”చెంచు” ఆదివాసీలు అంతరించిపోయే తెగల జాబితాలో పీవీటీజీలు (పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్)గా ఉన్నారు. వీరిని ఇంతకుముందు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ (పీటీజీ)గా పిలిచేవారు. వీరి జనాభా కనుమరుగైపోతున్నది. దీనిపై వారి ఉనికిని కాపాడే ఎలాంటి చర్యలు ప్రభుత్వాల నుండి లేవు. గత జూన్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యంత హేయమైన, పైశాచిక దాడి ఘటన సభ్య సమాజం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనకు కొంతకాలం ముందు వారి దగ్గరి బంధువు నాగన్న కూడా హత్యకు గురయ్యాడు. ఈ దాడులు, హత్యాకాండ అంతా వారివద్ద ఉన్న కొద్దిపాటి భూమిని పెత్తందారులు గుంజుకునేందుకు చేసినవే. ఇలాంటి ఘటనల ద్వారా చాలామంది వెట్టిచాకిరీ(బాండెడ్ లేబర్)గా మారుతున్నారు. నామమాత్రపు ధరకు ఆ చెంచు కుటుంబం భూమిని కొట్టేయాలని చూసిన గిరిజనేతర పెత్తందారుల ప్రయత్నాలకు ఈశ్వరమ్మ సంతకం చేయ నిరాకరించింది. దీంతో ఆమె పెత్తందారు అయిన బండి వెంకటేష్ ఆగ్రహానికి గురయ్యింది. చెప్పడానికి, రాయడానికి వీలులేని రీతిలో ఆమెను చిత్రహింసలకు గురిచేసారు. ముగ్గురు పసిపిల్లల తల్లి ఈశ్వరమ్మ చావుబతుకు లతో హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. ఇలాంటి దాడులను నివారించాల్సిన పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికా రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ బాధితుల పక్షాన నిలబడక పోవడమే కాకుం డా, విచారణాధికారిగా నియమించబడిన డిఎస్‌పి బాధితులను అత్యంత చులకనగా, అవమానించి మాట్లాడాడు. ఈ వివక్షకు కారణం జనాభా రీత్యా చెంచులు అతి చిన్న మైనారిటీ గ్రూపు కావడమే.
నాగర్‌కర్నూల్ జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను దున్నుకోకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. ఫలితంగా పెరిగిన మొక్కలు చూపించి ఇది అడవి అని బెదిరిస్తున్నారు. సాగులో ఉన్న భూములకు కూడా పట్టాలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఐటీడీఏ వీరి పక్షాన నిలబడాల్సి ఉన్నది. కానీ అది నిర్వీర్యమైపోయింది. వీరిని బాండెడ్ లేబర్‌గా మార్చకుండా కాపాడేదానికి అత్యంత వెనకబడిన పివిటిజిలకు ప్రత్యేకంగా వర్తించాల్సిన ఉపాధిహామీ చట్టం అమలు చేయడం లేదు. గిరిజనేతరులకు ఇచ్చే పనుల్లోనే చెంచులను కూడా కలిపారు. దీనితో వారిని ఈ పనికి పోకుండా చేసేందుకు పలురకాల ఆంక్షలు తయారు చేసినట్లయింది. ఫలితంగా వీరు ఉపాధి పనులకు దూరమయ్యారు. జీవనోపాధి లేక చెంచులు తీవ్రమైన పేదరికం, పోషకాహార లోపం, రక్తహీనతతో ప్రమాదకరంగా జీవిస్తున్నారు. చాలా మందికి ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం నుండి పేదలకందే ఎలాంటి సహాయం వీరికి అందడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో, నక్సల్స్‌కు అన్నం పెడుతున్నారనే నెపంతో ఎటువంటి విచారణా లేకుండానే అడవిలోని గ్రామాలను ఖాళీ చేయించారు. తర్వాత ఆ ప్రాంతాన్ని ”రాజీవ్‌గాంధి టైగర్ రిజర్వ్” ఫారెస్టులో కలిపారు. అడవిలో క్రూర జంతువులు, ఆదివాసీలు కలిసే ఉండేవారు. కానీ తర్వాత క్రూర జంతువులే ఉండాలనే లక్ష్యంతో మనుషులను బయటకు తరిమెయ్యాలనే విధానాన్ని చేపట్టారు. వారిని అక్కడి నుండి ఖాళీ చేయించారు కానీ వారికి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో పునరావాసం కాదు కదా, సాధారణ స్థాయి పునరావాసం కూడా కల్పించలేదు. దీనితో నీళ్లనుండి ఒడ్డున పడేసిన చేపలా అయింది ఈ పివిటిజిల పరిస్థితి. పట్టాలు ఇచ్చినవారికి భూమి చూపలేదు. భూమి దక్కినా వారికి అది వారి చేతిలో మిగలలేదు, అది అన్యాక్రాంతమైంది. పునరావాసం పేరుతో మైదాన ప్రాంతంలోకి తరలించిన తర్వాత వారికి రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్ ప్రాంత చట్టాలు, హక్కులు ఏ ఒక్కటీ వర్తించకుండా అయిపోయింది.
గిరిజనుల కోసం పనిచేయడానికి వివిధ విభాగాలతో కూడిన ఐటిడిఏ ఉండాలి. ఐఏఎస్ అధికారి ఐటిడిఏకు ప్రాజెక్టు అధికారిగా నియమించాలి. నిధులు కేటాయించాలి. కానీ ఇవేవీ లేకుండా మన్ననూర్‌లో ఐటిడిఏ నామమాత్రంగా ఉన్నది.ఉమ్మడి రాష్ట్రంలో సున్నిపెంట (శ్రీశైలం)లో పూర్తిస్థాయి ఐటిడిఏ ఉండేది. రాష్ట్ర విభజనలో అది ఆంధ్రాకి పోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లా నాగర్‌కర్నూల్‌లోని మన్ననూర్‌లో ఏర్పాటు చేశారు.
అటవీశాఖ అడవిబిడ్డలపై అనునిత్యం దాడులు నిర్వహిస్తున్నది. అదే శాఖకు చెందిన అధికారిని ఐటిడిఏకు ఇన్‌ఛార్జి పిఓగా పెట్టారంటే ఐటిడిఏల ఏర్పాటు స్ఫూర్తికి ఎలా తూట్లు పొడిచారో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్. ఈ జిల్లాలో ఇప్పటికైనా పూర్తిస్థాయి ఐటిడిఏగా మార్పుచేసి ఐఏఎస్ అధికారిని పిఓగా నియమించాలని గిరిజనులు కోరుతున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రజాపాలన అధికారిణి (ఐఏఎస్) శ్రీమతి దివ్యాదేవరాజన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్) తరపున జూన్ 28న పార్లమెంటు మాజీ సభ్యులు డా||మిడియం బాబూరావు నాయకత్వంలో వినతిపత్రం ఇచ్చి పలు సూచనలు చేసింది. పలు రాష్ట్ర స్థాయి గిరిజన అధికారులను కలిసింది. కొల్లాపూర్ మండలంలో చెంచు ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యల్ని తెలుసుకుంది, వారికి అండగా నిలబడి ధైర్యన్నిచ్చింది.
చెంచులు పివిటిజిల జాబితాలో ఉంటారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దక్కాల్సిన పథకాలు నేరుగా చేరేలా గూడాలి. తగిన నిధులు కేటాయించాలి. సాగులో ఉన్న భూములకు, గతంలో సాగు చేసుకుని బలవంతంగా అటవీశాఖ ద్వారా బయటకు గెంటివేయబడిన భూములకు పట్టాలివ్వాలి. పలురకాల ప్రలోభాలు, బెదిరింపులతో వారివద్ద నుండి గుంజుకున్న భూములను తిరిగి వారికి ఇప్పించాలి. ప్రతి చెంచు కుటుంబానికి కనీసం పదెకరాల భూమి ఉండేలా చూడాలి. మంచినీటి బోర్‌వెల్స్, సాగునీటి బోర్లు కూడా వేయకుండా అటవీశాఖ జులుం పెరిగిపోయింది. వారి దురాగతాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలి.
చెంచు ఆవాసాలలో అంగన్‌వాడీ సెంటర్లు, హెల్త్ వర్కర్ల వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. జిసిసి, రేషన్ దుకాణాల ద్వారా అందరికీ ప్రజాపంపిణీ వ్యవస్థ అందుబాటులోకి తేవాలి. అర్హులైన వారందరికీ పివిటిజి నామ్స్ ప్రకారం వృద్ధాప్య పింఛన్లతో పాటు, వితంతు పింఛన్లివ్వాలి. రక్తహీనత, పోషకాహార లోపం పొగొట్టడానికి ప్రత్యేక పోషకాహార ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి. ఐదోషెడ్యూల్ ప్రాంతం వర్తించే విధంగా పునరా వాసం కల్పించాలి. ఐటిడిఏ చొరవచేసి బ్యాంకుల ద్వారా రుణాలు, విత్తనాలు తదితర సౌకర్యాలు కల్పించాలి. పివిటిజిలకు ప్రత్యేకంగా ఉపాథి హామీ పథకం కింద విడిగా పనులు కేటాయించాలి. పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలి. బాల కార్మికు లను పనిలో పెట్టుకునేవారికి కఠిన శిక్షలు వేయాలి. ప్రతి పీవీటీజీ కుటుంబానికి 30 కేజీల బియ్యం, మూడు కేజీల కందిపప్పు, రెండు కేజీల మంచినూనే ప్రతి నెలా ఇవ్వాలి. గృహ నిర్మాణ పథకం కింద వారందికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి.
నాగన్నను చంపినవారిని, ఈశ్వరమ్మ ఘటనతో సంబంధం ఉన్నవారందరినీ కఠినంగా శిక్షించాలి. బెయిల్ మంజూరు కాకుండా చూడాలి. తాగుడు, ఇతర వ్యసనాలకు పురుషులు బానిసలై చనిపోతు న్నారు. ఒంటరి మహిళలు, అనాథ పిల్లల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ వ్యసనాలపై ప్రత్యేకంగా ఐటిడిఏ, ఇతర సంస్థలు సీరియస్‌గా దృష్టి పెట్టాలి. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టకపోతే, తర్వాత కాలంలో ఐటిడిఏ ఏర్పాటు చేసిన చెంచులకిë మ్యూజియాన్ని సందర్శించినవారు ‘ఒకప్పుడు చెంచు తెగ ఇలా ఉండేదట’ అని ఒక జ్ఞాపకంగా గుర్తుచేసుకునే ప్రమాదముంది.