హైదరాబాద్: సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. బుధవారం ఇందుకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా స్టైపెండ్ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.