పునరాగమనం లండన్ నుండి కలకత్తాకు

0
99

నాకు నాటక రంగం అంటే పడి చచ్చేంత ఇష్టం.

లండన్లోని ఎయిర్ ఇండియాలో చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టేసి 1970లో నా స్వస్థలం కలకత్తాకు తిరిగి వచ్చేశాను. లండన్లోనే గడిపిన మూడేళ్లు నా జీవితాన్ని మార్చేశాయి. నాకు నాటక రంగం అంటే పడి చచ్చేంత ఇష్టం. లండన్లో ఏదన్నా డ్రామా స్కూల్లో చేరాలనే కల. అప్పుడు నాకు పందొమ్మిదేళ్లు ఆడపిల్లలు ఉద్యోగం చేసుకుని ఆర్థికంగా స్వతంత్రంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలని గట్టిగా నమ్మినవాడు మా నాన్న. ‘ఏదన్నా ఉద్యోగం సంపాదించుకుని నీ డబ్బుతో నువ్వు నీ కిష్టమైన డ్రామా స్కూల్లో చేరాలి’ అని హితబోధ చేశాడు. నాన్న సాయంతో ముందు నేను ఎయిర్ ఇండియా వాళ్ల కలకత్తా ఆఫీసులో ఉద్యోగానికి కుదురుకున్నా. కొన్ని నెలలు అక్కడ పనిచేసి లండన్ ఆఫీసులో ఖాళీ ఉందని తెలిసి అక్కడ పని చేస్తానని అప్లికేషన్ పెట్టుకున్నా. 1967లో లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో నాకు పోస్టింగ్ ఇచ్చారు.

అట్టే రోజులు గడవక ముందే నాకూ మేనేజ్మెంట్ కి లడాయి పడింది. ఎయిర్ ఇండియా మహిళా సిబ్బందికి చీరకట్టు ప్రత్యేకత. కానీ విమానాశ్రయం డ్యూటీలు చేసే మహిళలు చీరకట్టు కోవడానికి వీల్లేదు. కచ్చితంగా స్కర్టు, షర్టు వేసుకోవాలనే తలతిక్క రూల్ ఒకటి ఉండింది. నేను అభ్యంతరం చెప్పా. ఎయిర్ ఇండియా విమానాల్లో పనిచేసే ఎయిర్ హెూస్టెస్లు భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుకోవాలనే నియమం ఉన్నప్పుడు. గ్రౌండ్ సిబ్బంది మాత్రం చీరకట్టుకోకూడదని నిర్బంధించడం ఏంటని వాదులాట పెట్టుకున్నా. కానీ నా మాట తీసిపారేసేవాళ్లు. ఎయిర్ ఇండియాలో పని చేస్తున్న ఇంగ్లీషు వాళ్లు ‘ఇదేం మేళంరా నాయనా. స్కర్టు, షర్టు ఫ్యాషన్ అయిన రోజుల్లో చీరో చీరో అని పెనుగులాడుతుంది.. అన్నట్లు వ్యవహరించేవాళ్లు నాతో. నేను కలకత్తాలో మాదిరే లండన్లో కూడా చీరకట్టుతోనే డ్యూటీకి వెళ్లేదాన్ని. అలన్ అని స్పానిష్ జాతీయుడు మా బాస్, విధి నియమాలకు విరుద్ధంగా పనిచేస్తున్నానని కారణం చూపి నన్ను ఉద్యోగంలో నుండి ఉడబీకెయొచ్చు. కానీ అలన్ కాస్త దయగల మనిషి ‘ఇదిగో మా దగ్గర ఒక తలతిక్క అమ్మాయి ఇలా చీరకట్టుకునే పని చేస్తానని హఠం చేస్తుంది. ఏం చేయ్యమంటారూ’ అంటూ ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం (బొంబాయి) వారికి ఒక లేఖ రాశాడు. ఎయిర్ ఇండియా లోగో ‘మహారాజా’ను రూపొందించిన బాబీ కూడా అప్పట్లో ఎయిర్ ఇండియా కమర్షియల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు.

అలన్ ఉత్తరానికి తిరుగుటపాలో ‘బృందానే కాదు మహిళా సిబ్బంది ఎవరైనా సరే చీరకట్టుతో పని చేస్తామని అడిగితే అభ్యంతరం పెట్టకండి. వాళ్లకి నచ్చినట్లు ఉండనివ్వండి’ అని బదులు పంపాడు. దాంతో అప్పటివరకూ నన్ను ఎగతాళి చేసిన వాళ్లు కూడా ‘నాక్కూడా చీరకట్టుకోవడం నేర్పవా’ ‘నాక్కూడా’ అంటూ నా వెంటపడినప్పుడు నే సాధించిన విజయానికి గాల్లో తేలిపోయా. నచ్చిన డ్రామా స్కూల్లో సాయంకాలం క్లాసులకు హాజరయ్యేదానికి అప్లికేషన్ పెట్టుకున్నా. సీటు ఇచ్చారు. కానీ విమానాశ్రయంలో నాది షిఫ్ట్ డ్యూటీలు కావడంతో క్లాసులకు సరిగ్గా హాజరవ్వలేకపోయా. ఈ లోగా హిత్రూ విమానాశ్రయం నుండి నన్ను లండన్ బాండ్ స్ట్రీట్లో ఉండే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. 1968 మార్చి నెల నడిమి రోజులు అవి. నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి.

స్కూల్లో నా స్నేహితురాలు మాలాసేన్తో మరలా స్నేహం కుదిరింది. పూలన్దేవి జీవితగాధను ‘బాండిట్ క్వీన్’ (బందిపోటురాణి) పేరిట గ్రంథస్థం చేసింది తనే. మాలాసేన్ తన జీవిత భాగస్వామి ఫారూఖ్ ధోండితో కలిసి నేను ఉన్న వీధిలోనే కాస్త దిగువన కాపురం ఉంటుంది. ఫారూఖ్ చాలా తెలివైనవాడు. గొప్ప మాటకారి. మహాచురుకైనవాడు. వీటన్నిటికీ మించి వామపక్ష రాజకీయ కార్యకర్త కూడా. వాళ్ల చిన్న ఇల్లు ఎప్పుడూ వచ్చేపోయే వాళ్లతో కళకళలాడుతూ ఉండేది. అంతా కుర్రకారే. వాడివేడి రాజకీయ చర్చలు సాగుతుండేవి. ఆ గుంపులో నేనూ, మాలా మాత్రమే ఉద్యోగస్తులం. మిగిలినవాళ్లు కాలేజి విద్యార్థులు, ఆఫీసు పని ముగియడం ఆలస్యం నేను మాలా వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. అందరం కలిసి ఇరుకు మెట్లెక్కి మరీ దాబా పైకి చేరుకునే వాళ్లం. కప్పు మీద కప్పు టీలు తాగుతూ, సిగరెట్లు తాగేవాళ్లు సిగరెట్లు తాగుతూ, చవగ్గా దొరికే రెడ్వైన్ చప్పరిస్తూ యువకాశల నవపేశల ఆడామగా అందరూ కలిసి ఈ ప్రపంచం ఎటుపోతోంది అని చర్చించుకుంటూ గడిపేసేవాళ్లం. వామపక్ష రాజకీయాలతో అలా నా తొలి పరిచయం మొదలయ్యింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో, యూరప్ దేశాల్లోని కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థుల మధ్య జరుగుతున్న సామాజిక మథనం లండన్లో 60వ దశాబ్దం చివర్లో మొదలయ్యింది. సమాజంలో నెలకొన్న యథాతథస్థితి మీద విద్యార్థుల్లో తిరుగుబాటు భావాలు వెల్లువెత్తాయి. ‘ప్రతిదాన్నీ ప్రశ్నించు’ అనేది ఆనాటి నినాదం, అనార్కిస్టులు, ట్రాట్రీయిస్టులు, మార్క్సిస్టులు, బ్లాక్పవర్ గ్రూపులు, హిప్పీకల్చర్, కవిత్వం, పాటల రూపంలో భిన్న భావజాలాలు మార్పుకోసం, విప్లవం కోసం నినదిస్తున్న రోజులు అవి. అధికార పీఠాలు కదిలిపోయాయి. 60వ దశాబ్దంలో లండన్లో యువతరం గొప్ప భావోద్వేగంతో ఊగిపోయిన రోజులవి.

వియత్నాం వంటి అతి చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యవాద దేశంతో తలపడి జాతీయ విముక్తికై సాగిస్తున్న పోరాటం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఉద్యోగానికి శలవు పెట్టి మరీ.. వియత్నాం మీద అమెరికా సాగిస్తున్న సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం మొదలుపెట్టా. 1968 మార్చి నెలలో ఓసారి, తిరిగి అక్టోబర్ నెలలో మరొకసారి గ్రాస్వీనార్ స్క్వేర్లో జరిగిన మహా నిరసన ప్రదర్శనల్లో మాలా, ఫారూఖ్ తో కలిసి పాల్గొన్నా. ఆ నిరసన ప్రదర్శనల మీద పోలీసు అశ్వికదళం లాఠీలతో విరుచుకుపడింది. వియత్నాం యుద్ధం కలిగించిన ప్రేరణతో నా మార్క్సిస్టు అధ్యయనం మొదలయ్యింది. మార్క్సిస్టు సాహిత్యం చదవడం మొదలుపెట్టాక భారతదేశంలో, నా స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోగలిగా.

ఆ కాలంలో లండన్లో చదువుకుంటున్న విద్యార్థులు అనేక మంది నగ్జలైట్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ చదువుతున్న భారతీయ విద్యార్థి కార్యకర్తలకు సునీత్ చోప్రా నాయకుడిగా ఉన్నాడు. నేను కలకత్తాలో చదువుకుంటున్న రోజుల నుండి కుటుంబపరమైన స్నేహితుడుగా ఉన్న అతను తనని తాను మార్క్సిస్టుగా చెప్పుకునేవాడు. సునీత్ చోప్రా సోదరి, మా పెద్దక్క జూనీ స్నేహితులు, మరో చెల్లి మధూ, నేనూ కాలేజీలో రూమ్మేట్స్ మి. జిగ్రీదోస్తులం. నేను సునీత్ను కలిసినపుడు ఎడ్మండ్ విల్సన్ రాసిన ‘టు ద ఫిన్లాండ్ స్టేషన్’ పుస్తకం చదవమని ఇచ్చాడు. ఆ పుస్తకం అభ్యుదయ సోషలిస్టు ఉద్యమాల చారిత్రక క్రమాన్ని లోతుగా వివరిస్తుంది. సునీత్ చోప్రాని సన్నీ అని పిల్చేవాళ్లం. ఆ రోజుల్లో అతను నగ్జలైట్ ఉద్యమం వైపు కొట్టుకుపోయాడు. ఒకరోజు తను ఒక యువ బెంగాలీ విద్యార్థిని నా రూమ్కి తీసుకువచ్చాడు. ‘ఇతను ఎవరనుకున్నావ్, నగ్జలైట్, అరెస్టు కాకుండా తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు. నగ్జలైట్ ఉద్యమంలో ఎందుకు చేరాలో తను చెబుతాడు విను’ అన్నాడు. కానీ అప్పటికే నేను మార్క్సిస్టు పార్టీ వైపు మొగ్గి ఆ పార్టీ విధానాల గురించి మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలని నిర్ణయించుకుని ఉన్నా. సన్నీతో ఆ మాటే చెప్పా. దాంతో అతను నిరాశపడ్డాడు. ‘చూడు బిన్నీ (నా ముద్దుపేరు) నువ్విలా చేస్తావనుకోలేదు. రేపు మనం ఇండియా వెళ్లాక మనిద్దరం బారికేడ్కు చెరోవైపున నిలబడాల్సి వస్తుందని నే ఊహించలేదు’ అన్నాడు. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత నేను ఢిల్లీలోని మార్క్సిస్ట్ పార్టీ ఆఫీసుకు వెళ్లినప్పుడు అక్కడ సునీత్ చోప్రా ఉండడం చూసి చాలా సంతోషపడ్డాను. ‘మార్క్సిజాన్ని విశ్వసించి, దాన్ని భారతదేశ పరిస్థితులకు అన్వయించి పని చెయ్యాలి అనుకునే ఎవరికైనా ఈ పార్టీనే సరైన వేదిక. భారతదేశంలో విప్లవసాధనకు కృషి చెయ్యడంలో మార్క్సిస్ట్ పార్టీని మించింది లేదు’ అన్నాడు నాతో, నేను తనని ఆటపట్టించడానికే అన్నట్లు ‘బతికించావ్ నాయనా, లేకుంటే బారికేడ్కి చెరో పక్కనా నిలబడి ఒకరినొకరం తిట్టుకుంటూ గడపాల్సి వస్తుందేమో అని భయపడుతూ ‘ఇండియాలో కాలుపెట్టా’ అన్నా నవ్వేస్తూ, సునీత్ చోప్రా సోదరిలు మధు, నైనా ఇద్దరూ వామపక్ష ఉద్యమంలోకి వచ్చారు. ఇద్దరూ మార్క్సిస్ట్ పార్టీలో పనిచేశారు. నైనా రావ్ గురించి తర్వాతి అధ్యయాల్లో వివరంగా చెబుతా. ఈ నైనానే ఆ నైనారావ్. సునీత్ చోప్రా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామీణ పేదలలో పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశాడు. పార్టీ కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగాడు. 2023 ఏప్రిల్ నెలలో గుండె పోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. లండన్లోనే గడిపిన కాలంలో నా స్నేహితులు మాలా, సునీత్, మధు, నైనా వీళ్లంతా మెరుగైన ప్రపంచం కోసం, సమసమాజ స్థాపన కోసం, సోషలిజం సాధన కోసం ఉద్యమ కృషిలో భాగస్వాములయ్యారు.

నేను మార్క్సిస్టు పార్టీ విధానాల గురించి, అలాగే ఆ పార్టీకి చెందిన AK గోపాలన్, BT రణదివే, EMS నంబూద్రిపాద్, జ్యోతిబసు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అసాధారణమైన నాయకులు, మార్క్పిస్ట్ మేధావుల గురించి విస్తృతంగా తెలుసుకోవడానికి ఆ పార్టీ వెలువరించే సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేశా. అయితే బెంగాల్ పరిణామాలు నన్ను మార్క్సిస్ట్పార్టీకి చేరువచేశాయి. లండన్లో మా ఆఫీసుకు ‘స్టేట్మన్’ సహా అన్ని భారతీయ వార్తాపత్రికలు వస్తుండేవి, కాకపోతే ఒక రోజు ఆలస్యంగా. 60వ దశకం చివరి పాదంలో బెంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఉద్యమాలకు సంబంధించిన వార్తలను ప్రత్యేక ఆసక్తితో చదివేదాన్ని. వాస్తవానికి ఈ పత్రికలు అన్నీ కమ్యూనిస్ట్ వ్యతిరేక స్వభావం కలవే, అయినా బెంగాల్లో ప్రజా ఉద్యమాల విస్తృతిని తక్కువ చేసి చూపించలేని స్థితిని ఎదుర్కొన్నాయి. చట్ట సభల లోపల, చట్ట సభల వెలుపల జ్యోతిబసు నాయకత్వంలో జరుగుతున్న పోరాటాల గురించి క్షుణ్ణంగా చదివేదాన్ని జ్యోతిబసు ధైర్యం. ఆయన ఉపన్యాసాలు, నిత్యం రైతులు, కార్మికుల పోరాటాల పక్షాన నిలబడడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. బెంగాల్లో తిండికోసం, భూమికోసం, కూలికోసం, జీతం కోసం జరిగిన పోరాటాలన్నింటి మీదా నాటి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దమనకాండకు పాల్పడింది. 1968-69 మధ్యకాలంలో నాలో అంతఃసంఘర్షణ పెరిగిపోయింది. నా ఆలోచనలు, నా ఆశలు, నా ఆకాంక్షలు తీవ్ర మథనానికి లోనయ్యాయి. ఉద్యోగం నా పాలిట బందిఖానాగా మారింది అన్న భావన నాలో నానాటికీ పెరిగిపోతూ వచ్చింది.. వెనక్కి తిరిగి నా దేశానికి, నా రాష్ట్రానికి వెళ్లిపోవాలని మార్క్పిస్ట్ పార్టీలో చేరాలని ఉవ్విళ్ళూరి పోయా.

1969 హేమంతకాలంలో నా ఆప్తమిత్రురాలు సుభాషిణీ సెహగల్ అమెరికాలో విద్యాభ్యాసం ముగించుకుని ఇండియాకు తిరుగు ప్రయాణం అయి మార్గ మధ్యంలో మా ఆఫీసులోనే నన్ను కలిసింది. ఇద్దరం సమ వయస్కులమే. ఇద్దరికీ ఇరవై రెండేళ్లే. మేం ఇద్దరం కలుసుకోవడంతోనే నేను చాలా ఉద్వేగంగా ‘నీకో ముఖ్య విషయం చెప్పాలి’ అన్నా. తను ‘నేను కూడా’ అంది. ఇద్దరిలో ఎవరు ముందు అన్నామో గుర్తు లేదుగానీ ‘నేను కమ్యూనిస్టు అవ్వాలని నిర్ణయించుకున్నా’ అని ఒకరికొకరం చెప్పుకున్నాం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాం. సుభాషిణీ ఇండియాకు తిరిగివెళ్లి పార్టీలో చేరిపోయింది. దశాబ్దాలుగా మా ఇద్దరి స్నేహం. కామ్రేడ్లీ భావన అలానే కొనసాగుతూ వస్తోంది.

అయితే నేను ఉద్యోగం మానేసి పార్టీలో చేరాలనుకుంటున్న వార్త మా నాన్న చెవిన వెయ్యాల్సి ఉందింకా. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదని నాకు తెలుసు,

  • కుటుంబ బంధాలు

మా నాన్న సూరజ్ లాల్దాస్ లాహెూర్లోని ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో ఒకడుగా జన్మించాడు. వాళ్ల నాన్న సుఖదయాళ్ దాస్ లాహెర్ పోస్టల్ సర్వీస్లో చాలా కీలక పోస్టులో పనిచేసిన తొలి భారతీయుడు అని మా వంశస్తులు చెబుతుంటారు. మా తాత సుఖదయాళ్ కులాలకు వ్యతిరేకి. అందుకే తన పేరులో కులాల్ని సూచించే పదాల్ని వదిలేశాడు. సామాజికంగా అభ్యుదయ భావాలు కలవాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. వితంతు పునర్వివాహాలు జరిపించాడు. ఆయన నలుగురు కూతుళ్లు అంటే నా నలుగురు మేనత్తలూ డిగ్రీ వరకు చదువుకున్నారు. పెద్దావిడ. తొలి తరం వైద్యురాలు.

మా నానమ్మ కరమ్ కౌర్ సిక్కు కుటుంబంలో జన్మించింది. మహా మృదుస్వభావి. ప్రేమాస్పదురాలు, చల్లనితల్లి, ఎనిమిది మంది సంతానాన్ని ప్రేమగా సాకింది. మూడో తరగతితో చదువు ఆపేసింది. పంజాబీ తప్ప వేరే భాషలో మాట్లాడ్డం రాదు. లాహోర్ లోని ఒక పెద్ద ప్రభుత్వ బంగ్లాలో కాపురం. డబ్బూదర్పం లేవు కానీ ఇరుగు పొరుగుతో కలివిడిగా బతికింది ఆ కుటుంబం. ఆస్తిపాస్తులు ఏమీ లేవు కాబట్టి పిల్లలకు సంక్రమించిన ఆస్తులేవీలేవు. ఒక రకంగా చెప్పాలంటే మా నాన్న ఆయన తోబుట్టువులు అందరూ స్వయంకృషితో పైకొచ్చినవాళ్లే. నాన్న లాహోర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 1930లలో కలకత్తాకు వలస వచ్చేశాడు. పోర్ట్ కమీషనర్ దగ్గర ఉద్యోగం సంపాదించుకున్నాడు.

దేశ విభజన కాలం నాటి అత్యంత విపత్కర, విషాద పరిస్థితుల్లో మా తాతగారు నలుగురు కూతుళ్ళ సహా లాహోూర్ విడిచిపెట్టి కట్టుబట్టలతో అనామకంగా ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. మా నాన్న చాలా ఏళ్ల తర్వాత ఒక ప్రైవేటు కంపెనీలో ఉన్నతాధికారిగా చేరి చివరికి ఆ బ్రిటీష్ కంపెనీకి చైర్మన్ అయ్యాడు. ఆయన కార్పొరేట్ ప్రపంచంలో ఒకడిగా చేరిపోయినా గొప్ప మానవీయ విలువలను అనుసరించాడు. దానికి కారణం ఆయన పెంపకమే. అప్పట్లో బ్రిటీష్ కంపెనీల్లో పనిచేసే
ఉన్నతాధికారులను కులీనులుగా, బ్రిటీష్ తాబేదార్లుగా భావించి కలకత్తా భాషలో అలాంటి వాళ్లని ‘బాక్స్ వాలా’ అని దెప్పిపొడిచేవాళ్లు. మా నాన్న ఇందుకు మినహాయింపుగా ఉండడానికి కారణం ఆయన కుటుంబ నేపథ్యమే. మేం కూడా మతకట్టుబాట్లు లేని ఉదార భావజాల వాతావరణంలో పెరిగాం. సంప్రదాయంగా ఆడవాళ్ల మీద పడే కట్టుబాట్లు ఏమీ లేకుండా పెరిగి, పెద్దయ్యాం.

మా అమ్మ పేరు ‘అశ్రుకవ్నా’, అంటే కన్నీటి బొట్టు అని అర్ధం. మా అమ్మ పుట్టుక మునుపు ఆమె తల్లిదండ్రులకు ఒక బిడ్డపుట్టి చనిపోవడంతో మా అమ్మకి అట్లాంటి కీడు వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారట. ‘కవన్’ అని ముద్దుగా పిలిచేవాళ్లు మా అమ్మని అందరూ. పేరులో కన్నీటి బొట్టు ఉందన్నమాటే గానీ మా అమ్మ చాలా గడసరి, తిరుగుబాటు ధోరణులు మెండుగా ఉండేవి. చాలా తెలివైనది, ఎప్పుడూ ముఖాన చిరునవ్వుతో సంతోషంగా గడిపేది. జీవితాన్ని నిండారా ప్రేమించిన మనిషి,

నాకు ఐదేళ్ల వయసప్పుడు 1952లో మా అమ్మ కారు ప్రమాదంలో మరణించింది. ఆ విషాదం మమ్మల్ని చాలా కాలం వెంటాడింది. అమ్మ పుట్టింటి, అత్తింటి తరపు రెండూ ఆదర్శప్రాయమైన బెంగాలీ కుటుంబాలు. అమ్మ వాళ అమ్మ. పేరు మృణాళిని. గొప్ప సంస్కారవంతురాలు. బ్రిటీష్ వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన హేమచంద్రమాలిక్ కూతురు. హేమచంద్రమాలిక్ అతని మేనల్లుడు సుబోధ్ మాలిక్ లు ఇద్దరూ అరబిందో ఘోష్ స్థాపించిన మిలిటెంట్ గ్రూపు ‘అనుశీలన్ సమితి’ రహస్య మద్దతుదారులు. అమ్మ బాల్యం అంతా మాలిక్ ఉమ్మడి కుటుంబంలో గడిచింది. వలస వ్యతిరేక భావజాలం. మేధోపరమైన వాతావరణంతో కూడిన కుటుంబ నేపథ్యం ప్రభావం అమ్మ మీద పడింది. వయసులో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోసు గట్టి అభిమానిగా ఉండేదాన్నని అమ్మ నాతో చెప్పింది. అమ్మ కూడా చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది.

అమ్మ వాళ్ల ముత్తాత రామ్చరణ్ మిత్రాకు పదిమంది సంతానం. నలుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలు. కలకత్తా కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశాడు. రిటైరయ్యాక పెద్ద పెద్ద జమిందారీ కుటుంబాలకు న్యాయ సలహాదారుగా పని చేశాడు. ఆస్తులు బాగానే కూడబెట్టాడు. ఏడుగురు కొడుకులకు పక్కపక్కన ఉండేలా ఏడు ఇళ్లు కట్టించి ఇచ్చాడు. ఆ క్రమంలో మా తాతగారైన ఫణీంద్రనాథ్ మిత్రాకు కలకత్తాకు ఉత్తర దిశలో ఉన్న జామాపుకార్లో సొంత ఇల్లు అమరింది. అమ్మా వాళ్ల పుట్టింటి వాళ్లతో పోలిస్తే మెట్టినింటి వాళ్లు సంప్రదాయాలు ఛాందసాలు ఎక్కువగా పట్టించుకునేవారు.

మా తాతగారు ‘భద్రలోక్’ కుటుంబానికి చెందినవారు కావడంతో అమ్మకి పెళ్లిచూపుల తంతు అప్పుడు జామాపుకార్లోని దేవిడీ లాంటి ఇంట్లో ఆ తతంగం నడిచింది. ఒకసారి పెళ్లిచూపులకని బయల్దేరిన అతను పోయిపోయి పంజాబీ అయిన మా నాన్నను తోడు తీసుకువెళ్లాడట. బహుశా మా నాన్నని తోడుకు తీసుకువెళ్లి ఎంత తప్పు చేశానో కదా అని ఆ అమాయకుడు జీవితాంతం కుమిలిపోయి ఉంటాడు. పెళ్లిచూపుల్లో అమ్మని చూసి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా అనేసుకున్నాడట. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ తొలిచూపులో ప్రేమలో పడడం అంటారుకదా అలా అన్నమాట. బెంగాలీ అమ్మాయి అయిన మా అమ్మ పంజాబీ అయిన మా నాన్న అలా ప్రేమలో పడిపోయారు. ఇద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. చివరికి ఒకరోజు ఇద్దరం పెళ్లిచేసుకోబోతున్నాం అని ప్రకటించేశారు. కానీ మా తాతగారు ఈ పెళ్లికి అస్సలు ఇష్టపడలేదు. ఈ విషయం ఆయన డైరీలో రాసుకున్నారు. ‘కన్నా’ ఒక పంజాబీ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందంటూ తన అయిష్టతను డైరీలో రాసుకోవడమే కాదు, అమ్మ పెళ్లికి ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళు ఎవరూ హాజరుకాకుండా కట్టడి చేశారు. కానీ వరసకు అక్క అయిన ఒక్కరు మాత్రం తెగించి అమ్మ పెళ్లికి హాజరయ్యింది. పెళ్లి ఏర్పాట్లన్నీ నాన్న కుటుంబం తరపు వాళ్ళే తలకెత్తుకున్నారు. అమ్మా, నాన్నల పెళ్లి చారిత్రాత్మకమైన 12, వెల్లింగ్టన్ బిల్డింగ్లో జరిగింది. 1905లో బెంగాల్ను విభజించాలన్న బ్రిటీష్ వలస పాలకుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బిల్డింగ్లోనే ఉద్యమ రూపకల్పన జరిగింది. అమ్మానాన్నలు పెళ్లి చేసుకునే నాటికి ఆ బిల్డింగ్కి ఉన్న చారిత్రక ప్రాధాన్యత వాళ్లకి తెలుసా లేదా అనేది ఇప్పటికీ నాకు అనుమానమే. ఇది మాలిక్ కుటుంబ స్వంత భవనం. తదనంతర కాలంలో వాళ్లు ఈ భవంతిని కలకత్తా యూనివర్శిటీకి దానం చేశారు. మనవరాలు పుట్టాక మా ముత్తాత బెట్టుసడలింది. మనవరాలిని చూసుకునే వంకతో అమ్మావాళ్ల ఇంటికి రాకపోకలు సాగించాడు. వారం వారం ఆయన అమ్మావాళ్ల ఇంటికి వచ్చేప్పుడల్లా పెద్ద బాక్సునిండా స్వీట్లు తీసుకువచ్చేవారు.

అమ్మా, నాన్నల పెళ్లి 1939లో జరిగింది. అప్పట్లో కులాంతర, మతాంతర వివాహాలు ఊహకైనా అందని విషయాలు. నాటి సమాజం కన్నా రెండడుగులు ముందున్న అలాంటి కుటుంబంలో మేం పుట్టి పెరిగాం. అమ్మ చనిపోవడంతో మాకు నమ్మకమైన భరోసా కరువయ్యింది. ఆ మరణం సాంస్కృతికంగా మా మీద ప్రభావం చూపించింది. మాకు బెంగాలీ, పంజాబీ భాషలు పెద్దగా అబ్బలేదు. ఇంక హిందీ భాష ఊసెత్తే పనే లేదు. ఇంట్లో ఇంగ్లీషులో మాట్లాడుకునేవాళ్లం. కలకత్తాలో ఉన్నవాళ్లూ మాకు తోడుగా ఉండడానికి మా మేనత్తలు వంతుల వారీగా వచ్చి వెళుతుండేవాళ్లు. మమ్మల్ని వాళ్ల స్వంత బిడ్డల్లా సాకారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్లు కూడా తరుచుగా మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవాళ్లు.

అప్పట్లో మా మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక ఆయా ఉండేది. పేరు హమ్ రామ్ భక్షి, మా తిండీ తిప్పలే కాకుండా కట్టూబట్టా, చదువులు అన్నీ తనే చూసుకునేది. బాల్యంలో మాకు ఒక నిట్టాడిలా అండగా నిలిచింది. జన్మతః ముస్లిం అయినా ఆ తరువాత క్రైస్తవ మతం పుచ్చుకుంది. మా అన్నయ్య కోకో అప్ప చెల్లెళ్లు జూనీ, రాధిక – మా నలుగురినీ ఆమె చాలా క్రమశిక్షణతో పెంచింది. అమ్మలేని లోటు తెలియకుండా మా నలుగురు మధ్యనా గాఢమైన అనుబంధాలు ఏర్పడడానికి కూడా హమ్ రామ్ భక్షి ఒక కారణం.

కమ్యూనిస్టు పార్టీలో చేరాలనుకుంటున్నా అంటూ నే రాసిన ఉత్తరం చదివి నాన్న చాలా ఆందోళన పడిపోయాడు. తిన్నగా లండన్ వచ్చేశాడు. ఉద్యోగం చేస్తూ ఉద్యమాల్లో, ఊరేగింపుల్లో కలువు, అభ్యంతరం లేదు కానీ ఉద్యోగం వదిలేసి పార్టీ అంటూ ఉద్యమాలంటూ తిరగడం ఆయనకు ఇష్టం లేదు. నాకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ నా నిర్ణయాన్ని స్పష్టంగా ఆయనకి చెప్పేశా. ఇంట్లో వాళ్లతో నచ్చ చెప్పించడానికి చూశాడు ఆయన. అన్నయ్య తటస్థంగా ఉండిపోయాడు కానీ నా అక్కాచెల్లెళ్లు నా నిర్ణయాన్ని స్వాగతించారు. నాకు మద్దతుగా నిలిచారు. దాంతో నేను 1970 తొలినాళ్లలో కలకత్తాలో కాలు మోపా..

  • పార్టీలో చేరిక

పార్టీతో కాంటాక్ట్ లోకి వెళ్లడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మార్క్సిస్ట్ పార్టీ మీద రాజకీయంగా, సైద్ధాంతికంగా, భౌతికంగా ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యకర్తలను హత్యచేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఉన్నతవర్గానికి చెందిన, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నాలాంటి అమ్మాయి పార్టీలో చేరతానని వెళ్లే సరికి పార్టీ వర్గాలు వింతగా భావించాయి. బూర్జువా పార్టీల్లో చేరడానికి కుటుంబ సంబంధాలు రాజమార్గంగా ఉపయోగపడతాయి. కానీ నాకు అందుకు విరుద్ధమైన అనుభవం ఎదురయ్యింది. నా వర్గ నేపథ్యం CPIM లో చేరడానికి అననుకూలంగా మారింది.