ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముందూ, ఆ తర్వాతా కూడా, అన్ని పార్టీల నోళ్ళలోనూ, ఆ పార్టీలతో ఏకీభవించే మేధావుల రాతల్లోనూ, బాగా నానుతున్న మాట ‘రాజ్యాంగం.’
‘రాజ్యాంగానికి బద్ద వ్యతిరేకులు మోదీ, షాలు! వాళ్ళు రాజ్యాంగాన్ని నాశనం చెయ్యడానికి చూస్తే, మేము ఒప్పుకోము!’ – రాహుల్‌గాంధీ.
‘ఒకప్పుడు ఎమర్జెన్సీ పెట్టి, రాజ్యాంగాన్ని అవమానించిన వారే, ఈ నాడు రాజ్యాంగం పేరుతో నాట్యమాడుతున్నారు!’ – నరేంద్ర మోదీ.
మొత్తానికి అన్ని పార్లమెంటరీ పార్టీల వారూ, రాజ్యాంగం పట్ల తమకున్న విధేయతని గొంతెత్తి చాటుకుంటున్నారు. మోదీ అయితే, కొత్త పార్లమెంటులో, రాజ్యాంగం పుస్తకం ముందు వంగి నమస్కరించడం తెలిసిందే. రాహుల్‌గాంధీ చేతిలో మత గ్రంథం పట్టుకున్నట్టు రాజ్యాంగం పుస్తకాన్ని చేత్తో పట్టుకుని ఊపుతూ కనబడ్డ దృశ్యం కూడా తెలిసిందే. ఇంతకీ, ఆ రాజ్యాంగం ఏమి చెపుతుందో, దేశంలోని కోట్లమంది శ్రామిక ప్రజల ప్రయోజనాల దృష్టితో చూడాలి.
కొంచెం తేలికైన మాటల్లో చెప్పుకోవాలంటే, రాజ్యాంగం అనేది ప్రభుత్వమూ పౌరులూ అనుసరించాల్సిన నియమావళి. పౌరులకూ, ప్రభుత్వానికీ వున్న హక్కులేమిటో, విధులేమిటో వివరించే సూత్రాల పత్రం అది. పౌరులు అనేవాళ్ళు ఏ దేశంలో అయినా, మూసపోసినట్టు ఒకే రకమైన పరిస్తితులలో వుండరు. వేరు వేరు వర్గాలుగా వుంటారు. అయితే, ప్రభుత్వం అనేది అన్ని వర్గాల పౌరులకూ ప్రతినిధిగా వుంటుందా? అలాంటప్పుడు రాజ్యాంగం మాత్రం అన్ని వర్గాల ప్రయోజనాలనూ కాపాడుతుందా? ఈ విషయాలు తెలియాలంటే, భారత రాజ్యాంగం ఎలా తయారైందో చూడాలి.
భారత రాజ్యాంగాన్ని తయారు చేయించినదీ, ఆమోదించినదీ రాజ్యాంగ సభ. అంటే, ఆ నాటి పార్లమెంటులాంటిది. కానీ, ఆ సభలోని సభ్యులు, ఇప్పటిలాగా, దేశంలోని ఓటు హక్కువున్న పౌరులందరూ ఓట్లు వెయ్యగా ఎన్నికైనవాళ్ళు కాదు. జనాభాలో నాలుగో వంతు మందికి మాత్రమే వుండిన ఓటు హక్కు ద్వారా, స్తానిక శాసనసభలకు ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఓటు వెయ్యగా రాజ్యాంగ సభ్యులయ్యారు. నేరుగా ఎన్నిక కానివారే కాక, ఏ రకమైన ఎన్నికా లేకుండానే, రాజాస్తానాల ప్రతినిధులు 96 మంది (మొత్తం సభ్యుల్లో పావు వంతు మంది) కూడా కూచుని, రాజ్యాంగాన్ని ఆమోదించారు. అంటే, ఈ రాజ్యాంగం దేశ ప్రజలంతా ఓట్లు వెయ్యగా కలిసి ఏర్పర్చుకున్నది కాదు; భారతదేశపు పాలక వర్గాలు తయారు చేయించుకున్నది మాత్రమే! కానీ, ‘భారత ప్రజలమైన మేము…’ అని రాజ్యాంగంలోని మొట్టమొదటి వాక్యం మొదలవుతుంది. రాజ్యాంగం ఎలా తయారైనప్పటికీ, దానిలో వున్న నియమాలు, శ్రామిక ప్రజల ప్రయోజనాలను కాపాడేలా వున్నాయో లేవో చూడాలి. కొన్ని వందల పేజీల్లో వున్న రాజ్యాంగంలోని అన్ని విషయాలనూ ఇక్కడ చూడలేము. మచ్చుకి కొన్ని మాత్రమే చూడగలం.
రాజ్యాంగం మీద గౌరవం లేకుండా, కాంగ్రెసు పార్టీ ఎమర్జన్సీని విధించిందని బీజేపీ విమర్శ. కానీ, రాజ్యాంగం లోనే వున్న 352వ సూత్రం ప్రకారం, ప్రత్యేక పరిస్తితుల్లో ఎమర్జన్సీని విధించడానికి రాజ్యాంగమే వీలు కల్పించింది. ఇదంతా, పాలకవర్గాల వారు ముందు చూపుతో పెట్టుకున్న వెసులుబాటు!
రాజ్యాంగాన్ని మెచ్చుకునేవారు చెప్పే విషయం, ఈ రాజ్యాంగం ప్రసాదించిన కొన్ని హక్కులు: అభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛా, సమావేశం అయ్యే స్వేచ్ఛా, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛా. ఇదే రాజ్యాంగంలో, 1963లో చేసిన సవరణ ప్రకారం ఈ హక్కుల్ని కత్తిరించే అధికారాన్ని కూడా రాజ్యాంగమే ప్రభుత్వానికి ఇచ్చింది. ఇది కూడా పాలకవర్గాలు గడుసుగా పెట్టుకున్న నిబంధన! రాజ్యాంగంలో 23వ, 24వ సూత్రాలు దోపిడీ వ్యతిరేక హక్కుని కల్పించాయని చెపుతారు, రాజ్యాంగ సమర్ధకులు. కానీ, ఈ రాజ్యాంగం ప్రకారం, ‘దోపిడీ’ అంటే శ్రమ దోపిడీ అని కాదు. ఆ సూత్రాల అర్ధం, శ్రమ చేయించుకుని జీతం ఇవ్వకపోవడం మాత్రమే దోపిడీ కిందకి వస్తుంది. అంతేగానీ, అదనపు విలువ రూపంలో, జరిగే శ్రమ దోపిడీ గురించి కాదు. కాబట్టి, ఈ పూత, శ్రమ దోపిడీ అనే రాకాసి పుండుని మార్చజాలదు.
47వ సూత్రం ప్రకారం, ప్రజలకి పోషకాహారం అందేలా ప్రభుత్వం చూడాలి. ప్రజల్లో కొందరికి సరైన ఆహారం అందకపోవడానికీ, కొందరికి పొట్టపగిలేలా తినగలిగినంత ఆహారం ఉండడానికీ, కారణం ‘దోపిడీ స్వంత ఆస్తే’ అనే సంగతి రాజ్యాంగం రాసినవాళ్ళకి తెలీదా? ఉన్నవాళ్ళూ–లేనివాళ్ళూ అనే నిజం కళ్ళముందు కనపడలేదా? కాబట్టి, ప్రజలకి పోషకాహరం అందేలా చూడమని చెప్పడం వల్ల దారిద్ర్యం అనే రాకాసి పుండు మానదు.
అందరికీ సమానావకాశాలు అని 17వ సూత్రం చెపుతూ వుంటే, 18వ సూత్రమేమో చాతుర్వర్ణాల లాగా, 4 రకాల బిరుదుల్ని ప్రసాదించింది. దేశ పౌరుల్లో కొందరు పద్మశ్రీలు, పద్మ భూషణులు, పద్మ విభూషణులు, భారత రత్నలు. మిగతా అందరూ ఉత్తుత్తి మనుషులు!
బాల కార్మికుల శ్రమని నిషేదించడానికి 24వ సూత్రం. భూములూ, ఫ్యాక్టరీలూ, గనులూ, వగైరా ఆస్తులున్న కుటుంబాలలో బాలలెవరూ ఇతరుల ఇళ్ళల్లో, పని స్తలాలలో శ్రమలు చేయడానికి ఎందుకు వెళ్ళరో, రాజ్యాంగ రచయితలకు కారణం తెలియలేదా? కాబట్టి, ఈ సూత్రం కూడా, బాల కార్మిక వ్యవస్త అనే రాకాసి పుండును మాన్పదు.
పౌరులకి తగిన జీవనాధారం కల్పించాలని 39వ సూత్రం. రాజ్యాంగ రచయితలకీ, రాజ్యాంగ సభ సభ్యులకీ అవసరానికి మించిన జీవనాధారం ఎందుకు వుందీ, ఇతరులకు ఎందుకు లేదూ? అసలు జీవనాధారాలకు వీలునిచ్చే భూమి వంటి సాధనాలుగానీ, ఉద్యోగాలుగానీ కోట్లాదిమందికి ఎందుకు లేవు? అనే ప్రశ్నే వేసుకోలేదు రాజ్యాంగ రచయితలు!
ఎస్సీ, ఎస్టీల మీద జరిగే ‘అత్యాచారాల’ నిరోధించే చట్టం ఒకటి వుంది. కానీ, మెజారిటీ కేసుల్లో దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. కంచికచర్లా, కారంచేడూ, చుండూరూ ఘటనలు మనకి తెలుసు. దేశ చరిత్రలో అత్యంత కిరాతకమైన అత్యాచారమూ, హత్యాకాండా, మహారాష్ట్ర్లలోని ఖైర్లాంజీలో జరిగింది. ఆ హంతకులకి ఏమీ జరగలేదు. ఈ దురంతం గురించి, ‘ఆంధ్రజ్యోతి’లో, ‘వివిధ’ పేజీలో, గుంటూరు ఏసుపాదం అనే కవి ఒక గొప్ప వచన కవిత రాశాడు. దానిలో, మొట్టమొదటి పాదంలోనే, ‘రాజ్యాంగం పూతలకు, రాకాసి పుండ్లు మానవు…’ అంటారు ఏసుపాదం గారు. పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, దళిత బహుజనుల మీదా, ఆదివాసీల మీదా జరిగే దాడులూ… ఇలాంటి సమస్యలన్నీ ‘రాకాసి పుండ్లే! (కాన్సర్ పుండ్లే)’.
అందుకే, పార్లమెంటరీ రాజకీయాలలో నమ్మకం లేని వారు, ఇప్పుడున్న దానిని ‘శ్రమ దోపిడీకి వీలునిచ్చే రాజ్యాంగం’ అని భావించి, ‘దీన్ని తిరస్కరించి, కొత్తదాన్ని రాసుకుందాం’ అంటారు. గుంటూరు ఏసుపాదం, తన అద్భుత కవితలో చెప్పినట్టు, ‘కులాతీత, మతాతీత మానవుడు/ మా‘నవ రాజ్యాంగాన్ని’ రచిస్తాడు/ ఆగామి యుగాన్ని అనుశాసిస్తాడు!’ ఆ ‘నవ’ రాజ్యాంగం ఎలా ఉంటుందో, కవి చెప్పకపోయినా, ఇప్పుడున్నదానికి పూర్తి వ్యతిరేకంగానూ, భిన్నంగానూ వుంటుంది. సామాజిక రాచపుండ్లకి వీలునివ్వనిదిగా వుంటుంది. అంటే, శ్రమ దోపిడీని అనుమతించనిదిగా వుంటుంది. పౌరులందరూ, ఇతరుల శ్రమని దోచేవారిగా కాక, తాము కూడా శ్రమలు చేసే వారిగా నిర్దేశిస్తుంది. కులాలుగా గడ్డకట్టించిన అసమాన శ్రమవిభజన స్తానంలో, నూతన సమాన శ్రమ విభజనను ప్రవేశపెడుతుంది. అలాంటి రాజ్యాంగం రూపొందాలంటే, ఇప్పుడున్న రాజ్యాంగం స్వభావాన్ని, శ్రామికవర్గ దృక్పధంతో పరిశీలించే పని జరగాలి. అంతేగానీ, దీనికే, ‘పూతలు’ (సంస్కరణలు) పూసే పనిలో మనం సమయం వృధా చెయ్యకూడదు. ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడే మేధావులు!