ఆగస్టు 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి
తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఈనెల 18న ప్రారంభమైన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు తుదిదశకు వచ్చింది. విలువల సవరణ ప్రక్రియ ఈనెల 29న పూర్తి అవుతుంది. అదేరోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాయి.
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు అమల్లోకి వస్తాయని సమాచారం. రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వెంచర్లు.. ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించారు.
రాష్ట్రంలోని ఎకరా వ్యవసాయ భూమి కనీస ధరను రూ. 4 లక్షలుగా నిర్ధారించారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు. ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లోనూ ఎకరాకు రూ.4 లక్షల ధరే ఉండనుంది. హైవేల పక్కన ఉండే భూమి ధర రూ. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచుతున్నారు. వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉంటే ఎకరా రూ. కోటి వరకు ఉండనుంది. నివాస స్థలాల్లో స్క్వేర్ యార్డ్‌కు రూ.1000, అపార్ట్‌మెంట్‌లో స్క్వేర్ ఫీట్‌కు రూ.1500గా ధర నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించారు. మార్కెట్, ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్నచోట భారీగా రేట్లు పెంచింది తెలంగాణ ప్రభుత్వం.