• ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల
    విధానాలనూ, రాజకీయాలనూ
    ప్రతిఘటించడం

ప్రజాస్వామ్యాన్నీ, లౌకికవాదాన్నీ, రాజ్యాంగం ఇచ్చిన హామీలనూ, ఫెడరలిజం మొదలైన వాటిని కాపాడుకోవడానికీ, స్త్రీల, కార్మికుల, రైతుల, దళితుల, ఆదివాసీల, మైనారిటీల హక్కుల పరిరక్షణకూ, సంఘ్ దాని అనుబంధ సంస్థల విధానాలతోనూ, రాజకీయాలతోనూ పోరాడడం అత్యవసరం.

ఇది చెయ్యాలంటే, మొట్టమొదట చెయ్యవలసినది తాము అజేయులమనే ప్రచారాన్నీ, తమ వెనుక విశాలమైన మెజారిటీ ఉన్నదని ప్రజలలో వాళ్ళు సృష్టించిన
నమ్మకాన్నీ తొలగించాలి. వాస్తవానికి వాళ్ళకు మెజారిటీ సీట్లు లభించినా, సాధారణ ఎన్నికలలో వారికి పోలైన ఓట్లలో మెజారిటీ లభించలేదు. రాష్ట్ర ఎన్నికలలో కూడా దీనికి భిన్నంగా లేదు. వారు గెలిచిన రాష్ట్ర ఎన్నికలలో కూడా వారికి 40 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు.

మనుస్మృతికి వారు కట్టుబడి ఉండడం వలన రాజ్యాంగాన్నీ, స్త్రీలకు సమాన హక్కులనూ వ్యతిరేకించవలసి వస్తుంది. వర్ణాశ్రమ ధర్మానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఓబిసిలకూ, ఎస్సీలకూ, ఎస్టీలకూ ఉన్న రిజర్వేషన్లూ, ప్రత్యేక హక్కులూ నీరు కార్చవలసి వస్తుంది. ఇదంతా మనం విడమరిచి చెప్పి వారి నిజ స్వరూపాన్ని బహిర్గతం చెయ్యడం మాత్రమే కాకుండా ఈ విధానాలతో పోరాడాలి. ప్రైవేటైజేషను బలంగా వ్యతిరేకించాలి. రిజర్వేషన్లను కాపాడాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల డిమాండుకు మద్దతివ్వాలి. కుల జనగణన డిమాండుని సీరియస్ గా తీసుకోవాలి. ఏ రకమైన అస్పృశ్యతనైనా, కుల వివక్షనైనా వ్యతిరేకించాలి. దురాగతాలు జరిగినప్పుడు సమర్థవంతంగా కలుగజేసుకోవాలి.

మన ఉద్యమాలన్నింటిలోనూ స్త్రీల సమస్యలూ, కోరికలూ ఒక భాగం కావాలి. స్త్రీలకు వ్యతిరేకంగా జరిగే అన్ని రకాల హింసనూ వ్యతిరేకించాలి. వారి హక్కుల మీద దాడులు జరిగినప్పుడు పోరాడాలి. జెండర్ వివక్షనూ, స్త్రీలను కించపరిచే ప్రసంగాలనూ, వ్యాఖ్యలనూ వ్యతిరేకించాలి.

సంఘ్ ఎప్పుడూ స్త్రీల సమానత్వాన్నీ, స్త్రీలు తమకు సంబంధించిన విషయాలలో నిర్ణయం తీసుకునే హక్కునూ, పౌర జీవితంలో తమ పాత్రను నిర్వహించే హక్కునూ అంగీకరించలేదు. సంఘ్ అనుబంధ సంస్థలైన దుర్గా వాహిని, రాష్ట్రీయ సేవికా దళ్ లాంటి స్త్రీల సంస్థలు వివాహంలోనూ, గృహంలోనూ సమాన హక్కును వ్యతిరేకిస్తాయి. వివాహ పవిత్రతను కాపాడడానికి స్త్రీలు అన్ని విధాలా రాజీ పడాలి అని ఈ సంస్థలు భావిస్తాయి. కుటుంబంలో స్త్రీల హక్కులను వ్యతిరేకిస్తాయి. మైనారిటీ మతస్తులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా, పోరాడటానికి మాత్రమే స్త్రీలు బయటకు రావాలని అవి భావిస్తాయి. ముస్లింలను హిందూయిజానికి శత్రువుగా భావిస్తూ, హింసతో సహా అన్ని విధాలా ముస్లింలతో పోరాడాలంటాయి. ఒక పక్క స్త్రీలను అణుకువగా, విధేయతతో ఉండమని చెబుతూ, ముస్లింలను వ్యతిరేకించే విషయం తలెత్తినప్పుడు, వారికి ఆయుధ శిక్షణ కూడా ఇస్తాయి. ఈ అవగాహననూ, మత కలహాలను ప్రోత్సహించడానికి స్త్రీలను ఉపయోగించడాన్నీ తీవ్రంగా వ్యతిరేకించాలి. స్త్రీల హక్కులు, సమానత్వానికి సంబంధించి సంఘ్ వైఖరిలోని వైరుధ్యాలను బహిరంగం చెయ్యాలి.

సామాజిక సంస్కరణ కోసం ఉద్యమాలను ప్రారంభించాలి. కులాంతర, మతాంతర వివాహాలకు అండగా నిలవాలి. తిరోగమన, అశాస్త్రీయ ఆలోచనను తర్కంతోనూ, వాస్తవాలతోనూ ఎదుర్కోవాలి.

సంక్షేమ పథకాలు – ముఖ్యంగా స్త్రీలకూ, బాలికలకూ ఉద్దేశించబడినవి అమలు అయ్యేలా చూడడం మన పోరాటాలలో ఒక భాగం కావాలి.

బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల, రైతుల పోరాటాలను నిర్మించాలి. ప్రభుత్వ విధానాలకూ, అణచివేతకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాన్ని సాగించడానికి రైతాంగంలోని విశాలమైన భాగాలను ఎలా సమీకరించవచ్చునో సంవత్సరం పాటు సాగిన రైతు ఉద్యమం ఒక స్ఫూర్తినిచ్చే ఉదాహరణ. వర్గ దోపిడీ వాస్తవాన్ని సంఘ్ అంగీకరించదు. దాని ట్రేడ్ యూనియన్, రైతు శాఖలు దోపిడీదారులకూ, దోపిడీకి గురయ్యేవారికీ మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చెయ్యడం గురించి మాట్లాడుతాయి. దీనర్థం ఏమిటంటే ఒక పక్క కార్మికుల, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, మరో పక్క పెట్టుబడిదారుల, కార్పొరేట్ల ప్రయోజనాలను ముందుకు తీసుకు వెళ్ళడం. కార్మికుల హక్కులను హరిస్తూ బిజెపి ప్రభుత్వం తీసుకు చేసిన చట్టాలూ, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలూ ఈ అవగాహనను రుజువు చేస్తాయి. కార్మికుల, రైతుల హక్కుల కోసం పోరాటాన్ని శక్తివంతం చెయ్యడానికి ఈ అవగాహనను ఎండగట్టడం అత్యవసరం.

సంఘ్ యొక్క మత భావజాలాన్నీ, జాతీయతకు అది ఇచ్చే తప్పుడు వ్యాఖ్యానాన్నీ ఏ మాత్రం అంగీకరించకూడదు. భావజాల రంగంలో పోరాడకుండా, మెజారిటీ మతంలోని అధికులలో ఫాసిస్టు హిందుత్వ, ఆరెస్సెస్లు సాధించిన ఆధిపత్యాన్ని బలహీనపరచడం సాధ్యం కాదు. మనువాద హిందూ రాష్ట్ర నిర్మాణానికి ఆరెస్సెస్ ప్రయాణంలో ఈ ఆధిపత్యమే ప్రజల హక్కుల మీద దాడి చెయ్యడానికి వీలు కల్పిస్తున్నది. అందువలన వారి విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని వారి విషపూరిత భావజాలానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంతో జోడించడం అవసరం.

ప్రస్తుతం సంఘ్ పరివార్ తన భావజాలాన్ని ‘నిజమైన జాతీయత’గా చిత్రించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తోంది. సావర్కర్ను కీర్తించడం ద్వారా, క్షమాపణలు చెబుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి అతని లేఖల జ్ఞాపకాలను తుడిచి వెయ్యడానికి ప్రయత్నించడం ద్వారా, స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్ నుండి ఎవరూ పాల్గొనలేదు అనే వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. సావర్కర్ను నిజమైన స్వాతంత్య్ర యోధుడిగా చిత్రించడం ద్వారా, అతని ‘హిందుత్వ’ సిద్ధాంతాన్ని ‘నిజమైన’ జాతీయవాదంగా కూడా చిత్రించవచ్చు.

ఈ రెండు వాదనలనూ ఖండించాల్సిన అవసరం ఉంది.

మనువాద హిందుత్వ భావజాలాన్ని ఎండగట్టడమూ, వ్యతిరేకించడమూ మాత్రమే కాదు, మన భావజాలాన్నీ, అవగాహననూ మరింత సమర్థవంతంగా, పట్టువిడవకుండా ప్రచారం చెయ్యడం కూడా ముఖ్యం. ఆరెస్సెస్తో పోరాడడానికి మాత్రమే కాకుండా, మరొక ప్రత్యామ్నాయ, ప్రజానుకూల విధానాలు పునాది మీద మన దేశాన్ని అభివృద్ధి చెయ్యడానికి దారిని సుగమం చెయ్యడానికీ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని సురక్షితం చెయ్యడానికీ ఇది అవసరం.

ఇది చెయ్యాలంటే, మన భావజాలాన్నీ, మన చరిత్రనూ ప్రచారం చెయ్యడానికి మరిన్ని ప్రయత్నాలు చెయ్యాలి.

స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టులు పోషించిన మహత్తర పాత్రను ఎత్తి చూపాలి. జాతీయోద్యమానికి ప్రేరణ కలిగించి, అందరినీ కలుపుకుపోగల విశాలమైన ఉద్యమ నిర్మాణాన్ని సాధ్యం చేసిన సూత్రాలను పరిరక్షించాలి. మనువాదుల దాడి నుండి రాజ్యంగాన్ని కాపాడాలి. మన ఉద్యమాలలోనూ, ప్రచారంలోనూ, రాజ్యాంగం మనకు వాగ్దానం చేసిన సామాజిక, ఆర్థిక, జెండర్, రాజకీయ సమానతల మీద దృష్టిని కేంద్రీకరించాలి. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఆరెస్సెస్, హిందూ మహాసభలు క్రియాశీలంగా వ్యతిరేకించాయి. జాతీయోద్యమాన్నుండి దూరంగా ఉండమనీ, తమ నిజమైన శత్రువులు బ్రిటిష్ పాలకులు కాక కమ్యూనిస్టులూ, క్రిస్టియన్లూ, ముస్లింలూ అనీ ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తలు తమ అనుచరులకు పదే పదే హితబోధ చేసేవారు. దోపిడీతో పోరాడడానికి వర్గ ఐక్యతను నిర్మించడం పట్ల మన అవగాహనను ప్రచారం చెయ్యాలి. భారతదేశ బడా బూర్జువాకూ, సామ్రాజ్యవాదానికీ మధ్య ఉన్న అనుసంధానాన్నీ, ఈ అనుసంధానికి సంఘీయులు ఇచ్చే బలమైన మద్దతునూ పూర్తిగా ఎండగట్టాలి.

అన్ని రకాల ఛాందసవాదాలను మనం ధృఢంగా వ్యతిరేకించాలి. ఇటీవలి సంవత్సరాలలో ముస్లిం ఛాందసవాద సంస్థలు తమ బలాన్ని పెంచుకున్నాయి. జమాతే ఇస్లామీ అనేక సంస్థలనూ, రాజకీయ నిర్మాణాలనూ ఏర్పాటు చేసింది. మానవ హక్కుల కోసమూ, మతతత్వాన్ని వ్యతిరేకంగానూ పోరాడుతున్న ఉమ్మడి వేదికలలో చేరడానికి వారు ప్రయత్నిస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వారితో ఎటువంటి ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టకూడదు. విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రచారం చెయ్యడం మాత్రమే కాదు, మతతత్వ ప్రాతిపాదికన ప్రజలు చీలిపోవడానికి హిందుత్వ శక్తులు చేసే ప్రచారానికి వారు ఉపయోగపడతారు.

కుల, వర్గ, జెండర్ అణచివేత సమస్యలను జోడించి ఈ సమస్యల మీద పోరాటాలు నిర్మించే మన విధానాన్ని బలపరచాలి. ఈ పోరాటాలలోకి మరిన్ని సంస్థలను కూడగట్టాలి.

జాతీయ ఐక్యతను కాపాడడానికి లౌకికవాదాన్ని కాపాడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాలి. రాజీలేని విధంగా మైనారిటీల హక్కుల పరిరక్షణ మన బాధ్యత అని మనం అంగీకరించాలి.

హిందుత్వకు వ్యతిరేకంగా ముందుకు సాగాలి

హిందుత్వ శక్తులతో పోరాడేందుకు సిపియం 23వ కాంగ్రెసు తన రాజకీయ తీర్మానంలో ఈ క్రింది కర్తవ్యాలను నిర్దేశించింది :

“2.168. హిందుత్వ శక్తులను వేరు చెయ్యడానికి పార్టీని బలపరచడం ఒక మౌలికమైన ముందస్తు అవసరం. రాజకీయ, సైద్ధాంతిక, సాంస్కృతిక, సామాజిక రంగాలలో హిందుత్వానికీ, దాని బహుళ సంస్థలకూ వ్యతిరేకంగా పట్టువిడవని రీతిలో పోరాటాన్ని నిర్వహించాలి. హిందుత్వ మతోన్మాద ఎజెండాకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలపరచడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.

“2. 169 పార్టీ, దాని ప్రజా సంఘాలూ ఈ నిరంతర పోరాటాన్ని దిగువన పేర్కొన్న చర్యల ద్వారా నిర్వహించాలి:

i) పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రూపులు నిరంతరాయంగా సైద్ధాంతిక, రాజకీయ సమాచారాన్ని తయారు చేస్తుండాలి. హిందుత్వ, ఇతర మతోన్మాద శక్తులలోని అభివృద్ధి నిరోధక విషయాన్ని ఎండగడుతూ, ప్రజలలో విశాలమైన భాగాలకు చేరేలా ఇది జనరంజకమైన శైలిలో ఉండాలి.

ii) ద్వేషమూ, బెదిరింపులతో కూడిన విష ప్రచారాన్ని చేస్తూ సాగే ఫాసిస్టు దాడులను, ముఖ్యంగా మత మైనారిటీల మీద, చేసే హిందుత్వ గ్రూపుల దాడిని క్రియాశీలంగా ఎదుర్కోవాలి.

iii) హేతువాదం మీద ఆధారపడిన లౌకిక శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా పెరుగుతున్న మూఢనమ్మకాలనూ, హేతువిరుద్ధతనూ, గుడ్డి విశ్వాసాలనూ ఎదుర్కోవడానికి సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలనూ శాస్త్ర ప్రచారాన్నీ ప్రోత్సహించాలి. హిందుత్వ ముఠాలు చేసే హేతువిరుద్ధ, అహేతుకత ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఇది అవసరం.

iv) సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సమస్యలను చేపట్టాలి. ‘హిందుత్వ’ స్త్రీలకు సమాన హక్కులను నిరాకరిస్తుంది. జెండర్ అణచివేతను ధర్మసమ్మతమైనదిగా ప్రచారం చెయ్యడం ద్వారా స్త్రీల మీద క్రూరమైన
దాడులు చెయ్యడానికి అనువైన పరిస్థితులను సృష్టిస్తుంది.

v) విషపూరిత, గత కాలానికి చెందిన, హిందుత్వ కుల విలువలు దళితులలోనూ, ఆదివాసీలలోనూ విస్తరించడాన్ని అడ్డుకోవాలి.

vi) సామాజిక సేవా కార్యకలాపాలను ప్రోత్సహించాలి. కోవిడ్ వ్యాధి కాలంలో చేసిన పనిని ఆరోగ్య కేంద్రాల ద్వారా కొనసాగించాలి. లైబ్రరీలు, రీడింగ్ రూంలు, ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్లు, నైపుణ్యాన్ని పెంపొందించే సెంటర్లూ మొదలైనవి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి.

vii) విద్యా రంగంలో ఆరెస్సెస్, హిందుత్వ మత శక్తులు చాలా చురుకుగా పని చేస్తున్నాయి. శాస్త్రీయ స్వభావాన్ని ప్రోత్సహిస్తూ లౌకిక, ప్రజాస్వామ్య, ఏకీకరణ విషయాలను విద్యలో చేర్చి ప్రచారం చెయ్యడానికి విద్యారంగంలో మనం చొరవ తీసుకోవాలి.

“2.170 అటువంటి కార్యకలాపాలు లేనట్లయితే, ఆరెస్సెస్-బిజెపిలు, మతతత్వ సంస్థలు, సామాజిక, జాతి విభేదాలను అధిగమించి, ప్రబలంగా ఉన్న ‘హిందుత్వ అస్తిత్వాన్ని’ మరింత బలపరచడంలో విజయాన్ని సాధిస్తాయి. హేతువిరుద్ధతను హేతుబద్ధతతోనూ, కుతర్కాన్ని తర్కంతోనూ ఎదుర్కోవడం చాలా ముఖ్యం

** స్త్రీల సమస్యల గురించీ, జెండర్ గురించీ
పార్టీ దృక్కోణం.

జనతా ప్రజాస్వామ్యము, సోషలిజాల కోసం ప్రజా సమీకరణ, నిర్మాణాలకు సంబంధించి పార్టీ అవగాహనలో, వ్యూహంలో, ఎత్తుగడలలో స్త్రీల సమస్య కీలకమైనది.