
చారిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమం గొప్ప అనుభవం అని, కానీ తెలంగాణ ఆకాంక్షలకు అనుభవానికి చాలా అంతరం కనిపిస్తున్నదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నమూనా మార్పుతో ప్రపంచ వ్యాప్తంగా భయంకర వాతావరణం నెలకొని ఉందని ఆవేదన వెలిబుచ్చారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు కందుకూరి రమేష్ బాబు రచించిన “విను తెలంగాణ” పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆచార్య హరగోపాల్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాలకులు ప్రజల గుండె చప్పుడు వినాలని, ప్రజల నాడి తెలుసుకోవాలని సూచించారు. గత పదేళ్ల ప్రభుత్వానికి ఖాళీగా వున్న భూములు మాత్రమే కనిపించాయని, భూమిపై వుండే మనుషులు కనిపించలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రాణ త్యాగాలు చేసిన యువత స్ఫూర్తి ఏమయ్యిందని, మానవీయ తెలంగాణ కావాలనే స్వప్నాన్ని యువతకు అందించ లేకపోయారని హరగోపాల్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను ఉద్యమనేత కోదండరాంకు అప్పగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్నదని హరగోపాల్ అన్నారు. సామాజిక ప్రయోజకత్వం వున్న విను తెలంగాణ పుస్తకం పై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తన 55 ఏళ్ల పౌర హక్కుల ఉద్యమంలో తనను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదని, తెలంగాణ వచ్చాక చిన్నపాటి విద్యా ఉద్యమం చేస్తే అరెస్ట్ చేశారని విచారం వ్యక్తం చేశారు. భిన్న సందర్భాల్లో రచయిత కందుకూరి రమేష్ బాబు స్పందన స్పష్టంగా ఆలోచనాత్మకంగా ఉందని అభినందించారు. సభాధ్యక్షత వహించిన రచయిత, కవి, దర్శకుడు బి.నరసింగరావు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమిస్తే, తెలంగాణ వచ్చాక గత పదేళ్లలో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం గద్దర్ తో పాటు తనకు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భావజాలం చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలని, రాజకీయ నాయకులు మానవతా దృక్పథంతో ప్రజలను కలవాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్ద కాలపు తప్పులను విను తెలంగాణ పేరిట ఎత్తి చూపించడం గర్వకారణం అని అభినందించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ జన ఆలోచనలకు సమస్యలకు విను తెలంగాణ పుస్తకం దర్పణం అని, వర్తమాన తెలంగాణను అర్ధం చేసుకోవడానికి ఇది దోహద పడతుందని ఆయన వివరించారు. సమస్యలను విస్తృత ఆలోచనలతో జన బాహుళ్యంలోకి తీసుకెళ్లి తద్వారా రాజకీయ ఎజెండాగా మార్చగలిగితే ఫలితం ఉంటుందని, ఎవరికి వారు వారి పంథాలో కృషి చేయాలని కోరారు. భవిష్యత్ తెలంగాణ చిత్రపటం పట్ల ప్రజలకు స్పష్టత ఉందని, పాలకులకే స్పష్టత లేదన్నారు. రచయిత కందుకూరి రమేష్ బాబు మాట్లాడుతూ గత పదేళ్ల ప్రభుత్వం పై విమర్శ, ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్చరిక విను తెలంగాణ పుస్తకం అని వివరించారు. సీనియర్ పాత్రికేయులు రేమిల్ల అవధాని, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ పాల్గొన్నారు.