న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రధానంగా ఉద్యోగాల కల్పన, మూలధన పెంపునపై దృష్టి సారించే అవకాశం ఉందని యుఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ మోర్గన్‌ స్టాన్లీ అంచనా వేసింది. వికాసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా మూలధన వ్యయం పెంపునతో పాటు ఉద్యోగ కల్పన లాంటి కీలక ప్రకటనలు ఉండొచ్చని మోర్గన్‌ స్టాన్లీ విశ్లేషించింది. అదే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జులై 23న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో మాత్రం మార్పులు ఉండకపోవచ్చునని మోర్గన్‌ స్టాన్లీ అంచనా వేసింది. మధ్యతరగతి వర్గాలకు మాత్రం కొన్ని రకాల పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. వ్యవసాయం, స్టార్టప్‌లు, రైల్వే, రక్షణ, ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌, విద్యుత్తు వాహనాలు, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు ఉండొచ్చని పేర్కొంది. 2024-25 మధ్యంతర బడ్జెట్‌ తరహాలోనే జిడిపిలో ఆర్థిక లోటును 5.1 శాతానికి కట్టడి చేయాలని నిర్దేశించుకోవచ్చని పేర్కొంది. 2047 నాటికి అభివృద్థి చెందిన దేశంగా మారడానికి కావాల్సిన రోడ్‌ మ్యాప్‌పై దృష్టి పెట్టొచ్చని తెలిపింది.
పన్ను కోతలుండొచ్చు : బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్‌
వచ్చే బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుల్లో కొంత ఉపశమనం ఉండొచ్చని బీఓఎఫ్ఏ ఎకనామిస్ట్‌ ఆస్తా గుడ్వాని పేర్కొన్నారు. ప్రజల వినిమయ శక్తిని పెంచడానికి ప్రయత్నించవచ్చన్నారు. ఆర్‌బిఐ సహా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా డివిడెండ్‌ను అందుకున్న నేపథ్యంలో సర్కార్‌ వ్యయాలు పెరగొచ్చన్నారు. వైద్య రంగానికి అదనంగా రూ.1.35-1.5 లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం ఉండొచ్చన్నారు. బడ్జెట్‌లో పన్ను శ్లాబులు, రేట్లలో మార్పు ప్రతిపాదనలు పెద్దగా ఉండక పోవచ్చునని మరో బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది.