ఆకలి కేకలను ఆపగలమా..! డా|| బుర్ర మధుసూదన్‌ రెడ్డి

0
91

డా|| బుర్ర మధుసూదన్‌ రెడ్డిసెల్‌ : 9949700037

ప్రపంచంలో పోషకాహార లోపం వున్న వారు అత్యధికంగా ఆసియా దేశాల్లో 41.8 కోట్ల మంది ఉండగా, ఆఫ్రికాలో 28.2 కోట్ల మంది ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో అదనంగా 3 కోట్ల మంది పేదలు ఆకలితో అలమటించారు. ప్రత్యేక చర్యలు అమలు పరచని పక్షంలో 2030 నాటికి 66 కోట్ల మంది పేదలు ఉంటారని, ఆకలిని అంతం చేయడం అసాధ్యమని తెలుస్తున్నది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్ఏఓ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ (ఐయఫ్ఏడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూయఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు. అన్నార్తులకు సంబంధించి పైన పేర్కొన్న అంశాలు ఈ నివేదిక వెలువరించినవే. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (యస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత నిర్ణయం తీసుకున్నారు.
పోషకాహార అభద్రత
ప్రపంచవ్యాప్తంగా 237 కోట్లకు పైగా (ప్రతి ముగ్గురిలో ఒకరు) ప్రజలకు అవసరమైనంత ఆహారం లభించడం లేదని నివేదిక తెలుపుతున్నది. లింగ వివక్ష కారణంగా పురుషుల కన్న మహిళల్లో 10 శాతం అధికంగా ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. ఆహార ధాన్యాల అధిక ధరలు, ఆదాయం తగ్గడం వల్ల 300 కోట్ల మంది పేదలు పోషకాహారానికి దూరం అవుతున్నారు. పోషకాహార లోపం ప్రపంచ మానవాళికి శాపంగా వెంటాడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 22 శాతం (150 కోట్లు) ఐదేళ్ల లోపు పిల్లలు శరీర వృద్ధి నిలిచిపోవడం (స్టంటింగ్‌)తో, 6.7 శాతం (4.54 కోట్లు) అభివృద్ధి తగ్గడం (వేస్టింగ్‌)తో, 5.7 శాతం (3.89 కోట్లు) అధిక బరువు (ఓవర్‌ వేయిట్‌) సమస్యలతో బాధ పడుతున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పిల్లల పోషకాహారలోపం అత్యధికంగా కనిపిస్తున్నది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49 ఏళ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత (ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యురొప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. గర్భిణిలలో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లి పాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, అధిక బరువు పిల్లలు పెరగడం, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల మధ్య 2030 నాటికి ఆకలిని అంతం చేయడం అసాధ్యమని వివరించారు.
వాతావరణ మార్పుల ప్రభావం
ఆహార అభద్రత, పోషకాహార లోపం పెరగడానికి కారణాలుగా వాతావరణ అసాధారణ మార్పులు, ఆర్థిక మందగమనం, ఆర్థిక అసమానతలు, లాక్‌డౌన్‌/ కర్ఫ్యూలు లాంటి అంశాలను నివేదిక పేర్కొంది. ఆహార ధాన్యాల దిగుబడి, ఆదాయాలు తగ్గడం, మార్కెటింగ్‌ లొసుగుల (ఉత్పత్తి, పంట కోత, ప్రాసెసింగ్‌, రవాణా, మార్కెటింగ్‌, ధరలు)తో పేదలు పోషకాహారానికి దూరం అవుతున్నారు. పోషకాహార లభ్యత పెరగడానికి… వాతావరణ ఒడుదుడుకులను తట్టుకోగల ఆహార వ్యవస్థలు, ఆర్థిక కష్టాలను అధిగమించడం, ఆహార సరఫరాలో నాణ్యతను పరిరక్షించడం, పేదరికంతో పాటు అసమానతలను తొలగించడం, పోషకాహారం పట్ల ఆరోగ్య అవగాహన కల్పించడం లాంటి అంశాలను పేర్కొంది. ఆర్థిక అసమానతలు పెరిగితే ప్రకృతి సహజ వనరులైన సారవంతమైన నేలలు, మత్స్య సంపద, అటవీ సంపద, నీటి వనరుల కోసం ఘర్షణలు జరగడం సర్వసాధారణం. సమాజంలో ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం, ఆస్తులు, టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో అసమానతలు పెరిగితే వాటి దుష్ప్రభావం అధికంగా మహిళలు, పిల్లలపై నేరుగా పడుతుంది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఇమిడి ఉన్న పలు దశల్లో ఆహారం వ్యర్థం కావడం నేర సమానమని నమ్మాలి. ఆహారాన్ని ఆదా చేస్తే ఆహారం ఉత్పత్తి చేసిన దాని కన్న మిన్న అని తెలుసుకోవాలి. ‘యు.యన్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ సమిట్‌’ సూచనల ప్రకారం ప్రపంచ దేశాలు తమదైన చర్యలను తీసుకుంటూ 2030 నాటికి ‘జీరో హంగర్‌’ దిశగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన ఆహార అభద్రత (యస్‌డిజి టార్గెట్‌-2.1), పోషకాహార లోపాలను (యస్‌డిజి టార్గెట్‌-2.2) అధిగమించి, అనుకున్న సదుద్దేశ్యాలను సగర్వంగా చేరుకోవాలని ఆశిద్దాం.