– బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
– గరిష్టస్థాయికి నిరుద్యోగం
– భారత్‌లో తగ్గిన పెట్టుబడులు
– ఆర్థిక నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ: పదేండ్ల మోడీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకెళ్లిందని దేశంలోని కొందరు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మోడీనామిక్స్‌గా మారిందనీ, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. కొన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. అయితే, ఆర్థిక వ్యవస్థ నష్టానికి మాత్రం కరోనాను కారణంగా చూపుతూ పలు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పుకుంటూ వస్తున్నదని తెలిపారు. మోడీ పాలనలో భారత్‌లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నదని ఆర్థిక నిపుణులు, మేధావులు, విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ”భారత్‌లో యువతకు నాణ్యమైన ఉద్యోగాలు లేవు. మోడీ హయాంలో పదేండ్లలో గతంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం కనిపించింది. చాలా ప్రభుత్వ గణాంకాలు దీనినే వెల్లడిస్తున్నాయి. గుజరాత్, యూపీ, హర్యానా, రాజస్థాన్‌లకు చెందిన యువత ఇజ్రాయెల్, రష్యాలో ఆ దేశాలు చేస్తున్న ఘోరమైన యుద్ధాల నడుమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది” అని వారు తెలిపారు. 2014 ఎన్నికల ప్రచారంలో యూపీ, బీహార్‌లలో యువతనుద్దేశిస్తూ మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ”మీరు నాకు 10 సంవత్సరాలు సమయమివ్వండి. నేను మీ జీవితాలను మారుస్తాను” అని మోడీ అన్నారు. అయితే, భారత్ ఇప్పటికే పదేండ్ల మోడీ పాలనను చూసింది. అయినప్పటికీ, యువత జీవితాలు మారలేదని మేధావులు అంటున్నారు. ”భారత్‌లో ఉద్యోగాలు లేవు. దీంతో ఉద్యోగాల కోసం యువత విదేశాలకు వెళ్తున్నది. 1991లో సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి 45 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగిత స్థాయికి, అత్యల్ప సగటు జీడీపీ పెరుగుదల, తలసరి ఆదాయ వృద్ధికి భారత్ పడిపోయింది” అని చెప్తున్నారు.
మోడీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో పెట్టుబడుల్లో అత్యల్ప వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానమని మోడీ సర్కారు చెప్తున్నప్పటికీ.. దానిని పెట్టుబడిదారులెవరూ నమ్మకపోవటం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విశ్లేషకులు చెప్తున్నారు. ” వినియోగ డిమాండ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇది నేటికీ చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే, భారత జీడీపీ వృద్ధిలో దాదాపు 60 శాతం ప్రయివేటు వినియోగం. కొంతకాలం క్రితం ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత దశాబ్దంలో సగటు ప్రయివేట్ వినియోగ వృద్ధి వార్షికంగా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రయివేట్ పెట్టుబడులు ఎలా ఫలిస్తాయి?” అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా, 2017-18 నుంచి 2022-23 వరకు ఐదేండ్లలో భారతదేశంలో వేతన వృద్ధిలో స్తబ్ధత నెలకొన్నదని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే సూచిస్తున్నాయని అంటున్నారు. ఇన్‌కార్పొరేటెడ్ ఎంటర్‌ప్రైజెస్ విడుదల చేసిన వార్షిక సర్వే ప్రకారం..2011-12తో పోలిస్తే 2022-23లో యువత నిరుద్యోగం (15 నుంచి 29 ఏండ్ల మధ్యవారు) రెండింతలు పెరిగి 12 శాతానికి చేరుకున్నది. ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం వంటి విషయంలో మోడీ సర్కారు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.