– ఏడాదిలో 20 మంది మృతి
– లైట్‌ తీసుకుంటున్న మోడీ సర్కార్‌
– వీరమరణం పొందినా పరిహారం చెల్లింపులో మీనమేషాలు
– ఆత్మహత్య చేసుకుంటే అదీ లేదు
– యువతరంతో కేంద్రం చెలగాటం..

ఆర్మీలో నాలుగు రోజులు పని చేసి చనిపోయినా పర్వాలేదు. తమ శవంపై జాతీయ జెండా కప్పితేచాలని వీర జవాన్‌లు కోరుకుంటారు. కానీ అగ్నిపథ్‌ అమలయ్యాక ఈ పరిస్థితి తారుమారైంది. వివిధ కారణాలతో ఏడాదిలో 20 మందికిపైగా అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారంటే.. వారిపట్ల మోడీ సర్కార్‌ ఏవిధంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీరమరణం పొందిన వారికి పరిహారం చెల్లింపులోనూ మీనమేషాలే లెక్కిస్తోంది. దీంతో యువతరం పట్ల కేంద్రం చెలగాటమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధపడి, త్రివిధ దళాలలో చేరేందుకు అనేక మంది యువకులు ఆసక్తి చూపుతుంటారు. రెట్టించిన ఉత్సాహంతో, దేశభక్తిని గుండెల నిండా నింపుకొని యుద్ధభూమికి ఉరకాలని తహతహలాడుతుంటారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులు కేవలం నాలుగేండ్లు మాత్రమే సర్వీసులో ఉంటారు. ఆ తర్వాత వారి కొనసాగింపు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. త్రివిధ దళాలలోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరపాల్సింది పోయి కేవలం నాలుగు సంవత్సరాలకే పరిమితం చేయడం వివాదాస్పదమైంది. అదీకాక కాలపరిమితి ముగియక ముందే అశువులు బాసిన అగ్నివీరుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

గతేడాది అగ్నిపథ్‌ కింద అగ్నివీరుల మొదటి బ్యాచ్‌ సైన్యంలో చేరింది. ఏడాది గడవక ముందే ఏకంగా ఇరవై మంది అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వచ్చాయి. సైన్యంలో చేరిన వారిలో 18 మంది చనిపోయారని, వైమానిక దళంలో చేరిన ఓ వ్యక్తి తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఆగ్రాలో సెంట్రీ డ్యూటీ నిర్వర్తిస్తున్న శ్రీకాంత్‌ కుమార్‌ చౌదరి (22) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన చౌదరి 2022లో వైమానిక దళంలో అగ్నివీర్‌గా చేరాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నట్టు సమాచారం.

విధి నిర్వహణలో చనిపోయినా వివాదం..
ఇక జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ యేడు జనవరిలో జరిగిన మందుపాతర పేలుడు ఘటనలో అగ్నివీర్‌ అజరు సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం కానీ, ప్రోత్సాహకాలు కానీ లభించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై రాహుల్‌ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మధ్య పార్లమెంటులో వాగ్యుద్ధం జరిగింది. అజరు సింగ్‌ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించలేదని రాహుల్‌ మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణను రాజ్‌నాథ్‌ తోసిపుచ్చుతూ విధుల్లో ఉన్న అగ్నివీరులు చనిపోతే ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం అందిస్తోందని చెప్పారు.

పరిహారానికే రెండు మూడు నెలలు
మరణించిన అగ్నివీర్‌ కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందజేయడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఆర్‌కేఎస్‌ భదౌరియా తెలిపారు. సమగ్ర మార్గదర్శకాలు అమలులో ఉన్నందున ఈ జాప్యం తప్పదని ఆయన చెప్పారు. నష్టపరిహారం అందించేందుకు ఓ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని వివరించారు. ‘పోస్ట్‌మార్టం నివేదిక రావాలి. సంఘటనకు సంబంధించిన నివేదిక అందాలి. కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ జరగాలి. పోలీసులు కూడా నివేదిక ఇవ్వాలి. ఈ నాలుగు ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుంది. అగ్నివీర్‌కి అయినా, సాధారణ సైనికుడికి అయినా ఒకటే నిబంధనలు’ అని వివరించారు. నష్టపరిహారం ప్రక్రియ గురించి అగ్నివీరుల కుటుంబాలకు సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. సైనికుడు చనిపోయినప్పుడు బీమాలో కొంత మొత్తాన్ని అతని వారసుడికి అందజేస్తామని చెప్పారు.

అర్హులైన యువత కోసమంటూ…
డ్రై రిక్రూట్‌మెంట్‌ స్పెల్‌ పేరిట 2022 జూన్‌ నెలలో ‘అగ్నిపథ్‌’ను మోడీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 17 ఏండ్ల నుంచి 21 ఏండ్ల మధ్య వయస్సు గల అర్హులైన యువత కోసం ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’గా మార్చేసింది. నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారిని శాంతింపజేసేందుకు మోడీ సర్కార్‌ వయోపరిమితిని 23 ఏండ్లకి పెంచింది.

త్రివిధ దళాల్లో ఉద్యోగమంటే..
త్రివిధ దళాల్లో జీవితకాలం ఉద్యోగం ఉండేది. అన్ని విధాలా సౌకర్యాలుండేవి. సైన్యంలో చేరాక రెగ్యులర్‌ జవాన్లకు ఎలాంటి బెంగ ఉండేది కాదు. మోడీ ప్రభుత్వం రక్షణ రంగంలోకి కార్పొరేట్లను దించింది. నెమ్మదిగా అగ్నిపథ్‌ పేరిట జవాన్ల మనోభావాలను దెబ్బతీసేలా అడుగులేసింది. కేవలం నాలుగేండ్ల వరకే సేవలందించేలా సర్వీసును కుదించేసింది. 15 ఏండ్లపాటు భారత సైన్యంలో సేవలందించేందుకు 23 శాతం మంది అగ్నివీరులు లేదా రిక్రూట్‌లను మాత్రమే ఎంపిక చేసేలా మోడీ బృందం తెచ్చిన స్కీం యువత బతుకుల్ని ఛిద్రం చేస్తోందని.. అగ్నిపథ్‌లో ఎంపికై చనిపోయిన వారి బంధువులు ఆరోపిస్తున్నారు. లక్షలాది భారతీయ యువతకు అగ్నిపథ్‌తో ద్రోహం చేస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రక్షణ విధాన సంస్కరణపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

నిరుద్యోగం పైపైకి..
సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం, గ్రామీణ నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో నాలుగేండ్లలో కనిష్ట స్థాయి 6.4 శాతం నుంచి అక్టోబర్‌లో 7.8 శాతానికి పెరిగింది.ఆ తర్వాత మరింతగా పెరుగుతోంది. వాస్తవానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న ఉపాధిని ఊడగొడుతోంది.

నెలరోజుల్లోనే..
జులైలో రిక్రూట్‌మెంట్లు ప్రకటించిన నెల రోజుల్లోనే 3,000 అగ్నివీరుల పోస్టుల కోసం ఎయిర్‌ఫోర్స్‌కు దాదాపు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అదే సమయంలో, ఇండియన్‌ నేవీకి అదే సంఖ్యలో ఖాళీల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఏండ్ల పాటు భర్తీ చేయకపోవటం వల్లే..
”ఆర్మీలో సంవత్సరాలుగా రిక్రూట్‌ చేయలేదు అని మేజర్‌ జనరల్‌ (డా) యష్‌ మోర్‌ (రిటైర్డ్‌) దీనిని డెస్పరేషన్‌ అన్నారు. శాశ్వత ప్రాతిపదికన ర్యాలీలు ప్రారంభిస్తానంటూ.. చివర్లో అగ్నివీర్‌ను తెరపైకి తెచ్చారు. ఇది సరైన చర్య కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ అమలు తీరుపై పలువురు మాజీ ఉన్నతాధికారులు కూడా మోడీ చర్యను ఆక్షేపిస్తున్నారు.

జాతీయవాదం కాస్త విషాదంగా…
అగ్నివీర్‌ ఔత్సాహికుల ప్రతి అంశం వెనుక జాతీయవాదం, ఆశావాదం ఉంటే.. చివరికి వ్యక్తిగత విరక్తి, నిరాశకు గురవుతోంది. అంతిమంగా విషాదమే మిగులుతోంది.
యువతపై విపరీతమైన ఒత్తిడి..
”మంచి వేతనాలతో స్థిరమైన ఉపాధిని పొందేందుకు భారత యువత ఎదుర్కొంటున్న విపరీతమైన ఒత్తిడే ఈ ఆత్మహత్యలకు ప్రతిబింబం” అని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ విక్రమ్‌ పటేల్‌ అన్నారు.

చేరుదామనే ఆశతో..
సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల మాదిరిగానే, సైన్యానికి శిక్షణ అనేది స్ప్రింట్‌ కాదు. మారథాన్‌ అని విక్రాంత్‌కు తెలుసు. మామయ్య మిలటరీలో చేస్తుండటంతో..మేనల్లుడికి జవానులు వేసుకునే దుస్తులు, టోపీలు ఇచ్చేవారు. అవి అతన్ని అగ్నివీర్‌లో చేరటానికి ప్రేరేపించాయి. విక్రాంత్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలలో 65 శాతం స్కోర్‌ చేశాడు. 2018లో సహరన్‌పూర్‌లో తన మొదటి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం నమోదు చేసుకున్నాడు. ”ఎవరో తన కాలు లాగడం వల్ల కింద పడ్డానని చెప్పాడు. అతను రేసును పూర్తి చేయలేకపోయాడు, ”అని అతని తండ్రి గుర్తుచేసుకున్నాడు. ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీలు..
పార్లమెంట్‌లో అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్‌ మాట్లాడుతూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లో 1.35 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ దరఖాస్తుదారుల సంఖ్య అనూహ్యంగా ఉన్నదని వివరించారు.

ఉద్యోగాల్లేక.. అగ్నిపథ్‌ కోసం క్యూ..
సెప్టెంబర్‌ 2022 నాటికి 96 అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించారు. 40,000 పోస్టుల కోసం 35 లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇంత టఫ్‌ పోటీలోనూ ఎంపికయ్యాక కూడా.. అగ్నివీరులు నిండు జీవితాలను పణంగా పెడుతుండటం గమనార్హం.

ఆత్మహత్య చేసుకుంటే…
గతేడాది అక్టోబర్‌ 11న అగ్నివీర్‌ అమృత్‌పాల్‌ సింగ్‌(19) జమ్మూలో చనిపోయాడు. అయితే అతనికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై విమర్శలు వచ్చాయి. అమృత్‌పాల్‌ తనకు తాను గాయం చేసుకోవడం వల్లే చనిపోయాడని సైన్యం ఆ తర్వాత వివరణ ఇచ్చింది. ఆత్మహత్య చేసుకున్న వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగవని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత అగ్నివీర్‌ (ఆపరేటర్‌) గవాతే అక్షరు లక్ష్మణ్‌ గతేడాది అక్టోబర్‌ 22న సియాచిన్‌లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయాడు. లక్ష్మణ్‌ కుటుంబానికి గ్రాట్యుటీ, పెన్షన్‌, ఇతర ప్రయోజనాలేవీ రాలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అగ్నిపథ్‌ పథకం సైనికులకు అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.