- ఆవిరవుతున్న లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద
- వస్తూత్పత్తి పెరిగేదెప్పుడు?
- కుదేలవుతోన్న స్టాక్ మార్కెట్లు!
దేశంలో వస్తూత్పత్తి పెరిగేలా చేసుకోవడంలో మనం చైనా నుంచి ఎంతో నేర్చుకోవాలి. వియత్నాం, క్యూబా, కొరియా లాంటి దేశాలు కూడా ప్రపంచంతో పోటీపడగలిగేలా వస్తూత్పత్తిలో ముందుకు సాగుతున్నాయి. దేశంలో మానవనరులు విపరీతంగా ఉన్నాయి. జనాభా 140 కోట్లు దాటి చైనాను మించి పోయాం. చైనా లాగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో మనం ముందుకు పోవాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు, ప్రోత్సాహకాలు అసవరం. మనదగ్గర పండే పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు, ఎగుమతులు చేసుకునేలా సరళీకరణ విధానాలు రావాలి. అప్పుడే బియ్యం, మిర్చి, పత్తి వంటివి ఎగుమతి కాగలవు. అలా మన వస్తువులకు సుంకాలను మనమే విధించగలం. ఇప్పుడు అమెరికా సుంకాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు అవసరమున్న వస్తువులనే దిగుమతి చేసుకుంటే సుంకాల బాధతో పాటు, విదేశీమారకం బాధ తప్పుతుంది. కానీ దేశంలో ఇన్నేళ్లయినా ఈ విషయంలో మనం స్పష్టతతో లేమా అన్న అనుమానం కలుగుతోంది. అందుకే విదేశాలు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు తీసుకునే నిర్ణయాలతో మన ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాం. చైనాలో అలాంటి పరిస్థితి మాత్రం కానరావడం లేదు. ద్రవ్యోల్బణం అరికట్టడానికి…దిగుమతులపై సుంకాలు తగ్గేలా చేయడానికి ముందుగా మన విదేశాంగ విధానం సవిూక్షించుకోవాలి. ఇప్పటికీ మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో ప్రపంచ దేశాలపైనే ఆధారపడి ఉన్నాం. గూగుల్ సిఇవో, మైక్రోసాఫ్ట్ సిఇవోలు మనవారే ఉన్నా..ఈ రంగంలో మనం అంతగా రాణించడం లేదు. దేశీయంగా మన ఉత్పత్తులను పెంచుకుని మనం సుంకాలు విధించే స్థితిలో ఉంటే..అవి ప్రపంచ దేశాలకు అవసరమైతే మన డిమాండ్ పెరుగుతుంది. మేకిన్ ఇండియా, ఓకల్ ఫర్ లోకల్ వంటి నినాదాలు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన దేశంలోని సామాన్యులందరిపై ప్రభావం పడుతున్నది. సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇటీవల ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్ క్రమంగా బలపడుతున్నది.అదే క్రమంలో మన రూపాయి మరింత బలహీన పడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వేల కోట్లను యూఎస్‌కు తరలించుకుపోతుండడంతో మన స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమై.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగు తున్నాయి. దీంతో విదేశీ మరకాల నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండడంతో వాటి రేట్లు సైతం అనూహ్యంగా అందనంతగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.100కు, గోల్డ్‌రేట్ రూ.లక్షకు చేరుతుందని.. దీని వల్ల మనదేశంలోని సామాన్యులపై మరింత భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు చుక్కలు చూపుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పతన మవుతున్నది. ఇటీవలి కాలంలో వేగంగా పడిపోతున్న రూపాయి మారకం విలువ ఫిబ్రవరి 5న 87.38 ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. గతేడాది నవంబర్6న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో డాలర్ బలపడ్తూ వస్తున్నది. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నది. నవంబర్ 5న డాలర్‌తో పోలిస్తే రూ.84.16 గా ఉన్న రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ డిసెంబర్19న 85 మార్క్ చేరింది. ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాక దూకుడుగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో కేవలం నెలన్నర వ్యవధిలో డాలర్‌విలువ 2 రూపాయల మేర పెరిగింది. ఇటీవల ట్రంప్.. కెనడా, మెక్సికో దేశాల వస్తువులపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం దిగుమతి సుంకం విధించారు. దీంతో అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొని డాలర్ బలపడుతుండగా, డాలర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడం, అక్కడ బాండ్లపై మంచి రిటర్న్స్ వస్తుండటంతో మన దగ్గర విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జనవరి నుంచి ఇప్పటివరకు రూ.68,441 కోట్లకు పైగా వెనక్కి పట్టుకు పోయారు. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది. డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి బలహీనపడుతోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో దిగుమతులు ఖరీదవుతున్నాయి. మరోపక్క ద్రవ్యోల్బణం పెరగడంతో కార్పొరేట్ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించి, ఉద్యోగాల్లో కోత, సరకుల సరఫరా తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అటు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చుల మొత్తం పెరిగి తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో మున్ముందు నిత్యావసరాల ధరలు మరింత పెరుగుతాయనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో దేశీయంగా మానవవనులను ఉపయోగించుకోవాలి. ఏదో ఒకపని ద్వారా ప్రపంచానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిపై దృష్టి సారించాలి. దీంతో నిరుద్యోగం నిర్మూలించడంతో పాటు, వస్తూత్పత్తి పెరిగి, అంతర్జాతీయ మార్కెట్‌లో నిలదొక్కుకోగలం.