– కోచింగ్ పేరిట సమాజానికి దూరంగా జీవనం
– వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు
– నీట్ అభ్యర్థుల వెతలు
నీట్-యూజీ పరీక్ష రాసిన వారందరూ తీవ్రమైన మానసిక అశాంతి, ఒత్తిడికి గురయ్యారు. పరీక్షకు సన్నద్ధమయ్యే పేరుతో సమాజ జీవనానికి దూరమయ్యారు. దీర్ఘకాలం కోచింగ్ తీసుకోవడం ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది. కోచింగ్ కేంద్రాల్లో చేరిన వారు అధిక ఫీజులు భరించలేక మధ్యలోనే బయటికి వచ్చేశారు. కొందరైతే తీవ్ర ఒత్తిడికి లోనై మందులు వాడాల్సి వచ్చింది. నీట్-యూజీ ఫలితాలను అనూహ్యంగా జూన్ 4న ప్రకటించారు. ఈ పరీక్ష కోసం 23 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 13 లక్షల మంది అర్హత సాధించారు. అయితే అందుబాటులో ఉన్న సీట్లు కేవలం 1,08,940 మాత్రమే. వీటిలో 706 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సుమారు యాభై వేల సీట్లు ఉన్నాయి. అట్టడుగు వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన విద్యార్థులు నీట్లో జరిగిన అవకతవకలు, కుంభకోణం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు. ర్యాంకు వచ్చినప్పటికీ ప్రయివేటు వైద్య కళాశాలలో చదవాల్సి రావడం బలహీన వర్గాల వారికి ఇబ్బందికరమే. ఎందుకంటే అక్కడ ఫీజులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చు కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే. అదే ప్రైవేటు కళాశాలలో అయితే ఆ భారం యాభై లక్షల రూపాయలకు పైమాటే. చాలా మంది మంచి ర్యాంకులు ఆశించినప్పటికీ ఫలితాలతో నివ్వెరపోయారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, కుంభకోణమే దీనికి కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు. ర్యాంకులు తారుమారు కావడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు ప్రయత్నించామని, ఇక తమకు ఓపిక నశించిందని చాలా మంది వాపోయారు.
ర్యాంకుల్లో గందరగోళం కారణంగా పలువురు విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ఆరోగ్యం కూడా క్షీణిచింది. కలలన్నీ కల్లలయ్యాయి. భవిష్యత్తు అంథకారమయమై పోయింది. వైద్య విద్యను అభ్యసించాలన్న లక్ష్యాన్ని వీడి ఏదో ఒక డిగ్రీలో చేరిపోవడం మంచిదని కొందరు భావిస్తున్నారు. గత ఆరు నెలలుగా రోజుకు 12-14 గంటలు చదివినా ఫలితం దక్కలేదని ఓ విద్యార్థి వాపోయాడు. ‘ఈ ఒక్క పరీక్ష కోసం సమాజ జీవనాన్ని త్యాగం చేశాను. ఇలాంటి పరీక్షను పూర్తి భద్రతతో నిర్వహించడం జాతీయ స్థాయి సంస్థకు సాధ్యం కాదా? నేను మోసానికి గురయ్యాను’ అని చెప్పాడు.
తన ఓఎంఆర్ నంబర్లు మ్యాచ్ కావడం లేదని మరో విద్యార్థి ఆరోపించాడు. ‘నాకు 550 మార్కులు వస్తాయని అనుకుంటే 502 మాత్రమే వచ్చాయి. ఓఎంఆర్ నెంబర్లు తుది స్కోరుతో మ్యాచ్ కావడం లేదు’ అని చెప్పాడు. మంచి ర్యాంక్ వచ్చినా ప్రభుత్వ కళాశాలలో సీటు వచ్చే పరిస్థితి లేదని, కాబట్టి మరోసారి పరీక్షకు సన్నద్ధమవక తప్పదని కొందరు విద్యార్థులు తెలిపారు. కొందరు మాత్రం మరోసారి పరీక్ష రాసే ఆలోచన చేయడం లేదు. ఏదైనా మరో డిగ్రీ చేయాలని అనుకుంటున్నారు. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో కటాఫ్ మార్కులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో మరో సంవత్సరాన్ని ఎందుకు వృథా చేసుకోవాలని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. మళ్లీ చదవాలంటే కష్టమే అయినప్పటికీ పరీక్షను తిరిగి నిర్వహించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్షా ఫలితాలు ప్రకటించిన తర్వాత రాజస్థాన్ కోటాలో కనీసం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
నీట్ యూజీ పేపర్‌లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
నీట్ -యూజీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. జార్ఖండ్ హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) కార్యాలయం నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించిన కీలక నిందితుడు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య సహా మరో నిందితుడిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఇద్దరి అరెస్ట్‌తో నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, మోసం, ఇతర అవకతవకలకు సంబంధించి అరెస్టైన వారి సంఖ్య 14కి చేరిందని అన్నారు. పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య జంషెడ్‌పూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి)లో 2017 బ్యాచ్‌కి చెందిన సివిల్ ఇంజినీర్. బొకారో నివాసి అయిన పంకజ్‌ను పాట్నాలో అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. నీట్ పేపర్‌ను దొంగిలించడంతో పాటు ఇతర గ్యాంగ్ సభ్యులకు అందించడంలో పంకజ్‌కు సహాయం చేసిన మరో నిందితుడు రాజు సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నీట్ ప్రవేశపరీక్షలో అక్రమాలపై విచారణ జరుపుతున్న సీబీఐ ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే.