న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో ఎల్‌ఎల్‌బీ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులో మనుస్మృతిని బోధనాంశంగా ప్రవేశపెట్టేందుకు ఢిల్లీ యూనివర్శిటీలో ని లా ఫ్యాకల్టీ సిద్ధమైంది. జ్యూరిస్‌ప్రూడెన్స్‌ (లీగల్‌ మెథడ్‌)గా పిలిచే కేటగిరీ కింద దీన్ని తీసుకురానున్నారు. సామాజిక, ఆర్థిక, లింగ అసమానతలను ఉద్భోదించే, మరింత బలోపేతం చేసే ఈ వివాదాస్పదమైన సబ్జెక్ట్‌ను వర్శిటీలోని ఫ్యాకల్టీకి చెందిన కొన్ని వర్గాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. సవరించిన సిలబస్‌ డాక్యుమెంట్‌లో ఈ మనుస్మృతిని ప్రవేశపెడతారు. దీన్ని అమలు చేసేందుకు అనుమతించే నిమిత్తం ఈ సిలబస్‌ ప్రతిని శుక్రవారం ఢిల్లీ వర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ ఫర్‌ అకడమిక్‌ మేటర్స్‌ ముందు వుంచుతారు. ఇది ఆమోదం పొందిన వెంటనే ఇక, ఎల్‌ఎల్‌బీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో సెమిస్టర్‌ 1లో యూనిట్‌ 5-అనలిటికల్‌ పాజిటివిజమ్‌ కింద మనుస్మృతిని జి.ఎన్‌.ఝా రాసిన మనుభాష్య మేథాతిథితో పాటు కలిపి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్ధులు చదువుతారు. భారతీయ దృక్కోణాలను, దృక్పథాలను బోధనా రంగంలో ప్రవేశపెట్టేందుకే నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా ఈ మనుస్మృతిని తీసుకువచ్చినట్లు ఫ్యాకల్టీ ఆఫ్‌ లా డీన్‌ ప్రొఫెసర్‌ అంజు వలీ టికూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు.

టీచర్స్‌ ఫ్రంట్‌ నిరసన
కాగా ఈ నిర్ణయాన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫ్రంట్‌ తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ యోగేష్‌ సింగ్‌కు లేఖ రాసింది. సమాజంలో మహిళలు, అట్టడుగు వర్గాల ప్రగతికి, విద్యకు ఇది పూర్తి ప్రతికూలంగా వున్నందున ఈ చర్య పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఆ లేఖలో తెలియచేసింది. ”ఈ దేశంలో 85శాతం జనాభా అట్టడుగు వర్గాలకు చెందినవారే, 50శాతం జనాభా మహిళలే. వీరి పురోగతి ప్రగతిశీల విద్యా వ్యవస్థపై, బోధనా విధానంపై ఆధారపడి వుంటుంది. మనుస్మృతిలోని పలు సెక్షన్లు మహిళల విద్యకు, సమానహక్కలకు పూర్తి వ్యతిరేకంగా వుంటాయి. మనుస్మృతిలోని ఏ ఒక్క భాగాన్ని లేదా సెక్షన్‌ను ప్రవేశపెట్టడం మన రాజ్యాంగం మౌలిక స్వరూపానికి, రాజ్యాంగ విలువలకు పూర్తి విరుద్ధం.” అని ఆ లేఖ పేర్కొంది.