– ఒక్కసారి బారీకేడ్లు ఎత్తేస్తే..
– డిమాండ్లను సాధించేవరకూ ఆందోళన
– ఎస్కేఎం నేత, రైతు నాయకుడు : జగ్‌జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ వెల్లడి

చండీగఢ్‌: అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారి కేడ్లను ఎత్తివేస్తే రైతులు ఢిల్లీ వైపు తమ మార్చ్‌ను కొనసాగి స్తారని రైతు నేత, సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీ యేతర) నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ అన్నారు. సాగు చట్టాల రద్దు అనంతరం మోడీ సర్కారు హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ), ఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళ నలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిని ఢిల్లీలోకి ప్రవేశించ కుండా భద్రతా దళాలు, హర్యానా ప్రభుత్వం రహదారిపై బారీ కేడ్లను ఏర్పాటు చేసి నిరోధిస్తున్నది. రహదారి ఎప్పుడు తెరి చినా, మేము ఢిల్లీ వైపు కవాతు చేస్తామని దల్లెవాల్‌ అన్నారు.

ఫిబ్రవరిలోనే మార్చ్‌కు ప్రణాళిక.. అడ్డుకున్న హర్యానా ప్రభుత్వం
పంటలకు ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీతో సహా వివిధ డిమాండ్‌లకు మద్దతుగా ఢిల్లీ వైపు వెళ్లాలని ఫిబ్రవరిలో ఎస్కేఎం, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(కేఎంఎం)లు తమ ప్రణాళికను ప్రకటించాయి. అయినప్పటికీ, వారి ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ఫిబ్రవరి 13న పంజాబ్‌, హర్యానా మధ్య శంభు-ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద భద్రతా దళాలు, హర్యానా ప్రభుత్వం బారీకేడ్లు, సిమెంటు దిమ్మలు ఏర్పాటు చేసి అడ్డు కున్నాయి. అప్పటి నుంచి చాలా మంది రైతులు సరిహద్దు పాయింట్ల వద్దే ఉంటున్నారు. కాగా, తమ డిమాండ్లు సాధించే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని దల్లేవాల్‌ స్పష్టం చేశారు.

బారీకేడ్లను ఎత్తేయాలన్న హైకోర్టు.. ‘సుప్రీం’కు హర్యానా సర్కారు
మార్చిలో జరిగిన ర్యాలీలో అరెస్టు చేయబడి, అల్లర్లు, హత్యాయత్నంతో సహా పలు అభియోగాలను ఎదుర్కొంటున్న నవదీప్‌ సింగ్‌కు సంఘీభావం తెలిపేందుకు బుధవారం అంబాలా వద్ద రైతులు శాంతియుత నిరసనను ప్లాన్‌ చేసినట్టు ఆయన చెప్పారు. వారంలోగా శంభు సరిహద్దు వద్ద బారికేడ్లను ఎత్తేయాలని పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన కొద్ది రోజుల తర్వాత దల్లేవాల్‌ నుంచి ప్రకటన రావటం గమనార్హం. కాగా, శాంతిభద్రతల పరిస్థితిని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా ప్రభుత్వ వాదనపై దల్లేవాల్‌ స్పందిస్తూ..రోడ్డును దిగ్బంధించింది ప్రభుత్వమే తప్ప రైతులు కాదని చెప్పారు. ఫిబ్రవరి 21న నిరసన తెలుపుతున్న రైతులకు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన భటిండా నివాసి శుభకరన్‌ సింగ్‌(21) మరణంపై దర్యాప్తు చేయటానికి ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్యానెల్‌పై కూడా దల్లేవాల్‌ ప్రశ్నలు లేవనెత్తారు.

రైతన్నల డిమాండ్లివే..!
రైతులు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ, 58 ఏండ్ల రైతులు, వ్యవసాయ కూలీలకు నెలవారీ పింఛను, విద్యుత్‌ సవరణ బిల్లు-2020 ఉపసంహరణ, రైతుల సమ్మతిని నిర్ధారించటానికి, నాలుగు రెట్ల పరిహారం కోసం భూసేకరణ చట్టం-2013ని తిరిగి ప్రవేశపెట్టటం, రోజువారీ వేతనాల పెరుగుదల వంటి
ఇతర డిమాండ్లను రైతులు వినిపిస్తున్నారు.