తెలంగాణ హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు సీఎం రేవంత్‌రెడ్డి

0
97

శంషాబాద్ లో ఆరోగ్య హబ్

అన్ని రోగాలకు అక్కడ వైద్య సేవలు

విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానెల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి

హెల్త్ టూరిజం హబ్బులో బసవతారకం ఆసుపత్రికి స్థలం సీఎం రేవంత్ రెడ్డి హామీ

మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్ హైదరాబాద్‌:

తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోని అన్ని జబ్బులకు సంబంధించి ఒక్కచోటే వైద్యం అందేలా తెలంగాణ హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ 500-1000 ఎకరాలు సేకరించి ప్రపంచంలో పేరుగాంచిన వైద్య సంస్థలన్నీ అందులో నెలకొల్పేలా చూస్తామన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఉందని సీఎం పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన సంస్థ 24వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ… ‘‘ఎన్టీఆర్‌ ఆలోచనతో చంద్రబాబు సహకారంతో 24 వసంతాలు పూర్తి చేసుకొని… లక్షల మందికి సేవలందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకమ్మకి క్యాన్సర్‌ రావడం, ఆమెను కోల్పోవడంతో ఆ దుఃఖం, బాధ ఇంకెవరికీ కలగొద్దనే ఉద్దేశంతో 1988-89లో ఈ సంస్థకు పునాది వేశారు. తర్వాత వివిధ రకాల ఆటంకాలు ఎదురైనా… 2000లో చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక… నాటి ప్రధాని వాజ్‌పేయిని పిలిపించి, ఆయన చేతుల మీదుగా సంస్థను ప్రారంభింపజేశారు.
నాడు ఎన్టీఆర్‌ కన్న కల… నెరవేరింది. ఆయన ఏ లోకంలో ఉన్నా మనందరినీ కచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఈ సంస్థకు సంబంధించిన లీజు, భవనాల అనుమతుల విషయమై ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే క్యాబినెట్‌లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేమంతా వేర్వేరుగా ఉన్నా… ఈ హోదా, గౌరవం ఎన్టీఆర్‌ ఇచ్చిన అవకాశాలతోనే సాధ్యమయ్యాయి. ఆయన సూచించిన మార్గంలో పేదలకు సేవ చేయాలనే ఆలోచనను అందిపుచ్చుకున్న మేం ఇలాంటి సంస్థకు భవిష్యత్తులోనూ అండగా నిలబడతాం’’ అని భరోసా ఇచ్చారు.