ఇంజనీరింగ్ కౌన్సిలంగ్ కంటేముందే ఒక్కో సీటుకు రూ.12-25 లక్షలను వసూళ్లు చేస్తూ ప్రైవేటట్ కన్సల్టెన్సీల ద్వారా సీట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు:
బీ’ కేటగిరి సీట్లు అమ్ముకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ అధ్యాపకులు లింబాద్రి కి ఏఐవైఎఫ్ రాష్ట్ర బృందం వినతి
ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల అడ్డగోలు దందాను కట్టడి చేయాలని, ఇంజినీరింగ్ ఫలితాలు వచ్చి వారం రోజులు కాకముందే ‘బీ’ కేటగిరి సీట్లను అమ్ముకుంటున్న ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ఇంజనీరింగ్ విద్య పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా మోసగిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యాపకులు లింబాద్రి కి రాష్ట్ర బృందం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ కంటే ముందే ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందా జోరందుకుందని, ప్రైవేట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల మధ్యవర్తిత్వంతో సీట్ల రిజర్వేషన్ ప్రక్రియకు తెరలేచిందని వివిధ బ్రాంచ్ ల సీఎఎస్సీ, ఐటీ, ఈఈఈ కోర్సుల సీటుకు సగటున రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున అమ్ముకుంటున్నాయని వారు ఆరోపించారు. కన్వీనర్ కోటా కటాఫ్ కంటే అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సీట్ల టెన్షన్ పట్టుకుందని, ఇదే అంశం ఇంజనీరింగ్ కాలేజీలకు కాసులు కురిపిస్తోందన్నారు.ఉన్నత విద్యామండలి ఆదేశాలను, నిబంధనలను ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయని ,కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే పేరొందిన ప్రైవేట్ ఇంజీనిరంగ్ కాలేజీలు నిబంధనలు గాలికొదిలి సీట్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు. దీంతో కన్వీనర్ కోటా వర్తించని విద్యార్థుల తల్లి దండ్రులకు కన్సల్టెన్సీల ఫోన్లతాకిడి అధికమైందన్నారు. టాప్ టెన్ అంటూ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని గాలం వేస్తున్నాయన్నారు. ఏకంగా కాలేజీలకు తీసుకెళ్లి సీట్లు రిజర్వ్ చేయించడం బహిరంగ రహస్యంగా మారిందని ధ్వజమెత్తారు. సీటు రిజర్వేషన్ చేసుకొని మరో 20 రోజుల్లో మొదటి సంవత్సరం ఫీజు చెల్లిస్తే సీటు ఇస్తామని స్పష్టం చేస్తుండగా, ఇంకొన్ని కాలేజీలు మాత్రం మొత్తం ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తేనే సీటు, విడతలవారీగా చెల్లిస్తే ఆ డొనేషన్ పెరుగుతుందని తేల్చి చెప్తున్నారన్నారు.అందులో సైతం కేవలం నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ చెల్లింపులను నిరాకరిస్తూ విద్యను అంగడి వస్తువుగా మార్చిందని వాపోయారు. సీటు అంశం మాట్లాడేటప్పుడు మాత్రం యాజమా న్యాలు జాగ్రత్తపడుతున్నాయి. సదరు పేరెంట్స్ అడ్మిషన్ల కోసం కళాశాలలకు వస్తే మొబైల్ ఫోన్లను సెక్యూరిటీలో పెట్టి లోపలికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. బేర సారాలు ముగియగానే తక్షణమే రూ. 50 వేలు చెల్లించి రిజర్వేషన్ చేసుకునే విధంగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు ఈ విషయాలను తమకు తల్లిదండ్రులు చెప్పినట్లు వారు అన్నారు. ప్రైవేట్ ఇంజనీరంగ్ కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సుల సీట్లు పెంచుకున్నాయని, ఆ సీట్లకున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు చేయించాలని తల్లిదండ్రుల ఆశలు కాలేజీలకు కాసుల పంట పండిస్తోందన్నారు.
అదే విధంగా ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, బోధనా రుసుములతో సంబంధం లేకుండా అన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జేఎన్టీయూ పరిధిలోనే 149 కాలేజీలుండగా ప్రైవేట్ కాలేజీల్లో 70శాతం సీట్లు కన్వీనర్ కోటా ('ఎ' కేటగిరీ) ద్వారా.. మిగిలిన 30శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా ('బి' కేటగిరీ)లో ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాను భర్తీ చేయాలి.. కానీ కన్వీనర్ కోటా ప్రక్రియ కంటే ముందే.. మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్మకాలపై యాజమాన్యాలు దృష్టి సారించాయని విమర్శించారు. మేనేజ్మెంట్ల సీట్ల భర్తీలో 15శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ కోటా లో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని, ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలన్నారు. కానీ ఇవేవీ అమలులేకుండా ఇష్టానుసారం ప్రవేశాలకు తెరలేపిందన్నారు. ఉన్నత విద్యామండలి ఆదేశాలను పాటించని ఇంజనీరింగ్ కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టి, గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్… రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, మాజీద్,అనీల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.