– ఆహారం, గ్యాస్‌, పెట్రోల్‌, యూరియా వంటి వాటికి తగ్గిన కేటాయింపులు
– అంగన్‌వాడీలు, పంట బీమాకు కోత
– ఉపాధి హామీ, పీఎం కిసాన్‌కు పెంపు లేదు
– ‘మహిళా భద్రత’ కేటాయింపుల్లోనూ కోతే

న్యూ ఢల్లీ ;

కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతులకు సంబంధించిన సబ్సిడీలకు కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఆహారం, వంటగ్యాస్‌, పెట్రోలియం, యూరియా వంటి వాటికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్య, పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. పైగా ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో కోత విధించారు. ఆహార సబ్సిడీకి సంబంధించి 2022-23 బడ్జెట్‌లో రూ. 2,72,802 కోట్లు కేటాయించగా, 2023-24లో దాన్ని రూ.2,12,332 కోట్లకు, 2024-25లో రూ.2,05,250 కోట్లకు తగ్గించారు. ప్రజా పంపిణీకి 2023-24లో రూ 137.36 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.106.73 కోట్లకు తగ్గించారు. గ్యాస్‌ సబ్సిడీకి 2023-24లో రూ 12,240 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.11,925.01 కోట్లకు తగ్గించారు.

పెట్రోలియానికి సంబంధించి 2023-24లో రూ.12,240 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25లో రూ.11,925 కోట్లకు తగ్గించారు. రైతులకు సంబంధించిన ముఖ్యమైన ఎరువులకు 2022-23లో రూ.2,51,339 కోట్లు కేటాయించగా, 2023 -24లో రూ.1,88,894 కోట్లకు తగ్గించారు. దాన్ని 2024-25లో రూ.1,64,000 కోట్లకు తగ్గించారు. అందులోనూ యూరియాకి 2022-23 బడ్జెట్‌లో రూ.1,65,217 కోట్లు కేటాయించగా, 2023-24లో దాన్ని రూ.1,31,100 కోట్లకు తగ్గించారు. 2024-25లో రూ.1,00,340 కోట్లకే పరిమితం చేశారు. పంటల బీమా పథకానికి సంబంధించి 2023-24 బడ్జెట్‌లో రూ.15,000 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25 బడ్జెట్‌లో రూ. 14,600 కోట్లకు తగ్గించారు. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ హెచ్‌ఎం)కి కేటాయింపులే లేవు. స్మార్ట్‌ సిటీలకు 2023-24లో రూ 13,200 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,400 కోట్లకు తగ్గించారు. అంగన్‌వాడీలకు 2023-24లో రూ 21,523.13 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.21,200 కోట్లకు తగ్గించారు. మహిళా భద్రత పథకాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. 2023-24లో రూ.1,009 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.155 కోట్లకు తగ్గించారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి 2023-24 బడ్జెట్‌లో రూ.34,354 కోట్లు కేటాయించగా, దాన్ని సవరించిన అంచనాల్లో రూ.32,800 కోట్లకు తగ్గించారు. 2024-25లో రూ.31,107 కోట్లకు తగ్గించారు. అంటే రూ.3,247 కోట్లు తగ్గించారు. కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు భారీ కోత పడింది. 2023-24లో రూ 16,500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.15,500 కోట్లకు తగ్గించారు. ఎన్‌ఎల్సీ ఇండియా లిమిటెడ్‌కు 2023-24లో రూ 2,880 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,429 కోట్లకు తగ్గించారు. సాంస్కృతిక పథకాలకు 2023-24లో రూ 808.77 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.520.24 కోట్లకు తగ్గించారు. అకాడమీ, మ్యూజియంలకూ బడ్జెట్‌లో కోత విధించారు.

అకాడమీలకు సంబంధించి 2023-24లో రూ 435.45 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.389.37 కోట్లకు తగ్గించారు. మ్యూజియంలకు సంబంధించి 2023-24లో రూ 389.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.373.70 కోట్లకు తగ్గించారు. పీఎం కిసాన్‌, ఉపాధి హామీకి ఎటువంటి పెంపుదల లేదు. గతంలో కేటాయించిన వాటినే కాపీ, పేస్ట్‌ చేశారు.