☘️

0
107

49 సం. ల కిందట ఎమెర్జెన్సీ విధించిన సందర్బంగా : ఒక మహిళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో ఒక మహిళ పై జరిగిన దారుణ దమనకాండ.

చదవండి:

” స్నేహలతా రెడ్డి – ఎమెర్జెన్సీ లో రాలిపోయిన ఆపన్నుల స్నేహ హస్తం”

స్నేహాలతా రెడ్డి భారతీయ సినీ నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్త. ఈమె ఇంగ్లీష్, కన్నడ, నాటక రంగాలు మరియు కన్నడ సినిమా రంగాలలో రాణించారు.

ఈమె తన తొలి రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారంటే ఈమెకు ఎంత కోపం అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ కుటుంబంలో జన్మించినా తిరిగి పూర్తి భారతీయతను స్వీకరించి భారతీయ సంప్రదాయ దుస్తులను, బొట్టును గర్వంగా ధరించేవారు.

ఈమె పట్టాభిరామి రెడ్డి అనే రచయిత, దర్శకుడిని పెళ్లి చేసుకుంది. సోషలిస్ట్ రాం మోహన్ లోహియా అభిమాని.

అనేక పేరున్న ఆంగ్లనాటకాలలో నటించారు. ముఖ్యంగా యు.ఆర్.అనంతమూర్తి రాసిన, తన భర్త దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం “సంస్కర” లో స్నేహలత జాతీయ దృష్టికి వచ్చింది. ఈ చిత్రం 1970 లో జాతీయ అవార్డును గెలుచుకుంది.

స్నేహలత మరియు ఈమె భర్త అత్యవసర పరిస్థితి విధింపు కు ,నిరంకుశ ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె ట్రేడ్ యూనియన్ నాయకుడు, నిఖార్సయిన సోషలిస్టు మరియూ రాజకీయవేత్త జార్జ్ ఫెర్నాండెజ్ సన్నిహితురాలు.

బరోడా డైనమైట్ కేసులో ఈమెకు కూడా పాత్ర ఉంది అని చెప్పి 1976లో మే నెల 2వ తేదీన అరెస్టు చేశారు. జార్జ్ ఫెర్నాండెజ్ తో సహా మరో 24 మంది నిందితుల పేర్లు తుది చార్జిషీట్‌లో ఉన్నా స్నేహలత పేరు మాత్రం పేర్కొనబడలేదు. ఆమెను కేవలం ‘”సహచారి” అని మాత్రమే పేర్కొని దోషిగా పరిగణించారు.

ఈమెను బెంగుళూరు సెంట్రల్ జైలులో ఎటువంటి విచారణ లేకుండా ఎనిమిది నెలలు నిర్బంధించారు. సాధారణ కరుడుగట్టిన నేరస్తులపై ప్రయోగించిన హింసాత్మక పద్ధతులను అన్నింటినీ ఈమెపై ప్రయోగించారు. జైల్లో అతి దారుణంగా హింసకు గురిచేశారు. ఈమెకు దీర్ఘకాలంగా ఉబ్బసం ఉన్నప్పటికీ ఈమెకు సక్రమంగా చికిత్స అందించక పోవడంతో రెండు సందర్భాలలో కోమాలోకి వెళ్ళింది. ఎటువంటి తీవ్ర ఆరోపణలు లేకపోయినా ఈమెను ఏకాంత నిర్బంధంతో ఉంచారు. దీనితో అసలే బలహీనంగా ఉన్న ఈమె ఆరోగ్యం మరింత దిగజారింది.

జైలులో ఉంచినా ఆమె పోరాట పటిమ తగ్గలేదు. స్త్రీ నిందితులను జైలుకు రాగానే అందరి ముందూ నగ్నంగా పరీక్షలకు లోను చేయడం ఈమె గట్టిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై మహిళా నిందితులు తిరగబడాలి అని పిలుపు ఇచ్చి చివరకు ఆ జైలులో ఈ అమానవీయమైన పద్ధతి ఆపి వేయించగలిగారు.

ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో స్నేహలత చివరికి జనవరి 15, 1977 న పెరోల్‌పై విడుదలైంది. కానీ జైల్లో ఈమె అనుభవించిన నరకం, సరి అయిన వైద్య సదుపాయాలు లభించకపోవడంతో ఆమె పెరోల్ విడుదలైన కొద్ది రోజులకే 1977 జనవరి 20 న మరణించింది. అత్యవసర పరిస్థితుల దారుణాలకు బలి అయిన మొదటి అమరవీరులలో ఆమె ఒకరు.

బీజేపీ సీనియర్ నేత L.K. అద్వానీ తన జీవిత కథలో ఈమె గురించి ప్రస్తావించారు.

స్నేహలత జైలు శిక్ష అనుభవిస్తున్న అదే జైలులో ఉన్న మధు దండవతే తన జ్ఞాపకాలులో వ్రాస్తూ…

“నేను రాత్రి పూట నిశ్శబ్దం లో స్నేహలత సెల్ నుండి వచ్చే యొక్క అరుపులు నేను వినలేకపోయేవాడిని” అని.

దురదృష్టం ఏమిటంటే దేశానికి ఒక మహిళ ప్రధానిగా ఉండగా ఇటువంటి సంఘటన జరగడం.

పాతవి తవ్వకండి అంటారు. కానీ ఇటువంటి కధలు ఈ తరానికి తెలియాలి అంటే తవ్వి బయటకు తీయాలిసిందే.
లేకపోతే గొప్ప ప్రజాస్వామ్య వాద కుటుంబం గా పేరు కొట్టేసిన ఆ కుటుంబ దాస్టీకాలు ఈ తరానికి తెలియాలి
అలాగే ఇటువంటి విషయాలు బయటకు రాకపోతే స్నేహాలత వంటి వారి త్యాగాలు ఈ తరానికి తెలియకుండా మరుగున పడిపోతాయి

ఇటువంటి ఎందరో బలిదానాల వల్ల ఇందిరా నిరంకుశ పాలన పోయి మళ్లీ భారత ప్రజలకు స్వేచ్చా స్వాతంత్రాలు లభిచాయి.

         ...చాడా శాస్త్రి...