Chakkora Review: అలరించే ప్రేమకథ!

0
6
Chakkora Review: A delightful love story!
Chakkora Review: A delightful love story!

(మూవీ రివ్యూ: చకోర, రేటింగ్ : 3.25/5)

పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ‘చకోర’. సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ ప్రేమకథ చిత్రాన్ని డా. చింతాడ హేమారావు నిర్మించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై బాపిరాజు ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. స్వచ్ఛమైన ప్రేమ, జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఓ యువకుడి అవిశ్రాంత ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమ, భావోద్వేగాల మేళవింపుగా వచ్చిన ‘చకోర’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది తెలుసుకుందాం.

కథ: అనగనగా ఓ కుర్రాడు రావణ బ్రహ్మ (శ్రవణ్). రాజమండ్రి బ్యాక్ డ్రాప్‌లో ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ లైఫ్‌ను చిల్ అవుతుంటాడు. చిన్నతనంలో తన తల్లి చెప్పిన చందమామ కథలకు బాగా ఎట్రాక్ట్ అయిన అతడు, తన లైఫ్ పార్టనర్ కూడా అచ్చం జాబిలి లాగే ఉండాలని కలలు కంటుంటాడు. ఆ టైమ్‌లోనే మెడిసిన్ చదివే జూలీ అలియాస్ జాబిలి (మలైకా టి వాసుపల్‌) పరిచయం అవుతుంది. తాను అనుకున్న క్వాలిటీస్ అన్నీ ఆమెలో కనిపించడంతో ఫస్ట్ సైట్‌లోనే లవ్‌లో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ట్రయల్స్ వేస్తాడు. ఫైనల్‌గా ఇద్దరూ క్లోజ్ అవుతారు. అయితే హీరో తన లవ్‌ను ప్రపోజ్ చేసే టైమ్‌లో హీరోయిన్ ఒక కండిషన్ పెడుతుంది. 24 గంటల పాటు తనతో మాట్లాడకూడదని, అసలు కనిపించకూడదని చెప్పి మాయం అవుతుంది. ఆ తర్వాత హీరో ఆమె కోసం గోవా లాంటి ప్లేసెస్‌లో చకోర పక్షిలా ఎందుకు వెతికాడు? తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని అతడు ఎంతో ప్రత్యేకంగా భావిస్తాడు. అయితే వారి మధ్య ప్రేమ అనుకున్నంత సులభంగా ముందుకు సాగదు. ఆ అమ్మాయి అతడికి దూరం కావడానికి కారణమేంటి? ఆమెను తన జీవితంలో భాగం చేసుకోవాలనే అతడి ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? తన లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? ఆ సెర్చింగ్ టైమ్‌లో హీరోకు కనిపించకుండా హీరోయిన్ ఎందుకు దాక్కుంది? అసలు ఆమె ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి? వాళ్లిద్దరి లవ్ స్టోరీ చివరకు ఏమైంది? మధ్యలో స్టోరీ నెరేటర్‌గా వచ్చే మరో క్యారెక్టర్ రోల్ ఏంటి? అన్నది మిగతా కథ.

విశ్లేషణ : ప్రేమకథలకు వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ప్రేమతో పాటు కుటుంబ అనుబంధాలు, స్నేహం, జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదల కూడా తోడైతే ఆ కథకు మరింత భావోద్వేగం చేరుతుంది. అలాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ రొటీన్ ఫార్మాట్‌లోనే రన్ అవుతుంది. క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, హీరోయిన్ వెనకాల హీరో పడటం, ఆమెను లైన్‌లో పెట్టడానికి చేసే పనులు ఇవన్నీ రెగ్యులర్ లవ్ స్టోరీలను గుర్తు చేస్తాయి. స్వచ్ఛమైన వర్షపు నీటి కోసమే ప్రాణాలతో వెయిట్ చేసే చకోర పక్షి కాన్సెప్ట్‌ను, ట్రూ లవ్ కోసం ఎదురుచూసే ప్రేమికుల స్టోరీకి లింక్ చేస్తూ డైరెక్టర్ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు. కథంతా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో హీరోయిన్ సడెన్‌గా కండిషన్ పెట్టి స్కిప్ అవుతుందో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత తన లవర్ కోసం హీరో చేసే జర్నీ, ఆ ప్రాసెస్‌లో అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కంటికి కనిపించకుండా కేవలం మొబైల్ కాల్స్ ద్వారానే లవర్‌తో ప్లే చేసే ఎమోషనల్ గేమ్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్‌లో సెకండ్ హీరోయిన్ ద్వారా రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ట్రూ లవ్ కోసం ఎంత కాలమైనా ఓపికగా వెయిట్ చేయాలనే పాయింట్‌ను బాగానే ప్రెజెంట్ చేశారు. పూరీ జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్ కావడంతో హీరో క్యారెక్టరైజేషన్‌లో ఆ మార్క్ మాస్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. యూత్ ఆడియన్స్‌కు ఈ మూవీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చకోర పక్షి జాబిల్లి కోసం పడే తపనను ప్రేమ, లక్ష్య సాధనతో ముడిపెట్టిన దర్శకుడి ఆలోచన ఆసక్తికరం. ప్రేమ, త్యాగం, పట్టుదలతో పాటు తల్లి కొడుకుల అనుబంధం కథకు భావోద్వేగ బలాన్ని ఇస్తాయి. అయితే బలమైన కథాంశానికి మరింత పదునైన కథనం తోడై ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. కొన్ని సన్నివేశాల్లో నెమ్మదించే కథనం మినహా, ప్రేమను ఓ లక్ష్యంగా భావించే యువకుడి ప్రయాణమే సినిమాకు ప్రధాన ఆకర్షణ.

నటీనటుల పనితీరు : హీరోగా పరిచయమైన శ్రవణ్ ప్రేమ, భావోద్వేగాలు పలికించే పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. డెబ్యూ మూవీ అయినా కూడా మెయిన్ లీడ్ రోల్‌లో శ్రవణ్ కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేశాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో తన క్యారెక్టర్‌ను చాలా ఈజీగా క్యారీ చేశాడు. హీరోయిన్‌గా నటించిన మలైకా తన క్యారెక్టర్ లిమిట్స్ మేరకు ఓకే అనిపిస్తుంది. మలైకా టి. వాసుపల్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక నెరేటర్‌గా మూవీ అంతా స్టోరీని రన్ చేసే పాత్రలో అనుష్క లుహార్ యాక్టింగ్ ప్లస్ అయింది. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఆమె క్యారెక్టర్ ద్వారానే చాలా ఇంట్రెస్టింగ్‌గా రివీల్ చేశారు. హీరో పేరెంట్స్ రోల్స్‌లో బ్రహ్మాజీ, ఇంద్రజ తమ సీనియారిటీతో సినిమాకు సపోర్ట్ ఇచ్చారు. సుమన్ క్యారెక్టర్ కాసేపే ఉన్నా డీసెంట్‌గా అనిపిస్తుంది. సుమన్, ఎల్.బి. శ్రీరామ్ తమ అనుభవంతో పాత్రలకు సహజత్వాన్ని తీసుకురాగా, బ్రహ్మాజీ, ఇంద్రజ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ టీం పనితీరు : సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ అందించిన పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా లవ్ ఫీల్ ను బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ మూవీకి హైలైట్. వైజాగ్, రాజమండ్రి, గోవా బ్యూటీని కెమెరామెన్ రుప్ప గోపీకృష్ణ చాలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. డైరెక్టర్ రొమాంటిక్ ట్రాక్‌ను బాగానే హ్యాండిల్ చేశారు. దర్శకుడు మంగా శ్రీనివాస్ ప్రేమకథకు భావోద్వేగాలను జోడించే ప్రయత్నం చేశారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం, రుప్ప గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బడ్జెట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. లిమిటెడ్ లొకేషన్స్‌లో షూట్ చేసినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. (నటీనటులు: శ్రవణ్, మలైకా టి. వాసుపల్, ఇంద్రజ, సుమన్‌, బ్రహ్మాజీ, ఎల్‌బీ శ్రీరామ్‌ తదితరులు, ఎడిటర్: మార్తండ్ కే వెంకటేష్, సినిమాటోగ్రఫీ: రుప్ప గోపీకృష్ణ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, దర్శకుడు: మంగా శ్రీనివాస్, నిర్మాత: డాక్టర్ చింతాడ హేమారావు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here