
పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ప్రధానిమంత్రి మోదీకి, ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సైనికులకు తమ పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఎన్ సీసీ నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కే సదా శివారెడ్డి, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వీ వీ జి కృష్ణం రాజు (వేణు ), కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ – పహాల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన సైన్యం, మన ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు తీసుకుంటున్న చర్యలకు మా పూర్తి మద్ధతు తెలియజేస్తున్నాం. వారికి సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాం. మన సైన్యం ఉగ్రవాదలకు గట్టి బుద్ధి చెబుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగరావు మాట్లాడుతూ .. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు.. ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ దాడి కి కఠినమైన ప్రతిఘటన ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నాము అని చెప్పారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – మన భారతదేశంలో ఎన్నో మతాల వారు కలిసి మెలిసి ఐక్యంగా ఉంటున్నాం. ఇలాంటి ఉగ్రచర్యల వల్ల మన ఐక్యతకు భంగం వాటిల్లదు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన ప్రభుత్వం , సైన్యం తీసుకుంటున్న చర్యలకు మా సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నాం. అన్నారు.
ఎఫ్ఎన్ సీసీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ – పహాల్గాం ఉగ్రదాడి పిరికిపందల చర్య. ఈ దాడిని మనమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఉగ్రవాదులు మరోసారి ఇలాంటి దాడులు జరపకుండా గట్టి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని నమ్ముతున్నాం. ప్రధాని మోదీ గారికి, మన సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటానికి మేమంతా మీతోనే ఉన్నామని తెలుపుతున్నాం. అన్నారు.
తుమ్మల దేవుశ్రీ మాట్లాడుతూ – పహాల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి క్రూరమైన చర్య. ఆ ఘటనలో అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు. మృతుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. కాశ్మీర్ పర్యటనకు గతంలో వెళ్లాను. అక్కడి ప్రజలు మంచివారు. ఎంతో ఆహ్లాదరమైన కాశ్మీర్ లో ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వారికి మన ప్రభుత్వం, సైన్యం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పాలి. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆది శేషగిరి రావు, కాజా సూర్యనారాయణ, నటుడు చిన్నా, బెనర్జీ తదితరులతో పాటుగా ఎఫ్ఎన్ సీసీ సభ్యులు కొవ్వుత్తుల ప్రదర్శన చేసి పహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.