- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పిలుపు

సంపద సృష్టిస్తున్న వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల చట్టం అమలు కోసం, సమగ్ర చట్టం కోసం అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ మూడవ వర్ధంతి స్ఫూర్తితో విస్తృతమైన పోరాటాలను కొనసాగిద్దామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ మూడవ వర్ధంతి సందర్భంగా “వ్యవసాయ కార్మికులు-కనీస వేతనాల చట్టం అమలు ” పై జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షత సదస్సు నిర్వహించగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా వెంకట్రాములు పాల్గొని వేముల మహేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను ప్రతి సంవత్సరం రివైజ్ చేసి, సవరణ చేసి అమలు చేయవలసిన బాధ్యత వారి పైన ఉన్నదని అన్నారు. కానీ సంవత్సరాల గడుస్తున్న కనీస వేతనాలను అమలు చేయడం లేదని వారు విమర్శించారు. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కనీస వేతనాలు చట్టాన్ని సవరణ చేయించి గ్రామాలలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రచారం చేయవలసిన అవసరం ఉందని వారు అన్నారు. ఇప్పటికే వ్యవసాయ కార్మికులకు సరైన పనిగంటలు లేక సరైన వేతనం లేక అర్థాకళితో జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వము ఇప్పటికైనా సమగ్ర చట్టం రూపొందించి అందులో వ్యవసాయ కూలీలకు 6 గంటల పని, రోజు కూలి 600 రూపాయలు, బీమా సౌకర్యం, విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమము లాంటివి చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేసినారు. కేంద్రంలోని బిజెపి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి దానిమీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తున్నదని, పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు అనేక ఉద్యమాలకు జీవితాంతము నాయకత్వం వహించి పోరాడిన మహా పోరాట యోధులు వ్యవసాయ కార్మికుల ఉద్యమ నాయకులు అమరజీవి వేముల మహేందర్ స్ఫూర్తితో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గార్లు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ వేముల మహేందర్ పేద కుటుంబంలో పుట్టి ఎర్రజెండా నాయకత్వంలో అనేక కూలీ, భూమి, సామాజిక ఉద్యమాలు నిర్వహించి పేదలకు అండగా నిలిచాడని వారి స్ఫూర్తితో వ్యవసాయ కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలలో పనిచేయాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు సిర్పంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలుపుల వివేకనంద, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపెళ్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య చింతకాయల నర్సింహ, ఎర్ర ఊషయ్య, బోయ యాదయ్య, పిట్టల శ్రీను, మానే సాలయ్య, రాపోతు పద్మ , ముత్యాలు, బాలరాజు ఇతరులు పాల్గొన్నారు.