– ఉత్పత్తి రంగంలో 54 లక్షల ఉద్యోగాలు హాంఫట్
– పెరగని ఉత్పాదకత : ఆర్‌బీఐ క్లెమ్స్ డాటాబేస్ వెల్లడి
ఇటీవలి సంవత్సరాల్లో సంభవించిన ఆర్థిక ఒడిదుడుకులు అనధికారిక రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని ఇండ్-రా తెలిపింది. ఈ ఒడిదుడుకులు 2022-23 జీడీపీలో 4.3 శాతం మేర ప్రభావం చూపాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్-19 వంటి పరిణామాలు అనధికారిక రంగంలో ఉద్యోగ కల్పన అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయి.
న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తి రంగం ఉద్యోగ కల్పనలో బాగా వెనుకబడి పోయింది. చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థల్లోనే కాకుండా అనధికారికంగా నడుస్తున్న సంస్థల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు, కోవిడ్ మహమ్మారి వంటి ఆర్థికపరమైన ఒడిదుడుకులే దీనికి కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా అనధికారిక రంగంలో ఉద్యోగ కల్పన బాగా తక్కువగా ఉంటోంది. చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థల్లో సైతం 2015-16, 2022-23 మధ్యకాలంలో కేవలం 86 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగాల సంఖ్య కేవలం 7 శాతం మాత్రమే పెరిగింది. సగటున ఏటా పది లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఈ రంగంలో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉండడంతో పాటు కొత్తగా వచ్చిన ఆ ఉద్యోగాలు సైతం ఉత్పాదకతను పెంచలేకపోయాయి.
ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. సోమవారం విడుదలైన రిజర్వ్‌బ్యాంక్ తాజా సమాచారం ప్రకారం 2015-16, 2022-23 మధ్యకాలంలో పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా ఉత్పత్తి రంగంలో 54 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన వార్షిక సర్వే నివేదికను ఆధారంగా చేసుకొని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్-రా) సంస్థ అనధికారిక రంగంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషించింది.
ఉత్పత్తి రంగానిదే పెద్ద పీట
ఆర్‌బీఐకి చెందిన క్లెమ్స్ (క్యాపిటల్, లేబర్, ఎనర్జీ, మెటీరియల్, పర్చేజ్ సర్వీసెస్) డాటాబేస్ దేశ ఆర్థిక రంగంలోని 27 కీలక రంగాల సమాచారాన్ని విశ్లేషించింది. అందుకోసం వివిధ వనరుల నుంచి సేకరించిన ప్రభుత్వ సమాచారాన్ని వినియోగించింది. దీని ప్రకారం…2015-16, 2022-23 మధ్యకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్తగా 12.5 కోట్ల ఉద్యోగాలు చేరాయి. వీటిలో 86 లక్షలు అంటే 6.9 శాతం ఉద్యోగాలు ఉత్పత్త రంగంలోనివే. సేవల రంగంలో 4.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయి. లెహమాన్ సంక్షోభం నుంచి అనేక ఆర్థిక వ్యవస్థలు తమ దేశీయ రంగాలను కాపాడుకోవడం మొదలు పెట్టాయని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ప్రధాన ఆర్థికవేత్త, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ శర్మ తెలిపారు. ‘అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి వచ్చిపడింది. దీంతో ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందలేదు. ఆ రంగం యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయింది’ అని ఆయన చెప్పారు.
ఉత్పాదకత పెరగలేదు
2022-23 నాటికి వ్యవసాయేతర అనధికారిక రంగంలో సుమారు 10.96 కోట్ల మంది పనిచేస్తున్నారని ఇండ్-రా తెలిపింది. ఈ సంఖ్య 2015-16తో పోలిస్తే 11.13 కోట్లు తక్కువ. ఉత్పత్తి రంగం ఉద్యోగాలు కోల్పోవడమే దీనికి ప్రధాన కారణం. 2022-23లో ఉత్పత్తి రంగంలో 3.6 కోట్ల మంది పనిచేశారు. ఈ సంఖ్య 2015-16తో పోలిస్తే 54 లక్షలు తక్కువ. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే 2015-16లో ఉత్పాదకత ఎలా ఉన్నదో 2022-23లో కూడా అలాగే ఉంది. అంటే కొద్దో గొప్పో ఉద్యోగ నియామకాలు జరిగినప్పటికీ ఉత్పాదకత మాత్రం పెరగలేదు. ఉత్పత్తి రంగంలో ప్రతి కార్మికుడి ఉత్పాదకతను కొలిచే ‘స్థూల వాల్యూ ఎడిషన్’ 2022-23లో రూ.3.96 లక్షలుగా ఉంది. ఇది 2015-16లో కంటే (3.49 లక్షలు) స్వల్పంగా మాత్రమే పెరిగింది. కోవిడ్ కారణంగా సమస్యలు ఎదురైనప్పటికీ ఉత్పత్తి రంగం అనేక నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుంది. అయితే ఉత్పాదకత విషయంలో చైనా వంటి దేశాలకు చాలా దూరంలో ఉండిపోయింది.
ప్రతికూల పరిణామాలు లేకపోతే…
వాణిజ్యం, ఇతర సేవలు సహా అనధికారిక రంగాన్ని ఇండ్-రా విశ్లేషణ పరిశీలించింది. 2015-16, 2022-23 మధ్యకాలంలో తగిలిన ఎదురు దెబ్బలు కేవలం ఉత్పత్తి రంగానికి మాత్రమే పరిమితం కాలేదని తేల్చింది. 2022-23లో దేశంలో 6.5 కోట్ల అనధికారిక సంస్థలు ఉన్నాయి. 2015-16తో పోలిస్తే ఇది కేవలం 20 లక్షలు మాత్రమే అధికం. దీనికి భిన్నంగా 2010-11, 2015-16 మధ్యకాలంలో 57 లక్షల అనధికారిక సంస్థలు ఆవిర్భవించాయి. ఎదురు దెబ్బలు తగకుండా ఉంటే 2022-23 నాటికి దేశంలో అనధికారిక సంస్థల సంఖ్య 71.4 మిలియన్లకు చేరి ఉండేదని అంచనా. అదే విధంగా ఉద్యోగుల సంఖ్య కూడా 125.3 మిలియన్లకు చేరి ఉండేది. మరో మాటలో చెప్పాలంటే 2015-16, 2022-23 మధ్యకాలంలో అనధికారిక రంగం 6.3 మిలియన్ సంస్థలను, 16 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోయింది. 2022-23లో దేశంలో అనధికారిక సంస్థల ఆర్థిక పరిమాణం రూ.15.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 2010-11, 2015-16తో పోలిస్తే వృద్ధి చాలా తక్కువగా ఉంది.