కార్పొరేట్ల లాభాలకే వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం

0
85

-సారంపల్లి మల్లారెడ్డి
9490098666

కార్పొరేట్లు, మధ్య దళారీలు అత్యంత లాభాలు సంపాదించ డానికి అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయి స్తున్నాయి. సరుకు ధరలో ఉత్పత్తి ధర, కనీస మద్దతు ధర మరియు గిట్టుబాటు ధరలుగా విభజించి చూడాలి. ఉత్పత్తి ధరకు సంబం ధించి పారిశ్రామిక సరుకులకు గానీ, వ్యవసాయ ఉత్పత్తులకు గానీ ఒకే సూత్రం ఉండాలి. కానీ పారిశ్రామిక సరుకులకు నిర్ణయించిన సూత్రాలలో రెండు అంశాలను వ్యవసాయ ఉత్పత్తులకు పరిగణనలోకి తీసుకోకుండా వదిలేస్తున్నారు. ముడిసరుకు ఖరీదుతో పాటు దానిని వినియోగ సరుకుగా మార్చడానికి వేతనాలు, టెక్నాలజీ, ఫ్యాక్టరీలు, వాటికొరకు తెచ్చిన అప్పుపై వడ్డీ మరియు లాభం 16శాతం పైగా కలిపి పారిశ్రామిక సరుకుల ధరలు నిర్ణయించుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతు పెట్టిన ఉపకరణాల పెట్టుబడి (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు) మరియు కుటుంబ శ్రమను మాత్రమే కలిపి ఉత్పత్తి వ్యయంగా నిర్ణయిస్తున్నారు. భూమిపై పెట్టిన పెట్టుబడి, బోర్లు, యంత్రాలు, వాటి అరుగుదల, భూమి అద్దె పరిగణనలోకి తీసుకోవడంలేదు. అందువల్ల ఉత్పత్తి ధర తక్కువగా నిర్ణయించడంతో స్వామినాథన్‌ సిఫారసుల మేరకు 50శాతం అదనంగా కలిపినప్పటికీ రైతుకు గిట్టుబాటు కాదు. పారిశ్రామిక సరుకుల ఉత్పత్తిని విలువ కట్టడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ కట్టడానికి వడ్డీలు, అద్దెలు, అరుగుదల, యాంత్రీకరణ మొదలగువాటిని పరిగణలోకి తీసుకోవాలి.
వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల నిర్ణయం
1966-67లో కనీస మద్దతు ధరల విధానాన్ని కేంద్రం రూపొందించింది. 1965లో హరిత విప్లవం ప్రారంభంతో వ్యవసాయానికి కేంద్రం నుంచి పెద్దఎత్తున రాయితీలు ఇచ్చారు. వ్యవసాయ ఉపకరణాలకు రాయితీలు ఇవ్వడమే కాక వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బడ్జెట్‌ నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఉత్పత్తి, ఉత్పాదకత 1980 నాటికి నాలుగురెట్లు పెరిగింది. మిగులు ఉత్పత్తి పెరగడంతో వ్యాపారస్తులు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఒక్కసారిగా తగ్గించారు. నాడు, నేడు వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమలకు ముడిసరుకులుగా వినియోగిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు తమకు కావల్సిన ముడిసరుకును తక్కువ రేటుకు కొనుగోలు చేసి ప్రోసెస్‌ చేసిన తర్వాత వినిమయ సరుకులను 80 నుంచి 100 శాతానికి పెంచి అమ్మకాలు చేసి లాభాలు సంపాదిస్తున్నారు. ఈ ధరలను నియంత్రించడానికి ”కనీస మద్దతు ధరల” విధానాన్ని రూపొందించారు. వందకు పైగా పంటలు పండుతున్నప్పటికీ 23 పంటలకే ధరలు నిర్ణయించారు. ఈ ధరలను నిర్ణయించడానికి ముందు ”వ్యవసాయ ధరల కమిషన్‌ (సీఏసీపీ)”ను 1965లో స్థాపించారు. దీనిని 1985లో విస్తరించారు. ఈ కమిషన్‌కు చైర్మన్‌, మెంబర్‌ సెక్రటరీ, ఒక అధికార ప్రతినిధి, ఇద్దరు అధికారేతర ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు రాష్ట్రాలలో వివిధ పంటల ఉత్పత్తుల పెట్టుబడిని సేకరిస్తారు. నిర్ధేశించిన 23పంటల ధరలను సేకరించి సగటు ధర నిర్ణయిస్తారు. ఈ ధరను కూడా వారు కేంద్ర ప్రభుత్వానికి తెలియపరుస్తారు. కేంద్ర ప్రభుత్వంలో తొమ్మిది శాఖల మంత్రుల కేబినెట్‌ కమిటీ సీఏసీపీ రిపోర్టును పరిశీలించి ఉత్పత్తి వ్యయంపై 20-25శాతం అదనంగా కలిపి వ్యవసాయ ఉత్పత్తుల ధరను నిర్ణయిస్తున్నారు. ఈ క్యాబినేట్‌ కమిటీలో ప్రధాని మోడీతో పాటు రక్షణ శాఖ, హౌంశాఖ, రవాణా శాఖ, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, విదేశాంగ శాఖ, వాణిజ్యం-పరిశ్రమల శాఖ, విద్య-నైపుణ్యం శాఖల క్యాబినేట్‌ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. వాస్తవానికి ఈ క్యాబినేట్‌ కమిటీ ధరల నిర్ణాయక కమిషన్‌ ఇచ్చిన ధరకు 50శాతం కలిపి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించాలి. కానీ ధరల నిర్ణయంలోనే వ్యవసాయ పెట్టుబడులలోని కీలక భాగాన్ని తొలగించడం వల్ల ఉత్పత్తి ఖర్చును తగ్గించి చూపి, దానికి 50శాతం కలిపి స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేస్తున్నట్టు చెపుతున్నారు. నిర్ణయించిన కనీస మద్దతు ధరలు కూడా మార్కెట్‌లో అమలు కావడంలేదు. మద్దతు ధరలు తక్కువ నిర్ణయించడం వల్ల రైతులు పెట్టుబడి రాక నష్టపోయి రుణగ్రస్తులవుతున్నారు. 2022-23 సం||నికి దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ 18లక్షల కోట్లు కాగా అందులో 15లక్షల కోట్ల సరుకు మార్కెట్‌కు వస్తున్నది. నిర్ణయించిన మద్దతు ధరలు అమలుజరపక పోవడం వల్ల రైతులు ఏటా 3లక్షల కోట్లు నష్టపోతున్నట్టు నిటి ఆయోగ్‌ ఆర్థికవేత్త అశోక్‌ గులాఠి అనేక సందర్భాలలో ప్రస్తావించారు. అనేకమంది ఆర్థికవేత్తలు కూడా రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు వాస్తవమైన ఉత్పత్తి ధర నిర్ణయించాలని కోరుతున్నారు. పప్పు ధాన్యాలు క్వింటాలుకు రు.6300లుగా నిర్ణయించారు. క్వింటాలు ముడిసరుకు నుంచి 80కిలోల పప్పు వస్తుంది. కిలో పప్పు ప్రస్తుతం మార్కెట్‌లో రు.160లు ఉంది. అనగా రు.12,400లు ఆదాయం వస్తుంది. రు.6300లకు కొనుగోలు చేసి ప్రోసెస్‌ చేయగా 100శాతం లాభం వస్తుంది. ధాన్యం ధర క్వింటాలు రు.2183లు కాగా ఒకటిన్నర క్వింటాళ్ళ ధాన్యానికి క్వింటాలు బియ్యం వస్తాయి. అనగా రు.3270లకి క్వింటా బియ్యం దిగుబడి వస్తుంది. కానీ మార్కెట్‌లో రు.45 నుంచి రు.65కు కిలో అమ్ముతున్నారు. దాదాపు 80శాతం లాభం ఆర్జిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్న ప్రచారమే తప్ప నిర్ణయించిన కనీస మద్దతు ధరలు కూడా శాస్త్రీయంగా లేవు. దీనికి తోడు వ్యవసాయ ఉపకరణాల ధరలు దినదినం పెరుగుతున్నాయి.

ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, డీజిల్‌, విద్యుత్‌ తదితర సరుకుల ధరలు 200శాతం పెరిగాయి. కానీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం నాటి గణాంకాలతో పరిశీలిస్తే 45శాతం మాత్రమే పెరిగాయి. వ్యవసాయ ఉపకరణాల ధరలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగకపోవడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు రావడంలేదు. గతంలో ఇచ్చిన వ్యవసాయ సబ్సిడీలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, విత్తనాలు, బోర్లు, వడ్డీలేని రుణాలు తదితర బడ్జెట్‌ కేటాయింపులు నేడు పూర్తిగా తగ్గిపోయాయి. 1995లో అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఒప్పందంపై సంతకాలు పెట్టిన తర్వాత వ్యవసాయ సబ్సిడీలను తగ్గించారు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ 2005 వరకు రాయితీలు కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించినప్పటికీ జి-7 దేశాల వత్తిడితో 1997లోనే రాయితీలను తగ్గించుకోవడం జరిగింది. రాయితీలు తగ్గినప్పటి నుండి దేశంలో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. నేటికీ కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం దినదినం పెరగడం వల్ల అన్ని సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అందుకనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడంలేదు.
అమెరికా వంటి కొన్ని బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోగాని, పాకిస్థాన్‌ వంటి మనకంటే బాగా వెనకబడ్డ దేశాల్లోగాని రైతులను వివిధ రూపాల్లో ఆదుకుంటున్న తీరు చూస్తే.. భారతదేశ రైతాం గానికి తమ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీస మద్ధతు ధర కూడా లభించడం లేదు. 2022-23లో ధాన్యం క్వింటాల్‌ ఉత్పత్తి ధర రు.2,707లు కాగా, మద్ధతు ధర రు.2,040గా నిర్ణయించారు. అనగా, పెట్టిన పెట్టుబడికి రు.650లు రైతులు నష్టపోతున్నారు. నేటికీ అది కొనసాగుతూనే ఉన్నది. అదే విధంగా జొన్న, ముతక ధాన్యాలు, పప్పు ధాన్యాల ధరలు కనీస ఉత్పత్తి ధరలు కూడా మద్ధతు ధరగా నిర్ణయించడం లేదు. అందువల్ల శాస్త్రీయంగా ధరలు నిర్ణయించాలని అనేక ఆందోళనలు సాగుతున్నాయి.

మద్దతు ధరలను చట్టబద్దత చేయాలని కోట్ల మంది రైతులు ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు సాగిస్తున్నారు. నేటికీ 105 రోజులుగా లక్షల మంది రైతులు ఢిల్లీలో ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. ధరల నిర్ణాయక సంఘం సూచించిన పెట్టుబడి ధరకు 50శాతాన్ని కలిపి కనీస మద్ధతు ధరలుగా నిర్ణయించాలి. వారు నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్న సరుకును కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలు కొనుగోలు చేయాలి. మధ్య దళారీలు, కార్పొరేట్‌ సంస్థల బారిన పడకుండా రైతులకు రక్షణ కల్పించాలి. నేడు మార్కెట్లల్లో కార్పొరేట్‌ సంస్థలు నిర్ణయించిన ధరలే అమలు జరుగుతున్నాయి. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా కనీసం పెట్టుబడికి గ్యారెంటీ ఉండే విధంగా ధరలను నిర్ణయించాలి. ఆ ధరలను మార్కెట్లల్లో అమలు చేయాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించబడతాయి.