
-తెలుగు భాషాభిమానులు గొంతెత్తి భాషోద్యమం చేయాలి
-హై కోర్టు సీనియర్ న్యాయవాది, ఆలేరు మాజీ జెడ్పిటీసి, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్
ఇంటర్‌లో సంస్కృతభాషని రెండో భాషగా బోధించడాన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక వ్యాపార సూత్రంగా మొదలు పెట్టాయి. బాగా వ్యాప్తి చేసి తెలుగును ఇంటర్‌లో లేకుండా చేయడానికి కారణం అయ్యాయని హై కోర్టు సీనియర్ న్యాయవాది, ఆలేరు మాజీ జెడ్పిటీసి, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంస్కృత భాషాసాహిత్యాలను ఎప్పుడూ తక్కువచేసి మాట్లాడడం లేదు. మాకు వాటిపైన ఎంతో ప్రేమ ఉంది. సంస్కృత సాహిత్యంలో పురాణ కథలే కాదు శాస్త్రాలు ఉన్నాయి, ఎంతో విజ్ఞానం ఉంది. నాలాంటి సంస్కృతభాషా ప్రేమికులు కూడా ఇంటర్‌లో సంస్కృతం రెండో భాషగా పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో కూడా ఈ పరిస్థితిని తీసుకురావడానికి ప్రభుత్వ అధికారులు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఇంటర్‌లో తెలుగును రెండోభాషగా తీసుకోవాలంటే ఒకటినుండి పదో తరగతి వరకు తెలుగు రెండోభాషగా చదివి ఉండాలి. కానీ ఇంటర్‌లో సంస్కృతం రెండో భాషగా తీసుకోవాలంటే అసలు అప్పటిదాకా సంస్కృతం చదివి ఉండవలసిన అవసరం లేదు. అంటే సంస్కృతాన్ని ఒకటో తరగతి స్థాయిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చెబుతారన్నమాట. కాబట్టి ఇంటర్‌లో తెలుగుస్థాయి నేర్చుకోవడానికి 10సంవత్సరాలు అంతకు ముందు చదివి ఉండాలి దానికి ఆస్థాయి ఉంటే సంస్కృతానికి కనీసం ఐదో తరగతి స్థాయికూడా ఉండదు. ఇంటర్‌లో సిలబస్ తెలుగుది సంస్కృతానిది చూడండి తెలుగులో కావ్యపాఠాలు అంటే ప్రాచీన పద్యసాహిత్యం గ్రాంథిక వచనం, వచన సాహిత్యం, వ్యాకరణం, (సంధులు, సమాసాలు, అలంకారాలు వగైరా) ఛందస్సు ఇవన్నీ నేర్చుకొని పరీక్షలురాయాలి. కానీ సంస్కృతం సిలబస్ ఏది ఉన్నా అక్కడ అతి ప్రాథమికమైన శబ్దరత్నావళిలోని శబ్దాలు ధాతువులు బట్టీ పట్టి పరీక్షలో రాసేస్తే 80శాతానికి పైగా వచ్చేలాగా పరీక్షావిధానం ఉంటుంది. మిగతా కావ్యపాఠాలున్నా వాటిని సంస్కృతంలో రాయనవసరంలేదు. ఇంగ్లీషులో కూడా రాసే సౌకర్యం ఉందట. ఇంటర్ వరకు తెలుగు నేర్చుకుంటే ఆ పరిజ్ఞానం జీవితంలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇంటర్ విద్యార్థులు తర్వాత ఏ చదువు చదివినా ఉద్యోగాలు చేసినా ఇది వారికి ఉపయోగపడుతుంది. కానీ ఇంటర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం చదివిన విద్యార్థులు తొంబై శాతం మంది ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులకువెళతారు. కొద్దిమంది ఆర్ట్స్‌విద్యార్థులున్నా గ్రూపు పరీక్షలు సివిల్‌సర్వీస్ పరీక్షలకు పోతున్నారు. అక్కడ ఈ సైన్సు విద్యార్థులకు కానీ ఆర్ట్స్ విద్యార్థులకు కానీ ఇంటర్‌లో నేర్చుకున్న సంస్కృతం అసలు సంబంధం ఉండదు. దానితో ఇంటర్‌తర్వాత విద్యార్థులకు సంస్కృతం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అక్కడితోనే దానితో సంబంధం పోతుంది. ఇంటర్‌లో కార్పరెట్ కల్చర్‌తో ఉన్న ఈ సంస్కృతం వల్ల విద్యార్థులకు ఏ ఉపయోగం లేదని చెబుతున్నాము. అంతే కానీ సంస్కృతభాషా సాహిత్యాల గొప్పతనాన్ని తగ్గించడం కాని తక్కువచేసి మాట్లాడడం కానీ చేయడంలేదు. సంస్కృతాన్ని ఒక వ్యాపార వస్తువుగా చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎక్కువ మార్కులు చూపే యంత్రంగా వాడుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకటి నుండి పదవ తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా చదువుకోవాలనే నిబంధన పెట్టింది. అంటే తెలంగాణలోని ఏ పాఠశాలలోనైనా తప్పనిసరిగా విద్యార్థులు తెలుగు చదవాలనే నిబంధన ఉంది. ఈ కారణంగా ఇదే విద్యార్థులు ఇంటర్‌లోనికి రాగానే సంస్కృతం తీసుకోవడానికి కారణం అందులో 97, 98 శాతం మార్కులు కూడా వేస్తారని తెలుగులో అంత వేయరని ఫస్టుక్లాసు మార్కులో గొప్ప అని ప్రచారం చేసి మీ పిల్లలకు అగ్రిగేటు మార్కులు పెరుగుతాయని కళాశాలలవారు చెబుతున్నారు. అసలు పదో తరగతి వరకు చదవని భాషను ఇంటర్లో విద్యార్థులు తీసుకోవడాన్ని నిషేధించాలి. ఒకటవతరగతి నుండి పదవ తరగతి వరకు రెండో భాషగా ఏది ఉంటే అదే భాషని ఇంటర్‌లో విద్యార్థులకు ఉండాలని తప్పనిసరి నియమాన్ని ప్రభుత్వం పెట్టాలి. అప్పుడు ఇంటర్‌లో కూడా తెలుగు తప్పనిసరి అవుతుంది. ఇక సంస్కృతంలో ఉన్నత విద్య అంటే ఎం.ఏకానీ పిహెచ్‌డి కానీ చేసినవారికి ఉద్యోగావకాశాలు కావాలి కదా అందుకని సంస్కృతాన్ని పెట్టాల్సిందే అనే ప్రభుత్వాధికారులున్నారు. నిజమే తెలుగులో ఉన్నత విద్యను చదువుకొని ఉద్యోగావకాశాలకోసం చూసేవారు నూటికి తొంబై మంది ఉంటే సంస్కృతం చదివినవారు పది మంది ఉంటారు. అంటే తొంబైశాతం ఉద్యోగావకాశాలు కల్పించడానికి బదులు పది శాతం మందికి కల్పించి ఆకారణంగా సంస్కృతాన్ని పూర్తిస్థాయిలో పెట్టి తొంబై శాతం మంది ఉన్న తెలుగులో ఉన్నతవిద్య చదువుకున్నవారికి ఉద్యోగావకాశాలను ఈ ప్రభుత్వాలు పోగొడతాయా. ఇది న్యాయమా… ఇంటర్‌లో తెలుగు లేకుండా పోతే రెండు మూడు సంవత్సరాలలో డిగ్రీలో కూడా తెలుగు చదివే వారుండరు. కారణం ఇంటర్‌లో రెండోభాష తెలుగులేకుంటే డిగ్రీలో చదివే వీలు లేదు. ఇక డిగ్రీలో తెలుగు చదివే వారు లేకుంటే విశ్వవిద్యాలయాలలో ఉన్న ఎం.ఏ. పిహెచ్.డి కోర్సులకు అసలు విద్యార్థులు లేని పరిస్థితి ఐదు లేకా ఆరు సంవత్సరాలలోనే వస్తుంది. ఇందువల్ల విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు మూసి వేసే పరిస్థితి వస్తుంది. ఈ కారణంగానే ఇంటర్‌లో కార్పొరేటు సంస్కృతానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావలసిన పరిస్థితి ఉన్నది. ఇంటర్‌లో సంస్కృతాన్ని ఏ రాష్ట్రమైన ఆప్షనల్ గా పెట్టదలచుకుంటే తెలుగు సిలబస్‌తో సమానంగా సంస్కృతం సిలబస్ కూడా ఉండాలి. ఒకటో తరగతినుండి సంస్కృతం చదువుకున్నవారే అర్హులుగా ఉండాలి. పరీక్షలు వేరే భాషలో కాకుండా సంస్కృతంలోనే రాయాలి. కారణం తెలుగు విద్యార్థులు తెలుగులోనే రాస్తారు కాబట్టి. ఇదే సమన్యాయం కనుక. ఇలా కాని పక్షంలో ఇంటర్‌లో సంస్కృతాన్ని ప్రభుత్వాలు ఆపేయవలసి ఉంది. అందుకోసం తెలుగు భాషాభిమానులు అందరూ గొంతెత్తి భాషోద్యమం చేయవలసి ఉంది అని బొట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు.