్‌ స్టామర్‌ కార్పొరేట్లకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడిన తరువాత తొలిరోజు స్టాక్‌మార్కెట్‌ సూచీ0.86పెరిగిందన్నది ఒక అభిప్రాయం.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి కేవలం 0.6శాతమే పెరగ్గా ధరలు రెండు పెరిగాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కరోనాకు ముందున్న ఉత్పాదకత, పెట్టుబడి రేట్లు తక్కువగా ఉన్నాయి. 1980 దశకంలో పెట్టుబడి రేటు 23శాతం ఉండగా రెండువేల సంవత్సరం నుంచి 17శాతానికి అటూ ఇటూగా ఉంది. అదే ఇతర జి7 దేశాలలో 20-25శాతంగా ఉంది.ఆదాయపన్నుతో సహా ఇతర పన్నులేవీ పెంచబోమని లేబర్‌ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. పెంచకపోతే మరింత అప్పులపాలౌ తామని, స్పష్టంగా వైఖరిని వివరించాలని టోరీల నేత రిషి సునాక్‌ పదే పదే లేబర్‌ పార్టీ నేతలను ప్రశ్నించాడు. ప్రస్తుతం జిడిపితో పోలిస్తే 100శాతం అప్పుల్లో, ద్రవ్యలోటుతో బ్రిటన్‌ ఉంది.దాన్ని అధిగమించాలంటే జనాన్ని పన్నులతో బాదాలని టోరీలు చెబుతున్నారు. జనంలో వ్యతిరేకత కనిపించటంతో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సర్కార్‌ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. గత పద్నాలుగేండ్లుగా ఏదో ఒక పేరుతో ప్రభుత్వరంగ సిబ్బందికి వేతనాలను స్తంభింపచేశారు. కార్మిక సంఘాలన్నీ లేబర్‌ పార్టీ నిర్వహణలో ఉన్నందున వేతన సమస్య ప్రధానంగా ముందుకు రానుంది. దేశంలోని అతి పెద్ద థేమ్స్‌ నీటి కంపెనీ అప్పులపాలైంది. అయినా వాటాదార్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. దివాలా తీసే స్థితిలో ఉన్నదాన్ని నిలబెట్టటం ఒక సమస్య. దీన్ని జాతీయం చేయవచ్చని, అందుకు పెద్ద మొత్తంలో చెల్లిం చాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైళ్లన్నీ 99శాతం నిండి ఉన్నాయి.న్యాయవ్యవస్థ విఫలమైందనే విమర్శ కూడా ఉంది. నేరాలను ఎలా తగ్గించాలనే దాని కంటే కొత్తగా జైళ్ల నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు పెరిగింది, 2012తరువాత ట్యూషన్‌ ఫీజులను పెంచలేదు.విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు.దీంతో వాటి రాబడి పడిపోతున్నది.బ్రిటన్‌ పెద్ద సమస్యల్లో ఇదొకటి. ఆరోగ్యరంగ బడ్జెట్‌ లోటులో ఉంది.చికిత్సకు పట్టే వ్యవధి రోజు రోజుకూ పెరుగుతోంది, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి.సేవలను మెరుగుపరచాల్సి ఉంది.టోరీల పొదుపు చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు దివాలా ప్రకటించాయి.ప్రస్తుతం ప్రతి ఐదింటిలో ఒకటి అదే బాటలో ఉన్నది.ఈ పూర్వరంగంలో లేబర్‌ పార్టీ ముందు పెద్ద సవాలే ఉంది.