న్యూఢిల్లీ: రష్యా నుంచి రాయితీ ధరతో చమురును కొనుగోలు చేసిన భారత రిఫైనరీలు కనీసం 10.5 బిలియన్‌ డాలర్ల ( సుమారు రూ. లక్ష కోట్లు)ను ఆదా చేశాయి. అటు రష్యా కూడా లాభపడింది. ఎలాగంటే ఒకప్పుడు మన దేశీయ చమురు వాణిజ్యంలో రష్యాకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు మన దేశానికి వాణిజ్య భాగస్వాములుగా ఉన్న ప్రముఖ దేశాల జాబితాలో రష్యా కూడా చేరిపోయింది. భారత్‌-రష్యా సంబంధాలలో చమురుకు పెద్దగా ప్రాధాన్యత లేదు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల జాబితాలో చమురుది అట్టడుగు స్థానమే. కానీ ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కావడంతో పరిస్థితి మారిపోయింది. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలలో చమురు అగ్ర స్థానానికి చేరుకుంది. అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత జనాభాకు తగినంత ఇంధనాన్ని అందించడంలో రష్యా ఇస్తున్న మద్దతును అక్కడ పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారత్‌-రష్యా మధ్య చమురు వాణిజ్యం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుండి రాయితీతో కూడిన ముడి చమురును కొనుగోలు చేయడం ద్వారా 2022 ఏప్రిల్‌-2024 మే మధ్య కాలంలో దేశీయ చమురు సంస్థలు 10.5 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక విశ్లేషించింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు ఆ దేశం నుండి చమురు దిగుమతులను తగ్గించాయి. దీంతో రష్యా ముడి చమురు అమ్మకాలపై రాయితీలు అందించడం మొదలు పెట్టింది. భారతీయ రిఫైనరీలు దీనిని ఉపయోగించుకొని లాభపడ్డాయి. అయితే దీనిపై పలు పాశ్చాత్య దేశాలు విమర్శలు కురిపిస్తున్నాయి. రష్యా నుండి చమురును కొనుగోలు చేయడం అంటే ఉక్రెయిన్‌పై దాడిని సమర్ధించడమే అవుతుందని తెలిపాయి. అయితే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముడి చమురు వినియోగదారుగా ఉన్నందున 85 శాతం దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదని భారత్‌ వాదించింది. ఇంధన భద్రతకు తాను ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసింది. ఇటీవల మాస్కోలో మోడీ చేసిన వ్యాఖ్యలు భారత దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ చమురు దిగుమతుల విలువ 139.86 బిలియన్‌ డాలర్లు. ఇతర సరఫరాదారుల నుండి కొనుగోలు చేసిన ముడి చమురు ధరనే రష్యాకు కూడా చెల్లిస్తే ఈ విలువ 145.29 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. భారత విదేశీ వాణిజ్యంలో 10.5 బిలియన్‌ డాలర్లు చెప్పుకోదగిన మొత్తం కానప్పటికీ ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు ఆదా చేసిన ఈ సొమ్ము గణనీయమైనదేనని చెప్పవచ్చు. పైగా రష్యా రాయితీ అందిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌ వంటి ఇతర చమురు సరఫరా దేశాలు కూడా రాయితీలు ఇవ్వజూపుతున్నాయి. ముడి చమురు కొనుగోళ్లలో చేస్తున్న ఆదా కారణంగా రిటైలర్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం లేదు. వెరసి ఈ వాణిజ్యం దేశ సామాన్యులపై పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ సిలిండర్ల భారం తగ్గిస్తే చాలునని ప్రజలు కోరుకుంటున్నారు.