Kalki Movie Review in Telugu : మనసుదోచే సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’

0
77
Kalki Movie Review in Telugu
Kalki Movie Review in Telugu

(చిత్రం : కల్కి 2898 ఏడీ, విడుదల : 27 జూన్-2024, రేటింగ్:3.5/5 , నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోనే, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, బ్రహ్మనందం తదితరులు. కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, నిర్మాత: సి. అశ్వినీదత్, సహ నిర్మాతలు : స్వప్న దత్- ప్రియాంక దత్, మాటలు : నాగ్ అశ్విన్- సాయి మాధవ్ బుర్రా, వివేక్ (తమిళ్), సినిమాటోగ్రఫీ : డోర్‌డ్జే స్టోజిల్‌కోవిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: సంతోష్ నారాయణ్, నిర్మాణం: వైజయంతీ మూవీస్).

టాలీవుడ్ స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఆయన.. అప్పటి నుంచి బహుభాషా సినిమాల్లోనే నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చి అటు అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. మంచి హిట్ కోసం డార్లింగ్ ప్రభాస్ ఎదురుచూస్తున్న మాట నిజం. ‘బాహుబలి 2’ తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ విజయం సాధించలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ పరాజయం పాలయ్యాయి.అనుకున్నంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణంతో నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా విడుదలైంది. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోనే, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు దిశా ప‌టానీ, శోభ‌న‌, మాళ‌విక నాయ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ పై ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలియుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు.. అంతేకాకుండా మొత్తం మూడు కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. నేడు (జూన్ 27 గురువారం) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మరి విడుద‌ల‌కు ముందే భారీ అంచ‌నాలు నెలకొన్న ఈ సినిమా అభిమానుల‌ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం….

కథలోకి వస్తే… కురుక్షేత్రం యుద్ధం జ‌రిగిన ఆరు వేల ఏళ్ల త‌ర్వాత భూమి మొత్తం నాశ‌నం అవుతుంది. అధ‌ర్మం పెరిగిపోయి మాన‌వులు ప్ర‌కృతిని మొత్తం నాశ‌నం చేస్తుండటంతో సుప్రీమ్ యాశ్కిన్ (క‌మ‌ల్‌హాస‌న్‌) కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్ర‌పంచాన్ని సృష్టిస్తాడు. ప్ర‌కృతి వ‌న‌రుల‌ను కాంప్లెక్స్‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశాడు. కాశీ న‌గ‌రంపైన ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్ల‌డానికి భూమిపై మిగిలిన మాన‌వులంద‌రూ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. వారిలో భైర‌వ (ప్ర‌భాస్‌) ఒక‌రు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలన్నది అత‌డి క‌ల‌. సుప్రీమ్ యాశ్కిన్ అన్యాయాల‌పై రెబెల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. శంబాలా పేరుతో సీక్రెట్ వ‌ర‌ల్డ్‌ను ఏర్పాటు చేసుకొని సుప్రీమ్ గ్యాంగ్‌కు దొర‌క్కుండా పోరాడుతుంటారు. దేవుడు మ‌ళ్లీ క‌ల్కి అవ‌తారంలో మ‌హిళ గ‌ర్భం ద్వారా భూమిపై అవ‌త‌రించ‌బోతున్నాడ‌ని శంబాలా ప్ర‌జ‌లు న‌మ్ముతుంటారు. ఆ దేవుడికి జ‌న్మ‌నిచ్చే మ‌హిళ కోసం ఎదురుచూస్తుంటారు. కాంప్లెక్స్ వ‌ర‌ల్డ్ నుంచి గ‌ర్భంతో ఉన్న సుమ‌తి (దీపికా ప‌దుకోనే) త‌ప్పించుకుంటుంది. సుమ‌తిని త‌మ‌కు అప్ప‌గిస్తే కాంప్లెక్స్‌లోకి ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌ని క‌మాండ‌ర్ మాన‌స్‌ (శ‌శ్వ‌తా ఛ‌ట‌ర్జీ) భైర‌వ‌తో ఒప్ప‌దం కుదుర్చుకుంటాడు. కానీ భైర‌వ‌తో పాటు క‌మాండ‌ర్ మాన‌స్ మ‌నుషుల భారి నుంచి సుమ‌తిని అశ్వ‌త్థామ (అమితాబ్ బ‌చ్చ‌న్‌) కాపాడుతాడు. సుమ‌తిని శంబాల‌కు సుర‌క్షితంగా చేర్చుతాడు. మహాభారత యుద్దంలో అశ్వత్తామ హత: కుంజర ఎపిసోడ్ తర్వాత జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యు భార్య, గర్భవతి శశిరేఖపై ఓ అస్త్రాన్ని అశ్వత్తామ ప్రయోగిస్తాడు. మహిళలపై నీ ప్రతాపమా అంటూ అశ్వత్తామకు శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. అయితే కలియుగంలో తనను రక్షించే సమయం వస్తుంది. నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత ఆరు వందల సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతంలో అశ్వత్తామ భైరవ, సుమతి, సుప్రీం యాస్కిన్ మధ్య భవిష్యత్ కోసం పోరాటం జరుగుతుంది. ఇంతకీ అశ్వ‌త్థామ ఎవ‌రు? సుమ‌తిని మాన‌స్‌కు అప్ప‌గించి కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైర‌వ చివ‌ర‌కు అత‌డి బారి నుంచి ఆమెను ఎందుకు కాపాడాడు? వేల ఏళ్లుగా అశ్వ‌త్థామ బ‌తికి ఉండ‌టానికి కార‌ణం ఏమిటి? శంబాల‌పై మాన‌స్ చేసిన దాడిని మ‌రియ‌మ్మ (శోభ‌న‌), వీరతో ఆమె మ‌నుషులు ఎలా ఎదుర్కొన్నారు? భైర‌వ‌కు మ‌హాభార‌తంతో ఉన్న సంబంధం ఏంటి? సుప్రీమ్ యాశ్కిన్‌తో పోరాటంలో కైరా, కెప్టెన్‌, రోక్సీతో పాటు మ‌రికొంత‌మంది ఏమ‌య్యారు జల్సాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ ఎవరు? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ కె. లక్ష్యం ఏమిటి? ప్రాజెక్ట్ కె కోసం సుమతితోపాటు అమ్మాయిలను ఎందుకు బలి ఇస్తుంటాడు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్, శంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి? కాశీలో భైరవ ఏం చేస్తుంటాడు? కట్టుదిట్టమైన కాంప్లెక్స్ నుంచి సుమతి ఎలా తప్పించుకొని అశ్వత్తామను కలుసుకొన్నది? ఇంతకు అశ్వత్తామ కోసం వచ్చిన భైరవ ఎవరు? అశ్వత్తామ శాప విమోచనం జరిగిందా? తప్పించుకొన్న సుమతి కోసం యాస్కిన్ వేటాడాలని ఎందుకు అనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కథ.

విశ్లేషణ: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.. ఈ మూడు కాలాలకు ముడిపెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగ్ అశ్విన్. అందులోనే అశ్వద్ధామ లాంటి ఇమ్మోర్టల్ క్యారెక్టర్ తీసుకుని.. అతడి వైపు నుంచే కథ మొత్తం నడిపించారు. మహాభారతంలోని రిఫరెన్సులతో పాటు.. హాలీవుడ్ మార్వెల్ సినిమాల రిఫరెన్సులు కూడా సినిమాలో చాలానే కనిపించాయి. అవన్నీ అత్యున్నతంగా ఉండటం గమనార్హం. కల్కి షూటింగ్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకున్నట్టుంది. ఒక్కో ఫ్రేమ్ కోసం వాళ్లు పడిన కష్టం కనిపించింది. ప్రపంచానికి వచ్చే ఆపదను కాపాడే కథానాయకుడిగా ప్రభాస్, హీరోను సరైన మార్గంలో గైడ్ చేసే గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ సినిమాకు హైలెట్ గా నిలిచారు. ఇంత సీరియస్ సినిమాలోనూ ప్రభాస్ క్యారెక్టర్‌ను చాలా ఎంటర్‌టైనింగ్‌గా డిజైన్ చేసారు నాగ్ అశ్విన్. ఈ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు పూర్తి క్రెడిట్ అంతా దర్శకుడు నాగ్ అశ్విన్, అమితాబ్‌కు ఇవ్వాల్సిందే. నాగ్ అశ్విన్ రాసుకొన్న కథ, పురాణాలకు, అడ్వాన్స్ టెక్నాలజీ వరల్డ్‌కు కనెక్ట్ చేసిన తీరు ఓ మ్యాజిక్ అనే చెప్పాలి. దర్శకుడు రాసుకొన్న పాత్రలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది.ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఫ‌స్ట్ హాఫ్ బ్లాక్ బాస్ట‌ర్‌, ఇంట‌ర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఇక ఊహించని క్లైమాక్స్ అయితే పూన‌కాలే తెప్పించింది. హాలీవుడ్ స్థాయిని మైమరపింపజేసింది. మహాభారతం యుద్దం నేపథ్యంగా కథ మొదలై.. ఆ తర్వాత ఆరువందల ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువులు లాంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. విశ్రాంతికి ముందు కొద్దిసేపు సినిమా మరో రేంజ్‌కు వెళ్తుంది. మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగిసి సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి. ఇక సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుకొన్న ప్రేక్షకుడికి చివరి 30 నిమిషాల సినిమా కొత్త అనుభూతికి గురిచేయడమే కాకుండా సీట్లకు అత్తుకుపోయేలా చేస్తుంది. సెకండాఫ్‌లో అమితాబ్, ప్రభాస్ మధ్య ఫైట్ సినిమాకు ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్, కమల్ (యాస్కిన్) ఎపిసోడ్ సినిమాను సంపూర్ణంగా మంచి సినిమాను చూశామనే సంతృప్తిని కలిగిస్తుంది. ఈ కల్కి చిత్రానికి కి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపం తెరపై విలయతాండవం చేసింది. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీపిక పదుకోనే ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హసన్‌కు ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు ఆయన పాత్ర ప్రజెన్స్ తెర మీద కనిపిస్తుంది. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది. అలాగే ఈ ‘కల్కి’లో రాంగోపాల్ వర్మ, దర్శకధీరుడు రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ ప్రత్యేక పాత్రల్లో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరి పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. మార్వెల్ సిరీస్ సూప‌ర్ హీరో సినిమాలు వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ అభిమానుల‌ను మెప్పించాయి. అలాంటి సూప‌ర్ హీరో మూవీమ‌న పురాణాల నేప‌థ్యంలో తెర‌కెక్కితే ఎలా ఉంటుంది అన‌డానికి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ చిత్రం. మ‌హాభారతంలోని కొన్ని పాత్ర‌లు, వారికి ఉన్న అతీత శ‌క్తుల‌కు ఓ ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్‌ను జోడించి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీని తెర‌కెక్కించాడు. ఈ క‌థ‌ను మార్వెల్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని విధంగా లార్గెన్‌దేన్ లైఫ్ విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్‌తో చెప్పాల‌ని నాగ్ అశ్విన్ ప్ర‌య‌త్నించారు. ప్ర‌తి సీన్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి. కాంప్లెక్స్‌, శంబాల వ‌ర‌ల్డ్‌లోకి తీసుకెళ‌తాయి. సినిమాలో ఉప‌యోగించే గ‌న్స్‌, వెహికిల్స్ తో పాటు క్యారెక్ట‌ర్ లుక్స్ వ‌ర‌కు ప్ర‌తిదీ డిఫ‌రెంట్‌గా క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్‌. మహాభారతంతో ముడిపెడుతూ ఇంట్రెస్టింగ్ ఐడియాతో నాగ్ అశ్విన్ క‌ల్కి క‌థ‌ను రాసుకున్నారు. సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్ కూడా పురాణాల స్ఫూర్తితోనే సాగుతుంటాయి. మోడ్ర‌నైజేష‌న్‌తో పాటు పురాణాల్ని రెండింటిని మిక్స్ చేసి అర్థ‌వంతంగా చెప్ప‌డం అంటే క‌త్తిమీద సాము లాంటిదే. కానీ ఈ ప్ర‌య‌త్నంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. అశ్వ‌త్థామ‌కు కృష్ణుడు విధించిన శాపం, మ‌హాభార‌తంలో మ‌రో కీల‌క పాత్ర‌తో హీరోకు ఉన్న సంబంధాన్ని క‌న్వీన్సింగ్‌గా రాసుకున్నాడు. కీల‌క పాత్ర‌ల తాలూకు నేప‌థ్యాల‌ను డీటైలింగ్‌గా రాసుకోవ‌డం బాగుంది. ఈ గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ మాయ‌లో క‌ల్కి క‌థే ప‌లుచబ‌డిన ఫీలింగ్ క‌లుగుతుంది. తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను ఒక్క పార్ట్‌లో కంప్లీట్ చేయ‌డం సాధ్యం కాద‌ని ముందే నాగ్ అశ్విన్ ఫిక్స‌య్యాడు. అందుకే క‌ల్కి 2898 ఏడీ పార్ట్ 1’ సినిమాను కేవ‌లం పాత్ర‌ల ప‌రిచ‌యానికే ఉప‌యోగించుకున్నాడు. కంప్లెక్స్‌, శంబాలా వ‌ర‌ల్డ్‌ల‌ ప‌రిచ‌యం, భైర‌వ‌, అశ్వ‌త్థామ‌తో పాటు మిగిలిన క్యారెక్ట‌ర్స్ ఎలా ఉంటాయి, వారి నేప‌థ్య‌మేమిటి అన్న‌దే ఈ సినిమాలో చూపించాడు. కంప్లీట్ ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో సినిమాను న‌డిపించాడు. ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ బాగుంది. పాత్ర‌లు ఎక్కువ కావ‌డంతో ఎవ‌రికి పెద్ద‌గా స్క్రీన్ స్పేస్ లేదు. ప్ర‌భాస్ పాత్ర సినిమా మొద‌లైన ఇర‌వైనిమిషాల త‌ర్వాతే ఎంట్రీ ఇస్తుంది. ఆ త‌ర్వాత యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంది. మూడు గంట‌ల సినిమాలో గంట మాత్ర‌మే ప్ర‌భాస్ క‌నిపిస్తాడు. ప్ర‌తి ఐదు నిమిషాల‌కు ఓ కొత్త క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తూనే ఉంటుంది. అందులో కొన్నిమిన‌హా చాలా వ‌ర‌కు క‌థ‌కు సంబంధం లేని క్యారెక్ట‌ర్స్ కావ‌డం గ‌మ‌నార్హం. రాజ‌మౌళి, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇలా చాలా క్యారెక్ట‌ర్స్ సినిమాపై బ‌జ్ రావ‌డానికి క్రియేట్ చేసిన‌వే. భైర‌వ‌గా త‌న కామెడీ టైమింగ్‌తో ప్ర‌భాస్ మెప్పించాడు. సూప‌ర్ హీరోగా అత‌డి క్యారెక్ట‌ర్‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌. ప్ర‌భాస్‌పై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయి. ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌కు ధీటుగా అశ్వ‌త్థామ పాత్ర‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అమితాబ్‌బ‌చ్చ‌న్ డైలాగ్ డెలివ‌రీ, అత‌డి స్క్రీన్‌ప్ర‌జెన్స్ వావ్ అనిపిస్తాయి. యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొట్టాడు. ఎమోష‌న‌ల్ రోల్‌లో దీపికా ప‌దుకోణ్ క‌నిపించింది. త‌న బిడ్డ కోసం ఆరాట‌ప‌డే త‌ల్లిగా నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచింది. క‌మ‌ల్‌హాస‌న్ సినిమాలో కేవ‌లం ప‌ది నిమిషాల లోపే క‌నిపిస్తారు. సెకండ్ పార్ట్‌లోనే ఆయ‌న క్యారెక్ట‌ర్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ హింట్ ఇచ్చాడు.

టెక్నికల్ విభాగాల పనితీరును విశ్లేషిస్తే… సంతోష్ నారాయ‌ణ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌, విజువ‌ల్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. కాంప్లెక్స్, శంబాలా వ‌ర‌ల్డ్స్ తాలూకు గ్రాఫిక్స్ బాగున్నాయి. ముఖ్యంగా సినిమాలో సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగాల పనితీరు మెచ్చుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ గురించి అయితే.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. డోర్‌డ్జే స్టోజిల్‌కోవిక్ కెమెరా సినిమాని ఎంతో రిచ్ గా తెరకెక్కించింది. ప్రతీ ఫ్రేమ్ ని తన కెమెరాలో బంధించింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సోసోగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రంగానే ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ ప్రమాణాలకు అనుగుణంగా సీ అశ్వినీదత్, ప్రియాంక, స్వప్న దత్ అనుసరించిన నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తం మీదహాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. తెరపై వచ్చే కళ్లు చెదిరే విజువల్స్ చూశాక వాహ్… విజువల్ వండర్ అనిపించక మానదు.