మోడీ పుట్టకముందే నోబెల్‌కు గాంధీ పేరు పరిశీలన : ఏచూరి

0
89

ప్రముఖ ఆంగ్ల నటుడు బెన్‌ కింగ్స్‌లీ నటించిన ‘గాంధీ’ చిత్రం విడుదలైన తర్వాతే జాతిపిత గాంధీజీ గురించి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుతం మోడీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇటీవల మోడీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అనేక అభ్యంతరాలు, విమర్శలు వస్తున్నప్పటికీ ఖాతరు చేయని ప్రధాని… మరోసారి వక్రభాషాలు పలికారు. దీనిపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ప్రధాని వ్యాఖ్యల్ని విమర్శించారు.

తాజాగా సీపీఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్‌మీడియా పోస్టు పెట్టారు. ‘1982లో విడుదలైన గాంధీ సినిమా తర్వాతనే ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలిసిందని మోడీ అనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నరేంద్ర మోడీ పుట్టక ముందే మహాత్మా గాంధీ పేరు ఐదు నోబెల్‌ శాంతి బహుమతుల కోసం పరిశీలించబడింది. కానీ ఆ సమయంలో భారతదేశం బ్రిటీష్‌ వలస దేశంగా ఉన్నందున ఆయనకు ఎప్పుడూ అవార్డు ఇవ్వలేదు. జాతిపిత, మహాత్మా గాంధీ తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తరతరాలుగా శాంతి, అహింసకు రాయబారిగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడ్డాడు’ అని ఏచూరి తన పోస్టులో పేర్కొన్నారు.