చరిత్ర జ్యోతిబసును సృష్టిస్తే…జ్యోతిబసు చరిత్రను సృష్టించారు.

0
93

ప్రజలు మనల్ని ప్రేమించే వరకు మనం ప్రజల వద్దకు వెళుతూనే ఉండాలనేది ఆయన నమ్మిన సిద్ధాంతం.
ఆయన నమ్మిన సిద్ధాంతాలు ఆయన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయేలా చేశాయి.

నేడు జ్యోతిబసు 110వ జయంతి

      ఆయనో ఆదర్శమూర్తి. నమ్మిన సిద్ధాంతాలను కడవరకూ ఆచరించి చూపిన మహానేత. శ్రమ జీవుల కోసం జీవితాన్ని అంకితం చేసిన యోధుడు. గొప్ప పరిపాలనాదక్షుడు. రాజకీయ చతురుడు. భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన అరుదైన నాయకుడు. దేశ రాజకీయాల్లోనే విశిష్ట నేతగా గుర్తింపు పొంది, ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన విప్లవ యోధుడు. 23 ఏళ్ల పాటు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు సృష్టించి, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు జ్యోతిబసు 105వ జయంతి సందర్భంగా ఆయన గురించి... 

బాల్యం…
……….
జ్యోతిబసు జూలై 8, 1914న కోల్‌కతలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో ఇంగ్లండ్‌ బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్‌ బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో న్యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందారు. అదేయేట భారతదేశానికి తిరిగివచ్చాడు.

ఇంగ్లండ్‌ నుండే రాజకీయాలవైపు…
……………………..

ఇంగ్లాండులో ఉన్నప్పుడే జ్యోతిబసు రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1938లో జవహర్‌ లాల్‌ నెహ్రూ లండన్‌ పర్యటన సమయంలో సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతిబసు చేపట్టారు. సుభాష్‌ చంద్రబోస్‌ పర్యటన సమయంలో కూడా జ్యోతిబసు ఏర్పాట్లు చేశారు. స్వదేశానికి తిరిగివచ్చిన పిదప 1946లో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. బిసి రాయ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. 1967లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు పశ్చిమబెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1972లో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో జ్యోతిబసు శాసనసభ స్థానంలో ఓడిపోయారు. అనంతరం జూన్ 21, 1977 నుండి నవంబరు 6, 2000 వరకు నిరాటంకంగా జ్యోతిబసు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దీంతో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును కూడా జ్యోతిబసు సొంతం చేసుకున్నారు. సిపిఐ(యం) పొలిట్‌ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు.

అంచెలంచెలుగా ఎదిగిన నేత
…………………..

1941లో బసు తల్లి మరణించిన నాటి నుండి పార్టీ కార్యకర్తగా యావత్‌ కాలాన్నీ వినియోగించడం ప్రారంభించారు. అక్కడి నుండి బెంగాల్‌ రాజకీయ యవనికపై అంచెలంచెలుగా ఎదిగారు. 1941-43 మధ్య బెంగాల్‌, అస్సాం రేల్వే వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1944 నుంచి ట్రేడ్‌ యూనియన్‌ బాధ్యతలు చేపట్టారు. 1946-47లో బెంగాల్లో సాగిన ఃతెభాగః పోరాటంలోనూ, కార్మిక వర్గ సమ్మెల్లోనూ, మత ఘర్షణల నిరోధంలోనూ గొప్ప పాత్ర వహించారు. 1948లో బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. ఆ సందర్భంగా బసు అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. 1950లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ బెంగాల్‌ రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1953 నుంచి 1961 వరకూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిం చారు. 1964లో సిపిఐ(ఎం) ఏర్పడిననాటి నుంచి పొలిట్‌బ్యూరో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు.

తుపాకీ గుళ్లకు బెదరని వీరుడు
…………………
1970 మార్చి 31 బీహార్‌ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో జ్యోతిబసు రైలు దిగుతున్నప్పుడు ఓ దుండగుడు బసుపై కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో సిపిఎం అభిమాని అలీ ఇమాం జ్యోతిబసుతో కరచాలనం చేసేందుకు ముందుకువచ్చారు. దీంతో తుపాకీ గుండు అలీ ఇమాంకు తగిలి ఆయన అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో జ్యోతిబసు తొణకక బెణకక ఉండిపోయారు. ఇమాం ఇంటికి వెళ్లి కుటుంబీ కులను ఓదార్చి వారికి తగిన సాయం కోసం ఏర్పాట్లు చేశారు. 1971లో కాంగ్రెస్‌ దుండగులు జ్యోతిబసుపై రెండుసార్లు దాడికి యత్నించారు.

పేదల ప్రభుత్వంగా గుర్తింపు
…………………
1977లో బసు తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని బెంగాల్‌వాసులు నేటికీ గుర్తుచేసుకుంటారు. ఆయన నేతృత్వంలో ఃఆపరేషన్‌ బర్గాః కింద 14 లక్షల మంది బర్గాదార్ల (కౌలుదార్ల)ను నమోదు చేయించారు. 11 లక్షల ఎకరాల భూమిని శాశ్వతంగా వారి అధీనంలోకి తెచ్చి, సాగుచేసేవారి హక్కుకు రక్షణ కల్పించారు. భూ సంస్కరణల చట్టం కింద దాదాపు 13.7 లక్షల ఎకరాల భూమిని సేకరించి, 10.4 లక్షల ఎకరాలను 25 లక్షల భూ వసతిలేని సాగుదారు కుటుంబాలకు పున:పంపిణీ చేశారు. దాదాపు ఐదు లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా భూ సంస్కరణల కింద పునఃపంపిణీ చేసిన భూమిలో 20 శాతం బసు నేతృత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వంలో పంపిణీ అయింది. భూ సంస్కరణల వల్ల దళితులు, ఆది వాసులు ప్రధానంగా ప్రయోజనం పొందారు. వామపక్ష ప్రభుత్వం వచ్చేనాటికి 57 లక్షలుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల సంఖ్య 1999 నాటికి 1.23 కోట్లకు పెరిగాయి. నివాస ప్రాంతాలకూ, పాఠశాలలకూ మధ్య సగటు దూరం తగ్గింది. ఇక సామాజిక సూచీలు కూడా ఎంతో మెరుగు పడ్డాయి. మైనారిటీలకు సామాజిక భద్రత కల్పించడం, ఆర్థిక తోడ్పాటు అందించడం ముఖ్య కర్తవ్యంగా పెట్టుకొని బసు కృషి చేశారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులను నిలువరించడంలోనూ, బాబరీ మసీదు కూల్చివేత అనంతరం యావద్దేశంలో మత కలహాలు చెలరేగినప్పుడు బెంగాల్‌లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జ్యోతిబసు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు మత కలహాలకు నిలయంగా ఉన్న బెంగాల్‌ను మత, సామాజిక సామరస్యానికి ఆశాదీపంగా నిలబెట్టారు.
ప్రతి ఎన్నికల్లోనూ విజయ దుందుభి

ప్రతి ఎన్నికల్లోనూ విజయ దుందుభి

దేశం మొత్తంమీద శాసన సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం బాధ్యతలను నిర్వహించింది జ్యోతిబసు. సాతంత్య్రానికి పూర్వం ఒకసారి, అనంతరం 11 సార్లు శాసనసభ్యుడుగా పనిచేశారు. 1946లో అవిభక్త బెంగాల్‌ శాసనసభలోకి అడుగుపెట్టారు. 1946 నుంచి 2000లో పార్లమెంటరీ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే వరకూ ప్రతి ఎన్నికల్లోనూ ఆయన విజయ దుందుభి మోగించారు. 2000లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవిని నుండి వైదొలిగారు. జనవరి 17, 2010న కోల్‌కతలో బసు (95) మరణించాడు. జ్యోతిబసుకు కుమారుడు చందన్‌, కోడలు, ముగ్గురు మనమలు వున్నారు. జ్యోతిబసు మరణానికి ముందే ఆయన భార్య కమల నాలుగేళ్ల కిత్రం మరణించారు. దేశ చరిత్రలో, ప్రజల మనస్సులో చిరకాలం నిలిచిపోయిన ఈ మహానేత ఆశయాల కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి.

— భూక్యా రమేష్
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు.
భద్రాద్రి కొత్తగూడెం.
9492312628