నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

ఐసా మాజీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్యే సందీప్ సౌరవ్

కేంద్ర ప్రభుత్వ అడుగులకు రాష్ట్రం వత్తాసు

విద్య రంగానికి భారీగా నిధుల కోత

ఐసా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసెన్ జిత్

నగరంలో భారీ ర్యాలీ, విద్యార్థి గర్జన సభ..

నిజామాబాద్:

విద్యా కాషాయకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (ఐసా) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పాలిగంజ్ (బీహార్ రాష్ట్రం) ఎమ్మెల్యే కామ్రేడ్ సందీప్ సౌరవ్ అన్నారు. 12, 13 తేదీలలో జరగుతున్న ఐసా బహిరంగ సభ, రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బసవ గార్డెన్ లో జరిగిన తెలంగాణ విద్యార్థి గర్జన బహిరంగ సభ సంఘం జిల్లా కార్యదర్శి జ్వాల అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సందీప్ సౌరవ్, ఐసా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసెన్ జిత్ హాజరై ప్రసంగించారు.

నూతన విద్యా విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యారంగ కేంద్రీకరణ, ప్రైవేటీకరణ, కాషాయీకరణ విధానాలను ఐసా నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలులో కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తుతుందని విమర్శించారు. విద్యారంగానికి గత కేటాయింపులతో పోలిస్తే 60 శాతం నిధుల కోత విధించారని దీంతో విద్యారంగం నిర్వీర్యం అవుతుందని తెలిపారు. యూనివర్సిటీలను, ప్రభుత్వ విద్యను లేకుండా చేసి నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని, విద్యా హక్కును కాల రాస్తున్నారని తెలిపారు. విద్య, ఉపాధి పాలకుల కనీస బాధ్యత అని, దానిని అందించేందుకు నిరాకరించడం దుర్మార్గమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మనువాద పాలకులు తిరస్కరిస్తున్నారని, దానికి వ్యతిరేకంగా ఐసా పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించే గొంతుకలపై నిరంతరం దాడులు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. అశాస్త్రీయ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నారని, పుక్కిటి పురాణాలను, మనువాద భావజాలాన్ని పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారని తెలిపారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ నియామకాలు చేపట్టాలని, పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఐసా నేతలు డిమాండ్ చేశారు. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ఐసాను బలోపేతం చేయాలని, భవిష్యత్తులో బలమైన ఉద్యమాలను నిర్మించాలని ఆయన అన్నారు. సందీప్ సౌరవ్, ప్రసెన్ జిత్ ప్రసంగాలను ఉదయ్ కిరణ్ తెలుగులో అనువదించి మాట్లాడారు. విద్యార్థి అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించి సభను ప్రారంభించారు. సభ ప్రారంభానికి ముందు వినయక చౌరస్తా నుంచి బసవ గార్డెన్ వరకు భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, రాష్ట్ర నాయకులు ఉదయ్ కిరణ్, వీరు నాయక్, ఐసా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, అల్లి సాగర్, మేఘన, రుచిత, క్రాంతి, రాజు, వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు, 12 వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.