రచయిత – డాక్టర్ బి. శివరామిరెడ్డి
అధ్యయనం గురించి, దాని అవసరం గురించి మార్క్సిస్టు మహెూపాధ్యాయులు అనేక సందర్భాల్లో నొక్కి చెప్పారు. తమ తమ జీవిత కాలాల్లో నిరంతరం అధ్యయనం చేస్తూనే, ఆచరణతో జోడించి విప్లవాలను విజయవంతం చేయడమే గాకుండా మార్క్సిస్టు లెనినిస్టు భాండాగారాన్ని ఎంతో సుసంపన్నం చేసారు.తత్వశాస్త్రాన్నీ,ఆర్థిక శాస్త్రాన్నీ, సైన్సునీ, సామాజిక శాస్త్రాల్ని అధ్యయనం చేసి తలక్రిందులుగా వున్న అనేక అంశాలను శాస్త్రీయ పునాదులపై నిలబెట్టి భవిష్యత్ దర్శనాన్ని ప్రపంచ ప్రజలకు చూపెట్టారు.
అధ్యయనం లేని ఆచరణ,ఆచరణలేని అధ్యయనం లక్ష్యం లేనిదని, వృథా అని కూడా చెప్పారు.గురిచూసి బాణంకొట్టిన రీతిగా సమస్యలను పరిష్కరించుకొనే దృష్టితో శాస్త్రీయ అవగాహన పెంచుకోవడానికి గ్రంథాలను అధ్యయనం చేయాలని మార్క్సిస్టు మహోపాధ్యాయులు బోధించారు. విప్లవకారులకు గమ్యంపట్ల వుండవలసిన పట్టుదల,ఆ పట్టుదలకు పునాదిగా ఉపయోగపడే రాజకీయ అధ్యయనం చాలా ముఖ్యమైనది.
చదువుపట్ల నిర్లక్ష్యంతోనూ,అతి తక్కువ పరిజ్ఞానం తోనూ మనం భవిష్యత్ విప్లవోద్యమాన్ని నిర్మించలేము. విముక్తి సాధించలేము.సాధించిన విజయాలను కూడా రక్షించు కోలేము.అందువలన వ్యవస్థను సమూలంగా మార్చాలను కునే వ్యక్తులు, సమసమాజ నిర్మాణానికి పూనుకునే శక్తులు చాలా బాధ్యతాయుతంగా అధ్యయనాన్ని పెంపొందించు కోవలసి వుంది. సమాజంలోనూ,జాతీయంగా, అంతర్జాతీయం గానూ రోజురోజుకీ మారుతున్న పరిస్థితుల్ని చైతన్యవంతంగానూ,శాస్త్రీయంగానూ అధ్యయనం చేస్తూ తమ వ్యక్తిగత యిష్టాయిష్టాలతో గాకుండా భౌతిక వాస్తవాలతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని మార్క్సిస్టు మహోపాధ్యాయులు మనకు బోధించారు.
డాక్టరు శివరామిరెడ్డిగారు ఎన్నో ఏళ్ళక్రితం తయారు చేసుకున్ననోట్సు అధారంగానూ,తనవద్దకు వచ్చిన అనేక మంది కామ్రేడ్స్ తో చర్చించిన అనంతరం కార్యకర్తలకు ఉపయోగమని భావించి ఈ పుస్తకాన్ని రాసాడు. ఈ పుస్తకంలో మూడు వ్యాసాలున్నాయి. నిరంతరం అధ్యయనం; పరిశీలన లేకండా మాట్లాడే హక్కులేదు; మా శాఖ పనివిధానం; అనే ఈ మూడు వ్యాసాల సమాహారంలో వుండే సమాచారం చాలా విలువైనది. అవసరమైనదీ కూడా.
డాక్టరు శివరామిరెడ్డిగారు వృత్తి రీత్యా డాక్టరు. ఆయన తనవద్దకు వచ్చిన రోగిని వివరంగా పరీక్షించి రోగానికి మూలాన్ని కనుగొని తగిన మందులిచ్చినట్టు గానే వివిధ విప్లవ సంస్థల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు అధ్యయనం పట్ల వహిస్తున్న అశ్రద్ధను, తప్పుడు పద్ధతులను తెలుసుకొని వివరమైన ప్రిస్క్రిప్షన్ రాసినట్టుగా ఈ పుస్తుకం వుంది.
కమ్యూనిస్టుపార్టీలో పనిచేసే పార్ట్ టైమ్ లేదా పూర్తికాలం కార్యకర్తలు ప్రారంభం నుండి వరుస క్రమంలో ఏ పుస్తకం చదవాలో ఏ క్రమపద్దతిలో చదవాలో యిందులో పేర్కొన్నాడు.చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు.చదివి గాలికి వదిలి వేయడం గాకుండా ప్రతి కార్యకర్త చదివిందీ,తను అర్థం చేసుకొన్నది జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని సూచించారు. ఏ కార్యకర్త లేదా నాయకుడైనా మార్క్సిజం మౌలిక అంశాలను అవగాహన చేసుకోకుండా, వంటపట్టించు కోకుండా విప్లవోద్యమాన్ని బాధ్యతాయుతంగా నడిపించ లేమని స్పష్టం చేసారు.
అధ్యయనం ఎలా చేయాలి? జ్ఞానాన్ని ఎలా సంపాదించు కోవాలి? జ్ఞానం జ్ఞానం కోసమేనా? సమాజమార్పు కోసమా? అనే విషయాల్ని కూడా కొందరి అనుభవాలను జోడించి చెప్పారు. స్టడీసర్కిళ్ళు నిర్వహించడం ద్వారా,రాజకీయ క్లాసులు జరుపుకోవడం ద్వారా,స్వీయ అధ్యయనాన్ని పెంచుకోవడం ద్వారా,వర్గపోరాటాలు, ప్రజాఉద్యమాలు, ఆందోళనలు,సభలు,సమావేశాల్లో పాల్గొనడంద్వారా, సాహిత్యం,సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా,పత్రికలద్వారా తమ సిద్ధాంత పరిజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు.
చాలా మంది కార్యకర్తలు వివిధ విప్లవ సంస్థల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.క్షణం తీరిక లేకుండా నిరంతరం పనిచేస్తుంటారు.దినపత్రికలు చదవడానికి కూడా వారికి తీరికదొరకదు. హడావుడిగా పేపరును పైపైన తిరగేసి తమ పనుల్లో నిమగ్నమౌతారు.కారణాలేమైనా ఇవన్నీ ఆమోదయోగ్యమైనవేనా? ఖచ్చితంగా కాదనీ, ఈ పనిపద్దతుల్ని కార్యకర్తలు సరిచేసు కోవాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం అవసరమని రచయత భావించారు.
పేపరు చవవడానికి కూడా తీరిక దొరకలేదని బాధపడే కార్యకర్తలకు ఈ పుస్తుకంలో అనేక సూచనలున్నాయి. పనిచేయడానికి ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది.చరిత్రలో 18నుండి 20 గం॥లు పనిచేసిన వారిని ఉదహరించి వారు సమయాన్ని ఎంత జాగ్రత్తగా ఎలా ఉపయోగించుకొని తమతమ రంగాల్లో నిష్ణాతులయ్యారో ఈ పుస్తకంలో వివరించారు.
ప్రతి కార్యకర్త పని ప్రణాళికను ఎలా రూపొందించు కోవాలో, దానిని ఖచ్చితంగా ఎలా అమలు పరచాలో ఈ పుస్తకంలో సూచించారు.విప్లవమే వృత్తిగా జీవించే వారికి సమయం వృధా చేసే హక్కులేదు. ప్రతిరోజూ, ప్రతిగంటా,ప్రతినిమిషాన్ని కార్యకర్త ఎలా వినియోగించుకున్నది జాగ్రత్తగా డైరీ రాసుకొని సమీక్షించుకుంటే తమ సమయం ఎక్కడ వృథా అవుతుందో తేలిగ్గానే అర్థమౌతోంది.తన గతాన్ని విశ్లేషించుకొని జాగ్రత్తగా భవిష్యత్ సమయాన్ని వృథా కానివ్వకుండా నివారించు కోవాలని ఈ పుస్తకంలో సూచించారు.
స్వీయ అధ్యనయంతో కొంతమంది కామ్రేడ్స్ ఎంతో పురోభివృద్ధి సాధించారని,జైళ్ళలోనూ,నిర్బంధ సమయాల్లో తమకు మిగిలిన సమయాన్ని అధ్యయనం కోసం వినియోగించుకున్న అనుభవాలు కూడా వున్నాయని దీనిలో పేర్కొన్నారు.కష్టపడి చదివినా అర్థంకావడంలేదని, చదువుతుంటే నిద్రొస్తుందని, వేగంగా చదవలేక పోతున్నామని, కొంతమంది చూపు పుస్తకాల మీద,ఆలోచనలు ఎక్కకెక్కడో తిరుగుతుంటాయని ఫిర్యాదులు చేసే కామ్రేడ్స్ కు సమాధానంగా,గైడుగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.