బొగ్గు గనుల వేలం పాట ఆపాలని సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబర్ పేట్ జోన్ కన్వీనర్ మహేందర్ గారు మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదినీ. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్ణయించింది. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ. సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి. కానీ వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తున్నది. ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించింది. మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం అన్యాయం. పైగా సింగరేణిని ప్రయివేటీకరించబోమని బుకాయించారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రయివేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముంది? క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరచి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతున్నది. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు కదలాలని కోరారు.
నేషనల్ మానిటైజేషన్ పైడ్లైన్ (నగదీకరణ) పేరుతో దేశంలో 6 లక్షల కోట్ల విలువైన ఆస్థులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే రు.28,747 కోట్ల విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. గత పదేండ్లలో మోడీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టారు. దీని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న వేలం. దేశవ్యాపితంగా 10వ విడతలో 61 బొగ్గు బావులను వేలం వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు, మరో 8మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపటం లేదు. తెలంగాణ నుంచి ఎన్నికై బొగ్గుగనుల శాఖా మంత్రిగా ఉండి కూడా సింగరేణిని దివాళాతీయించేవిధంగా బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నది.
ప్రస్తుతం సింగరేణి 40 వేల మంది పర్మినెంట్ కార్మికులకు, మరో 26 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించింది. రికార్డు స్థాయిలో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. గత పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ రూపంలో రు. 49,666 కోట్లు చెల్లించింది ఇందులో కేంద్రానికి రు.26 వేల కోట్లు, చెల్లించగా, రాష్ట్రానికి రు.23 వేల కోట్లు చెల్లించింది. ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ప్రభుత్వాలకు ఆదాయపు వనరుగా ఉన్నది. సింగరేణి రు.35 వేల కోట్ల టర్నోవర్తో లాభాల బాటలో నడుస్తున్నది. యేటా రెండు నుండి మూడువేల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నది.
మోడీ ప్రభుత్వం కోల్మైన్స్ చట్టాన్ని, మినరల్స్ & మైనింగ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టాలకు సవరణలు చేసింది. ప్రయివేటు సంస్థలకు అనుకూలంగా చేసింది. సింగరేణికి చెందిన 22 బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. కొత్త బ్లాకుల్లో తవ్వకాలు ప్రారంభించాలి. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించడం లేదు. వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నది. వేలం పాట ప్రారంభం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యకరం. ఇది వేలంపాట ప్రక్రియను ఆమోదించడమే కదా! గతంలో ప్రయివేటు సంస్థలకు అప్పగించిన మరో రెండు బ్లాకుల్లో ఇప్పటికీ తవ్వకాలు ప్రారంభం కాలేదు. అందువల్ల శ్రావణపల్లి బ్లాకుతో పాటు, ఆ రెండు బ్లాకులను కూడా తక్షణం సింగరేణికే అప్పగించాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. ఇందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలి. కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టవద్దు. సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సమాయత్తం చేయాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అంబర్ పేట్ జోన్ కమిటీ సభ్యులు జి రాములు, ఎల్ సోమయ్య నాయకులు అశోక్, నర్సింగరావు, ధర్మ, తిరుపతి, వీర్య, శీను, అంజయ్య, వెంకన్న, పాష తదితరులు పాల్గొన్నారు.