తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాలీకుడు, సామాజిక పరిశోధకుడు సురవరం ప్రతాప్ రెడ్డి నామకరణం చేయడం తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు.
మంగళవారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు సురవరం సాహితీ వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడమంటే ఓ వ్యక్తిని ఆదరించడం కాదని, తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య రంగాలను, జర్నలిజం చరిత్రను విశ్వవ్యాప్తి చేయడమేనని విరాహత్ స్పష్టం చేశారు. గోల్కొండ పత్రికలో తన వార్తలతో ప్రజల్లో ఎనలేని చైతన్యం తెచ్చిన ఘనత ప్రతాప్ రెడ్డికే దక్కిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశంలో తెలుగు భాషకు గౌరవం తెచ్చిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డియే అని ఆయన తెలిపారు. పొట్టి శ్రీ రాములుపై ఎవరికీ ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆయా సంస్థలకు ఈ ప్రాంత మహనీయుల నామకరణం చేసినట్లు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం సముచితమేనన్నారు. ఈ ఆకాంక్ష ఇప్పటిది కాదని, పదేళ్ల నుండి ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రజల ఈ ఆకాంక్షను తీర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి, సభలో బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే బిల్లును ఆమోదించిన ప్రతిపక్ష పార్టీలకు, శాసన సభ్యులకు, ఈ ప్రక్రియ కోసం నిరంతరం కృషి చేసిన సిపిఎం పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు విరాహత్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు సాహత్య, జర్నలిజం రంగాలలో విశేష సేవలు అందిస్తున్న వారికి అందజేస్తున్న ఒక అవార్డుతో పాటు, ఈ రంగాలలో అధ్యయనం చేస్తున్న ప్రతిభావంతులకు ఒక స్కాలర్‌షిప్‌ను “సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం” తరపున ఇవ్వాలని ట్రస్ట్ భావిస్తున్నదని, దీనిపై ట్రస్ట్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య చెన్నయ్య మాట్లాడుతూ, చీకటిలో మగ్గుతున్న తెలుగు ప్రజల స్వాభిమాన ప్రతీకగా సురవరం ప్రతాప రెడ్డి నిలిచారని, తెలుగు యూనివర్సిటికి ఆయన పేరు పెట్టడం ద్వారా తెలుగు సాహిత్య రంగానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ట్రస్టీలు సురవరం పుష్పలత, డాక్టర్ కృష్ణవర్ధన్ రెడ్డి, డాక్టర్ కొండా లక్ష్మీకాంత రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి మనుమలు సురవరం అనిల్‌రెడ్డి, సురవరం కపిల్, సుధీర్ తదితరులు పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Home Hyderabad web desk సురవరం నామకరణం…. తెలంగాణ సమాజానికి దక్కిన గౌరవం : టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ