ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరొందిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో విలువైన వస్తువుల అదృశ్యం, భద్రతా లోపాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కె.మురళీధరన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, ఆలయ సంపద రక్షణలో ఎలాంటి రాజీ పడబోమని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఆలయ పరిపాలన కమిటీ నుంచి నివేదిక అందిందని, హోం మంత్రిత్వశాఖతో సమీక్షించిన తర్వాత దర్యాప్తు సరళిని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మరోవైపు , శబరిమల ఆలయ బంగారం అవకతవకలపై ప్రస్తుతం సాగుతున్న సిట్ దర్యాప్తుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. హైకోర్టు ఆదేశాల ప్రకారం నియమించినందున తాము మార్పులు చేయలేమని మంత్రి కె.మురళీధరన్ పేర్కొన్నారు. వస్తువులు మాయమయ్యాయంటూ వస్తున్న పోలీసుల నివేదికను ఆలయ కమిటీ, ట్రావెన్‌కోర్ రాజకుటుంబం తీవ్రంగా ఖండించాయి. ఆలయంలోని వజ్రాల నగలతో సహా అన్ని విలువైన ఆస్తులు నిక్షేపంగా భద్రంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారమే క్రమం తప్పకుండా ఆడిటింగ్ జరుగుతోందని కమిటీ స్పష్టం చేసింది. రాజకుటుంబ ప్రతినిధి ఆదిత్య వర్మ మాట్లాడుతూ.. పోలీసుల నివేదిక ఏకపక్షంగా ఉందంటూ దాని విశ్వసనీయతను ప్రశ్నించారు. తాము స్వయంగా నిర్వహించిన వ్యక్తిగత తనిఖీల్లో పోయాయనుకున్న వస్తువులన్నీ గర్భగుడి వద్దే సురక్షితంగా ఉన్నట్లు తేలిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా తమ పరిధిలోని ఆలయాల్లో గల ఖరీదైన వస్తువులు, లావాదేవీలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు కె.జయకుమార్ వెల్లడించారు.





