ఎస్ఐ శంకర్ డీసీపీ కార్యాలయానికి అటాచ్
మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్ ఉప్పల్ :
నిందితుల వద్ద డబ్బులు వసూళ్లు చేశారనే అభియోగం లో ఎస్ఐ శంకర్ ను డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన ఉన్నతాధికారులు
విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాచకొండ పరిధి ఉప్పల్ ఠాణాలో ఎస్సైగా పని చేస్తున్న శంకర్‌పై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఈనెల 15న తెల్లవారుజామున ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌లోకి కారులో వచ్చిన ఓ ప్రేమజంటను గుర్తు తెలియని పోకిరీ గ్యాంగ్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. బాధితులు నేరుగా ఉప్పల్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఎస్సై శంకర్ స్థానికుల ద్వారా పోకిరీ గ్యాంగ్‌ను గుర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అమర్, ఉదయ్, రామ్‌చరణ్, శశివలి, మారుత్‌ను 19న పట్టుకొచ్చారు. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో వారిపై పెటీ కేసు పెట్టి వార్నింగ్ ఇచ్చి పంపించారు. పోకిరీలను గుర్తించే క్రమంలో ఎస్సై శంకర్ ఉప్పల్‌కు చెందిన సంతోష్‌రెడ్డి, శివ నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. దీంతో సంతోష్‌రెడ్డి, శివ కేసు విషయంలో రాజీ కుదురుస్తామంటూ ఎస్సై శంకర్ పేరుతో పోకిరీల నుంచి రూ.2.70 లక్షలు వసూలు చేశారని ఆరోపణ వచ్చింది. ఎస్సై శంకర్ బాధితుల పట్ల నిర్లక్ష్యంగానే కాకుండా పోకిరీలతో రాజీ కావాలని ప్రేమ జంటపై ఒత్తిడి చేయడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. పోకిరీల నుంచి వసూలు చేసిన దానిలో ఎస్సై శంకర్ ప్రమేయమెంత?అనే దానిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో పాటు ఎస్సై శంకర్‌ను డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లుగా సమాచారం.