- ప్రహసనంగా మారిన పంటల నష్ట పరిహారం
- జూదంలా మారిన అన్నదాతల పంటలసాగు
- అకాల వర్షాలు మరోమారు తెలుగు రాష్ట్రాల రైతులను దెబ్బతీసాయి. పంటచేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో పంటలు నేలకొరిగాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు రాక..అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఏటా ఇది జరుగుతున్న తంతే. వరి, బొప్పాయి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు ఇలా దెబ్బతింటున్నాయి. అన్నదాతల పంటలసాగు జూదంలా మారింది. పంటలు దండిగా పండితే మద్దతు ధరలు ఇవ్వరు. పంటలు చేతికొస్తాయనుకుంటే వడగళ్లకు నేలరాలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నష్ట పరిహారం కూడా ప్రహసనంగా మారింది. అధికారులు రావాలి..అంచనాలు వేయాలి…తరవాత అరకొ సాయం అందుతుంది. కొందరికి అదికూడా అందదు. ఇంతటి దౌర్భాగ్యంలో రైతులు ఉన్నా..ఊరడించే పాలకులు సకాలంలో సాయం చేసే చర్యలు తీసుకోరు. నిజానికి సమగ్ర పంటలబీమా పథకాన్ని ప్రవేశ పెట్టాలి. ప్రీమియం ప్రభుత్వాలే కట్టుకుంటే..రైతులకు పంటనష్టపోయినప్పుడు నూటికనూరు శాతం నష్ట పరిహారం వచ్చేలా చేయాలి. అప్పుడు అన్నదాత నిశ్చితంగా పంటలు సాగుచేస్తారు. సమగ్ర పంటల బీమాతో రైతులను ఆదుకునేలా ప్రణాళికలను అత్యవసరంగా సిద్దం చేయాల్సి ఉంది. మనిషికి, పశువులకు, వాహనాలకు, ఇళ్లకు బీమా చేస్తున్న పద్దతిలోనే పంటల బీమాకు కూడా ప్రణాళిక చేయాల్సి ఉంది. ఇకపోతే ఏటా పంటల బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించి.. వారంతా ప్రీమియం చెల్లించేలా ప్రోత్సహిం చడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వారికి పరిహారం అందడం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రైతులను చైతన్యం చేయించి వారితో నామమాత్రంగా బీమా సొమ్ము చెల్లించేలా చేయించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించడం వల్ల ఒక్కో రైతు కనీసం వందమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించవచ్చు. దీంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు, ఎగుమతులకు అవకాశాలు పెరుగతాయి. విదేశీ మారక నిల్వలను సాధించవచ్చు. ఈ సూత్రాన్ని గతంలో ఉన్న ఏ ప్రభుత్వం పాటించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా పాటించడం లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన మోదీ వారి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. కేవలం విదేశీ పెట్టుబడులే సర్వస్వం అన్న విధంగా నేతలంతా ఆయా దేశాల ముందు మోకరిల్లుతున్నాయి. కానీ ఏనాడు రైతులకు ఒక్క పైసా విదిల్చడం లేదు. గిట్టుబాటు ధరలు, పంటలకు బీమా తదితర అంశాలను పట్టించుకోవడం లేదు. రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం కదలడం లేదు. పంటల బీమా విధిగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటే రైతులను ఆదుకున్న వారు అవుతారు. ఇందుకు జాతీయ స్థాయిలో సమగ్ర బీమా పథకం అమలు చేయాలి. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తించేలా చూడాలి. పంటనష్ట పోయిన రైతులు ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా లేదా..బిచ్చమెత్తుకునే ఉండే పరిస్థితులు పోవాలి. బీమా సొమ్ము దర్జాగా రాబట్టుకునేలా చట్టాలు రావాలి. అప్పుడే అన్నదాత కంటినిండా నిద్రపోగలడు. ప్రధానంగా బీమా పథకాల వల్ల కలిగే లబ్దిపై వారికి సమాచారం ఉండడం లేదు. అకాల వర్షాలు, వడగళ్లు, తుఫాన్లు సంభవిస్తే జరిగే నష్టాలను పొందేలా సమగ్ర బీమా పథకం రూపొందించాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ ఇలా చేయలేకపోతున్నారు. అలాగే ఏ పంటకు ఎంత చెల్లించాలన్న సమాచారం కూడా రైతులకు చేరడం లేదు. అలాగే పథకాల అమలుపై రైతుల్లో చైతన్యం కానరావడం లేదు. వడగళ్లు, విలయం సంభవించి నప్పుడు ప్రభుత్వాలపై ఆధారపడి పరిహారం అందక లబోదిబోమంటున్నారు. దీనిని తప్పించేందుకు ఫసల్ బీమా వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులను చైతన్యం చేయకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో బీమాకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. గతంలో కనీసం ఇందులో పది శాతం మంది కూడ బీమా ప్రయోజనాలు పొందలేకపోయారు. వేల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచారం. క్షేత్రస్థాయిలో అధికారులు తగిన రీతిలో రైతులకు బీమా సమాచారాన్ని చేరవేయక పోవడంతోనే బీమాకు దూరమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో ఖరీఫ్, యాసంగి పంటల బీమా ప్రీమియం ధరలు ఎప్పుడు ఎలా చెల్లించాలో గ్రామాల వారిగా వ్యవసాయాధికారులు దండోరా వేసి రైతుల దృష్టికి తీసుకుని రావాలి. బీమా పథకంలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, శనగ పంటలతో పాటు మామిడి తోటలను చేర్చారు. అతివృష్టి, అనావృష్టి, వడగండ్లు, ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతింటే రైతులను ఆదుకోవడంలో బీమా పథకం ప్రధానపాత్ర పోషిస్తోంది. పత్తికి వాతావరణ ఆధారిత బీమా, సోయాబీన్‌కు గ్రామం యూనిట్, జొన్న, కంది, పెసర, మినుము తదితర పంటలకు మండలం యూనిట్‌గా పంట బీమా అమలు చేయాల్సి ఉంది. దీనికితోడు టమాట, మామిడి పంటలకు కూడా వాతావరణ బీమాను ప్రకటించడం వల్ల రైతులకు ఊరట కలగనుంది. పంటల వారీగా ప్రీమియం ధరలు, చెల్లించాల్సిన గడువు తేదీల వివరాలతో కూడిన మార్గదర్శ కాలను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు రైతులకు తెలియచేయాలి. ఎన్ని హెక్టార్లలో ఏ విధమైన పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయాలి. ఏ పంట సాగు విస్తీర్ణం ఎలా ఉంటుందన్నది సీజన్‌కు ముందే కానుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద వరి, మొక్క జొన్న, వేరుశనగ, శనగ పంటలకు వాతావరణ ఆధారిత బీమా పథకంలో భాగంగా మామిడి పంటలకు బీమా వర్తిస్తుంది. పంటరుణం తీసుకునే రైతులు, రుణం అవసరం లేని రైతులు కూడా బీమా పథకాలను వినియోగించుకోవచ్చు. అయితే పంట రుణాలను పొందాలనుకున్న రైతులకు సంబంధించి రుణం అందజేసే సమయంలోనే ప్రీమియాన్ని తీసుకుని మిగతా మొత్తాన్ని సదరు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. పంట నష్టం జరిగితే పరిహారం రావాలంటే నిర్ణీత గడువులో బీమా చెల్లించాలి. ఈ విషయంలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి ప్రతి రైతు ప్రీమియం చెల్లించేలా కృషి చేయాలి. ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఏఈవోలు, ఏవోలను సంప్రదించేలా క్షేత్రస్థాయిలో రైతులకు తెలియచేయాలి. పంట రుణాలు తీసుకోని రైతులు నేరుగా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. విూ సేవా కేంద్రాలు, బ్యాంకులు తదితర వాటి ద్వారా చెల్లించవచ్చు. ఇవన్నీ గ్రామస్థాయిలో ప్రచారం జరగాలి. అప్పుడే పంటలకు తగిన భరోసా దక్కుతుంది. మిర్చి,పత్తి,శనగ తదితర రైతులు నష్టం సంభవించి నప్పుడు ఏ విధంగా పరిహారం పొందవచ్చో గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేయాలి. విదేశీ పారిశ్రామిక వేత్తలను కాళ్లావేళ్లాపడుతూ వారి ప్రాపకం కోసం పాకులాడే రోజులు పోయేలా రైతులు స్వయం సమృద్ది సాధించాలి. అప్పుడే దేశంలో రైతులకు భరోసా దక్కుతుంది.