కువైట్‌ వెళ్లేందుకు కేరళ మంత్రికి అనుమతి నిరాకరణ. సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం !

0
95

మోడీకి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ లేఖ.

తిరువనంతపురం : మంగాఫిల్‌ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కువైట్‌ వెళ్లేందుకు ఆరోగ్యమంత్రి వీణా జార్జికి రాజకీయ అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానికి లేఖ రాశారు. జూన్‌12న కువైట్‌లోని మంగాఫ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో సగం మంది కేరళీయులేనని, అందుకే రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జినికి అక్కడికి పంపాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఆ లేఖలో గుర్తు చేశారు. అక్కడికి వెళ్లిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఇతర అధికారులు, భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన కార్య కలాపాలను సమన్వయం చేయడానికి కేరళ ఆరోగ్యమంత్రి అక్కడ ఉంటే ఎంతగానో ఉపయోగపడేవారన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు మనో స్థైర్యాన్ని ఇచ్చేందుకు ఇది ఎంతగానో తోడ్పడేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధ్యతలు నిర్వర్తించడానికి మంత్రిని కువైట్‌ వెళ్లకుండా అడ్డుకోవడం అత్యంత శోచనీయమని అన్నారు.