వ్యాసకర్త : డా|| దేవరాజు మహారాజు, సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ మెల్బోర్న్‌ నుంచి

ప్రజల్లో నాటుకుపోయిన బలమైన అభిప్రాయాల్ని మార్చడం అంత తేలిక కాదు. అట్లని ప్రజల అభిప్రాయాలన్నీ సరైనవేనని శాస్త్రీయ వివరణలు ఇవ్వడం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ‘పునర్జన్మ’ అనేది మత సంబంధమైన ఒక విశ్వాసం అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా చెప్తోంది. ఈ నమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కానీ, ఆసియాలో మరీ ఎక్కువ. ముఖ్యంగా హిందూ, సిక్కు మతాలు జైన, బౌద్ధాలలో కొన్ని శాఖలు పునర్జన్మను, మానవాతీత శక్తుల్ని నమ్ముతున్నాయి. ఇటు భారతీయ సంస్కృతి అటు గ్రీకు సంస్కృతులలో ఈ నమ్మకాలు జీర్ణమైపోయాయి. కొన్ని క్రైస్తవ శాఖలలోనూ ఈ నమ్మకాలు ఎక్కువ.
ఉపనిషత్తుల్లో ఈ విశ్వాసాల ప్రస్తావన ఉంది. అంతెందుకు మాంత్రికులు పరకాయ ప్రవేశం చేసి, తమాషాలు చేసిన సంఘటనలు మన తాతమ్మ, అమ్మమ్మలు చెప్పే కథల్లో కోకొల్లలుగా ఉంటాయి. అందుకే, ఇంత వరకున్న మన సాహిత్యంలో ప్రధానంగా అశాస్త్రీయ ధోరణులే ఉన్నాయి. అందులోంచి బయటపడి, ఆధునిక వైజ్ఞానిక దృష్టి కోణం లోంచి నూతన సాహిత్య సృష్టి చేయాల్సి ఉంది.
ఇక్కడ మనం గ్రహించాల్సిందేమంటే-కర్మ సిద్ధాంతం నమ్మిన చోటే పునర్జన్మ ఉంటోంది. కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే పునర్జన్మా ఉండదు, మానవాతీత శక్తులూ ఉండవు.
పుట్టిన పాపాయి మెదడులో గత జన్మకు సంబంధించిన ఛాయలు ఉంటాయని భారతీయ తత్వవేత్తలలో సాంఖ్యావాదులు చెపుతున్నారు. ఈ వాదాన్ని ఆధారం చేసుకునే అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు కథలల్లుతున్నారు. బాలికకో, బాలుడికో పునర్జన్మ జ్ఞాపకాలున్నాయని నిరూపించడానికి ప్రయత్నిస్తూ వార్తలు సృష్టిస్తున్నారు. ఈ విషయం ఇతివృత్తంగా సాహిత్యం, చిత్రలేఖనాలు, చలనచిత్రాలు వగైరాలన్నీ రూపు దిద్దుకుంటూ వస్తున్నాయి. ఈ అభిప్రాయం ఎంతగా నాటుకు పోయిందంటే-ఎవరైనా ఇదంతా ట్రాష్‌ అని అంటే చాలామందికి నచ్చదు. పైగా, మనోభావాలను దెబ్బ దీసుకుంటారు కూడా! దేవుడు, మానవాతీత శక్తులు, ఆత్మ, పునర్జన్మ మొదలైనవన్నీ ఒకదాని మీద ఒకటి పెరిగినవి. పేక మేడల్లాగా-ఇందులో ఏ ఒక్కదాన్ని పడగొట్టినా మిగతావన్నీ సులభంగా కూలిపోతాయి!
కొంతమందిలో కొన్ని విషయాలలో అసాధారణ ప్రతిభ కనిపిస్తుంది. కదా? అంటే అది నిజమే! అలాంటి వాటిని జీవశాస్త్రం ఒప్పుకుంటుంది. సహజ సిద్ధంగా కొందరికి కొన్ని విషయాలలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉండొచ్చు అవన్నీ మహిమలు కావు. అతీంద్రియ శక్తులు కూడా కావు. వారసత్వ లక్షణాల నుండి వచ్చిన ప్రతిభ అది. దాన్ని కొందరు స్వయంకృషితో మరింతగా మెరుగు పరుచుకుంటారు. అంతే తప్ప పూర్వజన్మ లక్షణాలు కావు. ఇక పోతే, మరణం తర్వాత జీవితాన్నీ, మానవాతీత-శక్తులు ఉండడాన్నీ విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోదు. గణిత శాస్త్ర సమస్యల్ని కంప్యూటర్‌ కంటే వేగంగా పరిష్కరిస్తున్న వాళ్ళను నిజజీవితంలో చూస్తునే ఉన్నాం. మూడేళ్ళ వయసులోనే చక్కని నాట్య ప్రదర్శన ఇస్తున్న పసికూనలు మన మథ్యలోనే ఉన్నారు. శతావధానాలు, గారడీ విద్యలు, ఇంద్రజాలాలు మన నిత్య జీవితంలో భాగమైపొయ్యాయి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే విశేషాలు వీటిలో ఉన్నాయి. అంత మాత్రం చేత ఇవి మానవాతీత శక్తులుగా చలామణి కావడం లేదు. మానవాతీత శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించుకోవడం కంటే, అసలు అలాంటివి ఉండడానికి వీలుందా? – అని ఆలోచించడం ముఖ్యం.
విజ్ఞాన శాస్త్ర ప్రకారం పదార్థం, పదార్థ లక్షణాలూ మనకు తెలుసు. పదార్థాన్ని విభజిస్తూ పోతే, తుదకు విభజించడానికి వీలుకాని సూక్ష్మకణాలు మిగులుతాయి. వాటినే అణువులు అంటున్నాం. అణువులను వాటి మార్పులను బట్టి రసాయనిక జీవ ప్రక్రియలను అర్థం చేసుకుంటున్నాం. వ్యాఖ్యానిస్తున్నాం. పదార్థ స్వభావాన్ని పరిశీలించడం, వాటిని క్రమ పద్ధతిలో పొందుపరచడం, వివిధ పరిశీలనల ఫలితాను సమీక్షించు కోవడం సమన్వయించుకోవడం ఒక పద్ధతి. ఈ పరిశీలనల ఆధారంగా కొన్ని ఉపయోగకరమైన-వివేక వంతమైన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. సిద్ధాంతం నిర్దేశించిన సూత్రాలను ప్రయోగం నిర్ధారిస్తుంది. పునర్జన్మ, మానవాతీత శక్తుల గురించి మత విశ్వాసకులు చెప్పేది సిద్ధాంతాలే తప్ప, వారు చేసిన ప్రయోగాలు ఏమున్నాయనీ? చూపించిన దాఖలాలు ఏమున్నాయనీ? మరణించిన ప్రాణి మళ్ళీ బతకగలదని -టెలిపతి, సైకోకైనసిస్‌, ప్రికాగ్నిషన్‌, క్లెరోయన్స్‌ వంటివి ఉంటాయని సహేతుకంగా చెప్పడానికి వీలులేదు. ఈ విశ్వాంతరాళంలో ఇంకా మనకు తెలియని పదార్థాలు, అణువులు ఉన్నాయని బయటపడితే, వాటి లక్షణాలు అర్థమైతే, అప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ విశ్లేషించుకోవచ్చు.
ఆత్మ, పునర్జన్మకు సంబంధించి కొందరు వితండవాదాలు చేస్తుంటే, మరి కొందరు నిజాయితీగా ఉత్సుకతతో పరిశీలనలు ప్రయోగాలు చేస్తున్నారు. అమెరికాలో ఇఐయమ్‌. హాన్సెల్‌ అనే అతను ఈ విషయాల్లో విశేషంగా కృషి చేశాడు. నిజ నిర్ధారణకు పూనుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో తొంభయి తొమ్మిది మంది తాము చేసినవి తప్పిదాలని, మహిమలు కావని ఒప్పుకున్నారు. ఉదాహరణకు మార్గరెట్‌ షాక్స్‌ సోదరీమణుల విషయం చెప్పుకోవచ్చు-మార్గరెట్‌, లియాఫిష్‌ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు బాల్యంలో తమ తల్లిని భయపెట్టడానికి సరదాగా ఏవేవో కొంటె చేష్టలు చేస్తుండేవారు. లైట్లు, ఆర్పేసి పడుకున్న తర్వాత, కాలి బొటన వేళ్ళను టిక్‌టిక్‌మని విరవడం, రెండు బొటన వేళ్ళ గోళ్ళు వేగంగా రాసి, ఆ రాపిడితో వింత వింత ధ్వనులు సృష్టించడం అభ్యాసం చేశారు. అది ఇల్లు దాటి, ఊరు దాటి, పట్టణాలకు తెలిసే సరికి జనం తండోప తండాలుగా రావడం మొదలు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. తాము సృష్టించుకున్న ఆధ్యాత్మిక చీకటి గది లోంచి జవాబులివ్వడం మొదలు పెట్టారు. డబ్బు విపరీతంగా రావడం మొదలైంది. వారు పెరిగి, వివాహాలు చేసుకుని, కుటుంబ బాధ్యతలు మోయాల్సిన దశలో ఇక వీలుకాక ప్రదర్శనలు ఆపేశారు. ఇలాంటి పనులు ఆందరూ డబ్బుకోసమే చేయకపోవచ్చు. పేరు కోసం, ప్రత్యేక గుర్తింపు కోసం కూడా చెయ్యెచ్చు లేదూ కష్టపడకుండా గొప్పవాళ్ళను తమ చుట్టూ తిప్పుకోవచ్చని కూడా చెయ్యెచ్చు.
ఇక్కడ మనం మరోక విషయం ఆలోచించాలి! ఆకలి, దాహం, బాధ సంతోషం లాగా-నిజంగా పునర్జన్మ గానీ, మానవాతీత శక్తులు గానీ ఉంటే, అవి మనుషులందరికీ అనుభవంలోకి రావాలి. కానీ, యోగులకు సన్యాసులకు, బాబాలకు మాత్రమే కొన్ని వింత అనుభవాలు ఎందుకొస్తున్నాయి? వస్తున్నాయని వారు ప్రకటించుకుని వాటితో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నది మనం గ్రహించాలి. పోనీ అలా వస్తే వాటిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించిన వారు ఎవరూ లేరు కదా? నిజ నిర్థారణకు నిలబడి రుజువు పరిచిన వారు లేరు కదా? ఉట్టి మాటలను మేజిక్కులని, అతీంద్రియ శక్తులని ఎలా నమ్ముదాం? ప్రతి జీవికి ఆత్మ ఉందనే అనుకుందాం. ఊరికే చర్చ కోసం అనుకుందాం-అయితే ఒక ఆత్మ విడిపోయి రెండు మూడు ప్రాణాలుగా జన్మ నెత్తుతుందన్న విషయం ఎవరూ చెప్పలేదు. ఒకప్పుడు మనం ముక్కోటి ఆంధ్రులం జనాభా పెరిగి రెండింతలకు పైగా అయ్యాం, అంటే ఈ పెరుగుతున్న ఆత్మలు ఎక్కడివీ? జీవశాస్త్రం జవాబు చెప్పగలదు, కానీ, వాటి గురించి ఎక్కువగా మాట్లాడే వారి దగ్గర సమాధానం లేదు. శాస్త్రీయ దృక్పథం కలిగి, పరిణామ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే భౌతిక వాదులకు జవాబు దొరుకుతుంది. పునర్జన్మ నిజం కాదనీ, కేవలం మత సంబంధమైన ఒక ప్రగాఢ విశ్వాసమేనని!

వ్యాసకర్త : డా|| దేవరాజు మహారాజు, సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ మెల్బోర్న్‌ నుంచి