తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించడంతో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు.. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాప్ట్‌వేర్ సాయంతో ట్యాపింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేశామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు అందినట్లు.. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు ప్రణీత్‌రావు పేర్కొన్నారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్తవాటిని అమర్చామని.. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు.. సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తం కాల్చేసినట్లు .. ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేసినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇందులో ప్రధానంగా నాటి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తన అధికారం నిలుపు కోవడంతో పాటు..విపక్ష పార్టీలను సర్వనాశనం చేయడం..బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడడం, వ్యాపారుల వద్ద డబ్బులు లాగడం వంటి అనేక అక్రమాలకు పాల్పడ్డట్లుగా విచారణలో బయటపడుతోంది. ప్రాంతీయ పార్టీలు ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతాయనడానికి కెసిఆర్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఉదాహరణ. అందుకే వరుసగా రెండోసారి విజయం సాధించారు. మూడోసారి కూడా విజయం తప్పదన్న ధీమాలో ఉన్నా లెక్క తప్పింది. ఇప్పుడు నాటి అక్రమాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. రాష్టాన్న్రి అప్పులకుప్పగా చేయడమే గాకుండా, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నేతగా కెసిఆర్ చరిత్ర సృష్టించారు. ఇందుకు మూల్యం చెల్లించుకున్నారు. ఇంకా చెల్లించుకోబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో నిందితుడైన ప్రణీత్‌రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీసింది ప్రణీత్‌కు సహకరించిన ప్రతి ఒక్కర్నీ విచారించాలని దర్యాప్తు బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం జరుగుతోంది. ట్యాపింగ్ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రధారులు అని తెలుస్తోంది. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్టాల్రను కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇకపోతే ఇది వ్యాపారవర్గాలను బెదరించి సొమ్ము చేసుకోవడానికి కూడా ఉపయోగించారు. సినిమాల్లో జరిగినట్లుగానే ఇదంతా జరగడం ఆశ్యరకరంగా ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసి, విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సవిూప బంధువు కావడంతో.. సీపీ స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునే వారు కాదని భావిస్తున్నారు. ఎస్‌ఐబీలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఈ కేసుతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్‌లో పాతుకు పోయినట్లు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ,డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసినా..ఓఎస్డీలుగా కొనసాగారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకిన సంగతి తెలిసిందే.ఇప్పటికే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ మాదిరి విభాగానికి(ఎస్‌వోటీ) ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్-క్యాడర్ అధికారే అయినా.. ఆయన ఆ కమిషనరేట్‌లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు
డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. సదరు అధికారి తన టీమ్‌తో కలిసి రూ.కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమయంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చారు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్‌ఐబీలో ఎలక్ట్రీషన్ గా పని చేసిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ట్యాపింగ్‌పై ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. ఎస్‌ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్‌ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్‌ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ… గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్‌ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈచట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలుచేశారు. హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్‌ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్‌లో తవ్వేకొద్దీ నాటి అక్రమాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి… తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సిందే మరి!