రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్‌ కాల్‌’ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ రావు.

వ్యవసాయ అభివృద్ధి బాగా ఉన్నది, ఆహార ఉత్పత్తి పెరుగుతున్నది అని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలోగానీ, ఇటు కేంద్ర బడ్జెట్లోగానీ ఎటువంటి ప్రస్తావనా చేయకపోగా, వారి సమస్య పరిష్కారానికి తగిన స్పందన కనబరచలేదు.

భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలు, పెరుగుతున్న పంట ఖర్చులు వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24 ఆర్థిక సర్వే కూడా ఇంచుమించు ఇదే మాట చెప్పింది. అయినా 2024–25 సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పాత బాటనే పట్టినాయి. ఎన్నికల నుంచి అధికార భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. ప్రైవేటీకరణ, దిగుమతులు, విదేశీ విధానాల విషయాల్లో పాతబాటనే సాగుతోంది.

మారుతున్న వాతావరణం వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పిన నివేదిక, ఆహార ఉత్పత్తి పెరిగింది అని చెబుతున్నది. ఈ వైరుద్ధ్యం మీద ఉన్నశంక తీర్చే ప్రయత్నం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, అకాల వర్షాలు ఒక వైపు నష్టపరుస్తుంటే పంటల దిగుబడి ఎట్లా పెరుగుతున్నది? ప్రధానంగా, రైతుల ఆర్థిక పరిస్థితి మీద అంచనా మాత్రం చేయలేదు.

బడ్జెట్‌ కేటాయింపులలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొత్త ఆలోచన విధానం ఏదీ కనపడటం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది, వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారు చేయటం. అయితే, ఎట్లా సాధిస్తారు? బడ్జెట్లో కేటాయింపులతో ఇది సాధ్యమయ్యే పని కాదు.

ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులను మారుస్తామని తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పినా వాస్తవానికి ఇది కొత్త పథకం కాదు. 2023–24లో దానికి ఇచ్చింది రూ.459 కోట్లు మాత్రమే. ఈసారి అది కూడా తగ్గించి రూ.365.64 కోట్లు ఇచ్చారు. 2023–24లో ప్రకృతి వ్యవసాయానికి సవరించిన బడ్జెట్‌ రూ.100 కోట్లు మాత్రమే. ప్రకృతి వ్యవసాయం కాకుండా పంటల దిగుబడిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఉపాయం ఏది?

వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని పదే పదే ఆర్థిక సర్వేలు చెప్పినా, వ్యవసాయ బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించారు. 2022–23లో రూ.1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24లో రూ.1,15,531.79 కోట్లకు తగ్గాయి. ఇది 7 శాతం తగ్గింపు. 2024–25లో వ్యవసాయ పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా పరిశోధనలకు ఇచ్చినవి మొత్తం రూ.9,941 కోట్లు మాత్రమే. ప్రకటించిన స్థాయిలో కేటాయింపులు లేవు. 2022–23లో ఇదే పద్దుకు ఇచ్చినవి రూ. 8,513.62 కోట్లు. 2023–24లో ఇచ్చినవి రూ.9,504 కోట్లు.

పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ.7,137 కోట్లు ఈసారి ఇచ్చారు. అంతకుముందు సంవత్సరాలలో వరుసగా కేటాయించింది రూ.6576.62 కోట్లు, రూ.5,956.70 కోట్లు. నిధులు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ.13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారినపడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం.

కొత్త ఉపాధి కల్పన పథకం ప్రవేశపెట్టి రూ.10 వేల కోట్లు బడ్జెట్‌ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెలవారీ జీతం తీసుకునే యువతకు (సంవత్సరానికి రూ.లక్ష వరకు) కొంత భృతి చెల్లించే ఈ పథకం లక్ష్యం అంతుబట్టకుండా ఉన్నది. గ్రామీణ భారతంలో ఉన్న ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు చేయడం లేదు. ఈ పథకం కేవలం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు రాయితీగా ఇస్తునట్టు కనబడుతున్నది.

శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉద్యోగ రక్షణకు కాకుండా ఫ్యాక్టరీలలో ఉపాధికి ఈ రాయితీ ఇవ్వడం అంటే ఆ యా కంపెనీలకు ఇవ్వడమే! పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడిపోతున్నది. ఆహార ద్రవ్యోల్బణం వల్ల సరి అయిన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. పర్యావరణానికి దోహదపడే చేతివృత్తుల ఉపాధికి ఈ పథకం ఇచ్చివుంటే బాగుండేది.

వివిధ మార్గాల ద్వారా 2024–25లో కేంద్రం ఆశిస్తున్న ఆదాయం రూ. 46,80,115 కోట్లు. పోయిన సంవత్సరం మీద రాబోయే సంవత్సరంలో పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.2,50,000 కోట్లు. కానీ పెరిగిన ఈ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద పెట్టడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెరుగుతున్నది. 2022–23 నాటికే ఇది రూ.1,54,78,987 కోట్లకు చేరింది.

మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులకు రూ. 11 లక్షల కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు. అభివృద్ధి అందరికీ కాకుండా కొందరికే పోతున్నది అని నివేదికలు చెబుతున్నప్పటికీ, అభివృద్ధి తీరులో మార్పులకు కేంద్ర ప్రభుత్వ సిద్ధంగా లేదు. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించే రోడ్లు, వంతెనలు వగైరా మౌలిక వసతులు నాసిరకం నిర్మాణం వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూలిపోతుంటే పరిస్థితిని సమీక్షించకుండా, సమస్య లోతులను గుర్తించకుండా పదే పదే ఈ రకమైన పెట్టుబడుల మీద ప్రజా ధనం వెచ్చించడం వృథా ప్రయాసే అవుతుంది.