సామాజిక కూర్పుతో అఖిలేశ్‌ సక్సెస్‌

0
81

– నాంచారయ్య మెరుగుమాల

‘కేంద్ర ప్రభుత్వానికి దారి ఉత్తర్‌ప్రదేశ్‌ మీదుగా పోతుంది’ అనేది భారత రాజకీయాల్లో పాతుకుపోయిన నానుడి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ చాలాకాలం యూపీలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న పార్టీలే న్యూఢిల్లీలో ఆధిపత్యం చెలాయించేవి. అయితే ఈసారి కూడా యూపీలో ఎక్కువ సీట్లు ఆశించిన బీజేపీ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన ‘సామాజిక కూర్పు’తో ఆ పార్టీ యూపీలో డీలా పడింది.

మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో యూపీలో 80 సీట్లుండగా ఉత్తరాఖండ్‌ అవతరణకు ముందు 85 ఉండేవి. పాతిక కోట్ల జనం ఉన్న యూపీలో గత పదేండ్లలో తిరుగులేని ఆధిపత్యం సాధించిన బీజేపీ 2024 ఎన్నికల్లో చతికలపడింది. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా వరుసగా 71, 62 స్థానాలను కాషాయపక్షం గెలుచుకున్నది. 18వ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ బలం రాష్ట్రంలో 33 సీట్లకు పడిపోయింది. ఎన్డీయే భాగస్వామ్యపక్షం అప్నాదళ్‌కు ఒక సీటు లభించింది. రాష్ట్రంలో బీజేపీ బలం 2019 నాటికి 9 సీట్లు తగ్గిపోగా, 2014తో పోల్చితే ఇప్పుడు 38 సీట్లు తగ్గాయి. గతంలో అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచిన మూడు సందర్భాల్లోనూ బీజేపీకి యూపీలో రెండుసార్లు మెజారిటీ సీట్లు దక్కాయి. 1996, 98, 99లో బీజేపీకి యూపీలో వరుసగా 52, 57, 29 సీట్లు లభించాయి. 2004లో కేంద్రంలో అధికారం కోల్పోవడానికి ఐదేండ్ల ముందు జరిగిన 1999 మధ్యంతర ఎన్నికల నాటికి బీజేపీ యూపీలో బలహీనమైందని ఈ లెక్కలు చెప్తున్నాయి.

కేంద్రంలో 10, రాష్ట్రంలో 7 ఏండ్ల కాషాయ పాలనతో బలహీనమైన బీజేపీ: బీజేపీ బలం 2014 నాటి 71 నుంచి 33 సీట్లకు దిగజారడానికి రాష్ట్రంలో అత్యంత బలమైన ప్రాంతీయ పక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఒక్కటే కారణం కాదు. బీజేపీ నేతృత్వంలో పదేండ్లుగా కేంద్రంలో, ఏడేండ్లుగా యూపీలో కొనసాగుతున్న పాలనపై జనంలో ఉప్పొంగిన వ్యతిరేకత కాషాయపక్షాన్ని కుంగదీసింది. బీజేపీ ‘హిందుత్వ’ అజెండాకు కేంద్రబిందువైన అయోధ్యలోనే (ఫైజాబాద్‌ సీటు) ఎస్పీ అభ్యర్థి అవధేశ్‌ ప్రసాద్‌ చేతిలో బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్‌ ఓటమి పాలు కావడం కాషాయపక్షం బలహీనతకు అద్దం పడుతున్నది. రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన లల్లూసింగ్‌ను దళితుడైన అవధేశ్‌ 55 వేల ఓట్ల తేడాతో ఓడించడం నిజంగా గొప్ప సంచలనం.

ఈ ఎన్నికల్లో ఎస్పీకి అత్యధికంగా 37, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 6 సీట్లు లభించాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన ఏడాదే ఇక్కడ బీజేపీ ఎదురుదెబ్బలు తినడం, రాష్ట్రంలో దాని ఎంపీ సీట్లు 2014 ఫలితాలతో పోల్చితే సగానికి పైగా తగ్గిపోవడం మారుతున్న గాలికి సంకేతం. కిందటిసారి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ ఈసారి కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇచ్చి 62 సీట్లలో పోటీ చేయడమేగాక (ఒక సీటులో తృణమూల్‌ అభ్యర్థికి మద్దతు) అభ్యర్థుల ఎంపిక మొదలు అనేక ప్రయోగాలు చేశారు.

‘అగ్నివీర్‌’ పథకంపై వ్యతిరేకత, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలతో పాటు ఎస్పీ అభ్యర్థుల సామాజిక కూర్పు (సోషల్‌ ఇంజినీరింగ్‌) బీజేపీ ఓటమికి దారితీశాయి. తాను అధికారంలో ఉన్నప్పటి విధానాలు, గత ఎన్నికల్లో టికెట్లు కేటాయించిన తీరు వల్ల యూపీలో ఎంవై (ముస్లింలు, యాదవుల) పార్టీ అని ముద్రపడిన ఎస్పీ ఇమేజిని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ కొత్త సామాజిక కూర్పుతో మార్చివేసే ప్రయత్నంలో సఫలమయ్యారు. తన 62 సీట్లలో ఓబీసీలకు 32, దళితులకు 16, అగ్రవర్ణాలకు 10, ముస్లింలకు 5 సీట్లు ఇచ్చారు. దాదాపు పది పన్నెండు ఎంపీ సీట్లు యాదవులకు కేటాయించే ఆనవాయితీకి అఖిలేశ్‌ స్వస్తి చెప్పి ఈసారి ఐదు టికెట్లే ఇవ్వడం అభిలషణీయ మార్పు.

‘పిఛడే దళిత్‌ అల్ప సంఖ్యక్‌’ (పీడీఏబీసీ, ఎస్సీ, మైనారిటీ)అనే నినాదంతో ఈ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా బీజేపీ పాలక ద్వయం నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఇప్పటివరకూ అనుసరిస్తున్న యాదవేతర బీసీలు, జాటవేతర (మాయవతి కులమైన చర్మకారుల పేరు జాటవులు) ఎస్సీల వ్యూహాన్ని శక్తిమంతంగా తిప్పికొట్టగలిగారు ఎస్పీ అధినేత. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. పొత్తు విఫలమైంది. ఈసారి ఓట్ల బదిలీ రెండు పక్షాల మధ్య సజావుగా జరిగి కూటమి విజయానికి దోహదం చేసింది. బీసీల్లో బాగా వెనుకబడిన కులాలవారికే గాక, అన్నివిధాలా పైకొచ్చిన బీసీ కుర్మీలకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎస్పీ టికెట్లు లభించాయి. కేవలం 3.5 నుంచి 4 శాతం జనాభా ఉన్న కుర్మీలతోపాటు, మాయావతి వర్గమైన ఎస్సీ జాటవులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎస్పీ కాంగ్రెస్‌ కూటమి వైపు మొగ్గడంతో బీజేపీ రథానికి బ్రేకులు పడ్డాయి.

అయోధ్య పరిధిలోకి వచ్చే ఫైజాబాద్‌ స్థానంలో రెండుసార్లు వరసగా గెలిచిన బీజేపీ రాజపుత్‌ ఎంపీ లల్లూసింగ్‌పై కోరీ అనే ఎస్సీ కుటుంబంలో పుట్టిన 77 ఏండ్ల అవధేశ్‌ ప్రసాద్‌ను నిలబెట్టి గెలిపించడం అఖిలేశ్‌కు కలిసొచ్చిన వ్యూహం. పశ్చిమ యూపీలోని మీరట్‌లో ‘రామాయణ్‌’ సీరియల్‌ రాముడు అరుణ్‌ గోవిల్‌ (వైశ్యుడు)పై దళిత కుటుంబంలో పుట్టిన నగర మాజీ మేయర్‌ సునీతా వర్మను ఎస్పీ నిలబెట్టి దాదాపు ఓడించినంత పని చేయగలిగింది. సునీతను అరుణ్‌ గోవిల్‌ కేవలం పది వేల ఓట్ల తేడాతోనే ఓడించగలిగారు. అంటే జనరల్‌ స్థానాల్లో ఎస్పీ తరఫున పోటీ చేసిన దళిత అభ్యర్థులు సాధించిన విజయాలు మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ పాలనపై యూపీ జనంలో ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పడమే గాక ఉత్తరాదిన వస్తున్న రాజకీయ, సామాజిక పరిణతికి ఇవి అద్దం పడుతున్నాయి. పశ్చిమ యూపీ నిన్నమొన్నటి వరకూ బీజేపీకి కంచుకోటగా నిలిచింది. అలాంటిది అక్కడి మొత్తం 26లో బీజేపీ ఈసారి కేవలం 13 సీట్లు నిలబెట్టుకోగలిగింది.

ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలోని ఎస్సీలైన జాటవులు, వ్యవసాయకులమైన జాట్లు (జాట్‌ నేత, ఆర్‌ఎల్డీ అధినేత జయంత్‌ చౌదరీతో పొత్తు ఉన్నాగాని), రాజపుత్రులు, ఇతర కులాల ఓటర్లు బీజేపీకి దూరంగా జరిగి ఎస్పీ కూటమికి అత్యధిక స్థానాలు అందించారు. 26 మంది బీజేపీ సిటింగ్‌ సభ్యుల పరాజయం: ఇప్పటికే అనేకసార్లు గెలిచిన బీజేపీ సిటింగ్‌ సభ్యులు జనాదరణ కోల్పోవడంతో వారిలో 26 మంది ఓడిపోయారు. అభ్యర్థుల ఎంపిక కూడా బీజేపీ కొంప ముంచింది.

‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’, ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ వంటి నినాదాలు బీజేపీ డొల్లతనాన్ని బయటపెట్టాయి. నిజంగా 400 సీట్లు గెలిస్తే మోదీ సర్కార్‌ దేశంలో ఎస్సీ, బీసీల కోటాలు రద్దుచేస్తుందని, రాజ్యాంగం రూపు రేఖలను గుర్తుపట్టలేనంతగా మార్చేస్తుందని యూపీ ప్రజానీకం భయపడి బీజేపీని సాధ్యమైనన్ని చోట్ల ఓడించారు. యూపీలో వరుసగా 2014, 2019 లోక్‌సభ, 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదం చేసిన సంక్షేమ పథకాల గురించి ఈ ఎన్నికల్లో అరిగిపోయిన రికార్డు మాదిరిగా ఎంత ప్రచారం చేసినా ఓటర్లకు ఎక్కలేదు. ముస్లిం లేదా ఇస్లాం అనే పేరెత్తకుండా బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధిపొందడానికి పన్నిన వ్యూహం కూడా పనిచేయలేదు.

యూపీ ప్రాధాన్యం గుర్తించిన బీజేపీ 2014 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ప్రధాని అభ్యర్థి మోదీని గుజరాత్‌ నుంచే గాక రాష్ట్రంలోని వారణాసి నుంచి రంగంలోకి దింపి గత పదేండ్లుగా రాజకీయంగా ప్రయోజనం పొందింది. ఎన్నెన్నో పాత కట్టడాలు, ఇళ్లు కూలగొట్టి కాశీ విశ్వనాథ ఆలయానికి కొత్త సౌకర్యాలు సమకూర్చడంతోపాటు అయోధ్యలో బాలరాముడి గుడిని ఆరంభించినప్పటికీ వారణాసి ఎంపీగా ఉంటూ యూపీ ‘ప్రధాని’గా కనపడాలని చేసిన మోదీ ప్రయత్నాలు 2024లో బెడిసికొట్టాయి.

ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీకి, పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ తో పొత్తు కన్నా కూడా బీజేపీ లోపాలు, వైఫల్యాలే 10 సంవత్సరాల్లో దాని బలాన్ని యూపీలో 71 నుంచి 33 ఎంపీ సీట్లకు తీసుకొచ్చాయని చెప్పవచ్చు.

పశ్చిమ యూపీలోని మీరట్‌లో ‘రామాయణ్‌’ సీరియల్‌ రాముడు అరుణ్‌ గోవిల్‌ (వైశ్యుడు)పై దళిత కుటుంబంలో పుట్టిన నగర మాజీ మేయర్‌ సునీతా వర్మను ఎస్పీ నిలబెట్టి దాదాపు ఓడించినంత పని చేయగలిగింది. సునీతను అరుణ్‌ గోవిల్‌ కేవలం పది వేల ఓట్ల తేడాతోనే ఓడించగలిగారు. అంటే జనరల్‌ స్థానాల్లో ఎస్పీ తరఫున పోటీ చేసిన దళిత అభ్యర్థులు సాధించిన విజయాలు మోదీ, సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ పాలనపై యూపీ జనంలో ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పడమే గాక ఉత్తరాదిన వస్తున్న రాజకీయ, సామాజిక పరిణతికి ఇవి అద్దం పడుతున్నాయి.